బీఆర్ఎస్ పార్టీ ప్రకటనకు కవిత గైర్హాజరు.. ఆయుధపూజ చేసుకుంటున్నానని పోస్టులు.. విభేదాలంటూ ఊహాగానాలు...

By SumaBala BukkaFirst Published Oct 7, 2022, 8:31 AM IST
Highlights

బీఆర్ఎస్ పార్టీ ప్రకటన సమావేశానికి కల్వకుంట్ల కవిత గైర్హాజరు కావడం మీద ఇప్పుడు అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కుటుంబంలో విభేదాలే కారణమంటూ ప్రచారం జరగుతోంది. 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా  మారుస్తూ అధికారికంగా ప్రకటన చేసిన వేళ తెలంగాణ భవన్లో నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్సీ కవిత గైర్హాజరయ్యారు. టిఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు,  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు సహా  283 మంది ప్రతినిధులు హాజరైనా.. కవిత మాత్రం సమావేశానికి హాజరు కాలేదు. ఉప ఎన్నిక కోసం ప్రకటించిన ఇంచార్జ్ ల జాబితాలోనూ కవిత పేరు లేదు. అయితే తాను ఇంట్లో ఆయుధపూజ చేసుకుంటున్నట్లు కవిత సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

దీంతో కవిత గైర్హాజరుపై ఊహాగానాలు మొదలయ్యాయి. కేసీఆర్ కుటుంబంలో విభేదాలు ఉన్నాయేమోనని ప్రచారం జరుగుతుంది. సర్వసభ్య సమావేశానికి మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, హరీష్ రావు కూడా హాజరయ్యారు. కవిత మాత్రమే గైర్హాజరు కావడంపై ప్రతిపక్ష నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి తెలంగాణ భవన్లో నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో మొదట టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రవేశపెట్టారు. టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,  జిల్లా పార్టీ అధ్యక్షులు బలపర్చారు. ఈ తీర్మానాన్ని కెసిఆర్ ఆమోదించారు. కొత్త పార్టీ బీఆర్ఎస్ ను కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. జాతీయ పార్టీ జెండా, ఎజెండాను తమ పార్టీ నేతలకు కేసీఆర్ వివరించారు.

బీఆర్ఎస్‌ పేరుతో ప్రజల తీర్పును కోరాలి: కేసీఆర్ ను కోరిన బండి సంజయ్

కాగా, బీఆర్ఎస్ కు మునుగోడు ఉప ఎన్నిక పరీక్షగా మారింది. నేటి నుంచి 14 వరకు మునుగోడు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరగనుంది. ఈలోగా అభ్యర్థి ప్రకటన, నామినేషన్ దాఖలుపై ఆలోచనా ధోరణిలో గులాబీ బాస్ ఉన్నారు. టిఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారా? లేక బిఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికలకు పోతారా? అన్న సందిగ్ధంలో క్యాడర్ ఉంది. తెలంగాణ సెంటిమెంట్ పదం లేకుండా.. బీఆర్ఎస్ పేరుతో నామినేషన్ వేస్తే ఎలా అన్న సందిగ్ధంలో క్యాడర్ ఉంది. 

దీంతో టిఆర్ఎస్ పేరుతోనే నామినేషన్లు వేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఊహాగానాల నేపథ్యంలోనే మునుగోడు ఉప ఎన్నికలో కొత్త పేరుతో పోటీ చేస్తారనే ప్రచారంపై టీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టత ఇచ్చారు. పేరు మార్పుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించేవరకు బీఆర్ ఎస్ గా మారినా.. టీఆర్ఎస్‌గానే పార్టీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. మునుగోడు ఉపఎన్నిక తొందర్లోనే ఉన్నందున.. టీఆర్ఎస్ పేరుతోనే ముందుకు వెళ్తామని చెప్పారు. 

మరోవైపు మునుగోడు ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ పకడ్బందీ వ్యూహం అమలు చేస్తోంది. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించింది. ప్రతి యూనిట్ కు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇన్చార్జి బాధ్యతలను అప్పగించింది. 14 మంది మంత్రులు, ముగ్గురు ఎంపీలు, 54 మంది ఎమ్మెల్యేలను ఇన్చార్జిగా నియమించింది. ఏడుగురు ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్ లకు పూర్తి బాధ్యత అప్పగించింది. 

ప్రతి ఎంపీటీసీ పరిధికి ఒక ఎమ్మెల్యే, మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. ఒక్కో ఎమ్మెల్యేకు 800 నుంచి 1200 మంది ఓటర్లు ఉన్నారు. మంత్రులకు అత్యధికంగా మూడువేల ఓటర్ల బాధ్యతలు అప్పగించారు. ప్రచారం చివరి రోజు వరకు నియోజకవర్గంలోనే ఉండాలని కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు. 

 

On this auspicious day of , we performed Ayudha Pooja at home. pic.twitter.com/wtsrrXvbyq

— Kavitha Kalvakuntla (@RaoKavitha)
click me!