యాగంలో కేసీఆర్ దంపతులు (వీడియో)

Jan 24, 2019, 3:00 PM IST

దేశం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్వహిస్తున్న సహస్ర మహా చండీ యాగము నాలుగవ రోజు ఉదయం పూట కార్యక్రమాలు 


ఉదయం యాగశాలలో సతీసమేతంగా ప్రవేశించిన ముఖ్యమంత్రి మొదట రాజశ్యామల మాత మంటపంలో పూజలు నిర్వహించారు. శ్రీ మహాకాళి , మహాలక్ష్మి , మహా సరస్వతి , స్వరూపిణిగా శ్రీ రాజశ్యామలాదేవిని సువర్ణ మంత్ర పుష్పాంజలితో సీఎం దంపతులు ప్రార్ధించారు . సర్వ మంగళ మాంగల్యే ... శ్రీ రాజశ్యామలా దైవేయ నమస్తే ... అంటూ ఋత్వికులు వేదోక్తంగా ప్రార్థనలు చేశారు. రాజశ్యామల మంటపంలో సీఎం దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు . 

అనంతరం మహారుద్ర మంటపంలో జరిగిన పూజలో సీఎం పాల్గొన్నారు. మహారుద్ర సహిత రుద్ర ఏకాదశిని పఠన రుద్ర నమకం , రుద్ర చమకం పటించారు. పంచాక్షరి జపంలో భాగంగా శివశివ శంకర భూత పతే , శంకర శివ , శంభో మహాదేవ , హరహర మహాదేవ అనే ప్రార్ధనలు యగశాలలో మారుమోగాయి . 

బ్రహ్మ స్వరూపిణి బగళాముఖి మంటపంలో
సీఎం దంపతుల సమక్షంలో వేదపండితులు , ఋత్వికులు పూజలు చేశారు. గౌరీ నారాయణ నమస్తుతే , పీతాంబర దేవీ నమస్తుతే , జయతే , విజయతే , జయ విమలే బగలే అంటూ దేవిని స్తుతించారు .శతమానం భవతే అంటూ పండితులు సీఎం దంపతులను దీవించారు . నవగ్రహ మంటపంలో ఆదిత్య హృదయం పఠనం , సూర్య నమస్కారాలు నిర్వహించారు. చండీమాత ప్రధాన యాగశాలలో రాజరాజేశ్వరి మాత ప్రార్ధన చేశారు . భువనేశ్వరి , బ్రహ్మాండ కుటుంబినీ , శ్రీ గణనాధ పార్వతీ నందన , పాపవిమోచన అంటూ ప్రార్థనలు నిర్వహించారు . ఋత్వికులు 400 సార్లు చండీ సప్తశతి పారాయణము పటించారు. వేదపండితులు యాగం వీక్షించడానికి వచ్చిన భక్తులకు సుభాషితాలు వినిపించారు . యాగ విశిష్టతను వివరించారు . మహాహారతి తో ఉదయం పూట కార్యక్రమాలు ముగిశాయి .