రాహుల్ ని బఫూన్ అనడంలో తప్పేమి లేదు:కవిత(వీడియో)

Dec 19, 2018, 1:10 PM IST

 కెసిఆర్.. రాహుల్ గాంధీని బఫూన్ అనడంలో తప్పేమీ లేదని నిజామాబాద్ ఎంపీ కవిత అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష నేత పార్లమెంటు నిబంధనలు ఉల్లంఘిచి దేశ ప్రధానిని ఎలా హత్తుకున్నారో దేశ ప్రజలంతా చూశారని ఆమె అన్నారు. సిల్లీగా ప్రవర్తించేవారిని బఫూన్ అనే అంటారని ఆమె పేర్కొన్నారు. 

ఫెడరల్ ఫ్రంట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని ఆమె అన్నారు.తమ ఎజెండా దేశ ప్రజల కోసం పనిచేయడమని.. రాజకీయ పార్టీల కోసం కాదని స్పష్టం చేశారు. దేశంలో అనేక రాజకీయ కూటములున్నాయని..కొన్ని విజయం సాధించాయన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అధికారం లో ఉందని.. ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పరచడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. 

బిజెపి, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తటస్థ కూటమి ఏర్పాటు కావాల్సిన సమయం ఏర్పడిందని ఆమె అభిప్రాయపడ్డారు.  రాహుల్ గాంధీ ని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే రాజకీయ కూటమిలో టిఆర్ఎస్ లేదన్నారు.  రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా వ్యతిరేకిస్తున్న స్ధానిక‌ పార్టీల జాబితాలో తాము ఉన్నామన్నారు.

ఒక అభ్యర్థి ప్రధాని కావడం ఒక పార్టీ అధికారం లోకి రావడం కాదని.. దేశ ప్రజల‌సమస్యలను పరిష్కరించడమన్నారు.  జాతీయ స్ధాయిలో ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ఫెడరల్ ఫ్రంట్ పాత్ర ఉండబోతుందన్నారు. నాలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ భారీ విజయాలేమీ సాధించలేదన్నారు. జాతీయ రాజకీయాలలో ప్రజలకు దగ్గరగా ఉండే స్దానిక పార్టీలు పెద్ద పాత్ర పోషిస్తాయన్నారు