ఏటూరు నాగారంలో మంగళవారం నాడు దళిత, గిరిజన దండోరా సభ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క స్పృహ తప్పి కిందపడిపోయారు. ఆమెను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
వరంగల్: ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత సీతక్క మంగళవారం నాడు అస్వస్థతకు గురయ్యారు. ఏటూరు నాగారం మండల కేంద్రంలో సీతక్క నేతృత్వంలో ఇవాళ దళిత గిరిజన దండోరా యాత్ర నిర్వహించారు. ఈ యాత్రను పురస్కరించుకొని సీతక్క 4 కి.మీ. పాదయాత్ర నిర్వహించారు. స్థానిక మార్కెట్ యార్డు నుండి తహసీల్దార్ కార్యాలయం వదరకు ర్యాలీ నిర్వహించారు.
తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వోకి వినతిపత్రం అందించి అక్కడే కూర్చొన్న సమయంలో సీతక్క సొమ్మసిల్లిపడిపోయారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సీతక్కను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.సీతక్కకు వైద్యులు పరీక్షించారు.
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత దళిత గిరిజన దండోరా పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తూ కేసీఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.సీతక్క అనారోగ్యం పాలు కావడంపై ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.