19, Jan 2019, 11:18 AM IST
తెలంగాణ జాగృతి మూడు రోజుల పాటు హైదరాబాద్ లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సు శనివారం ఉదయం ప్రారంభం కానుంది. హైదదరాబాద్ హెచ్ ఐసిసి లోని నోవాటెల్ హోటల్లో సదస్సు జరగనుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత సదస్సు ఉద్దేశ్యాలను వివిధ దేశాలనుంచి విచ్చేసిన ప్రతినిధులకు శుక్రవారం రాత్రి నో లో జరిగిన కార్యక్రమంలో వివరించారు. గాంధీ ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని, గాంధేయ మార్గంలో సుస్థిర అభివృద్ధి సాధనతో పాటు నూతన ఆవిష్కరణలు కోసం సదస్సులో యువ నాయకులు చర్చించాలని ఎంపి కవిత కోరారు.
పద్మభూషణ్ అన్నాహజారే సదస్సు లో పాల్గొనేందుకు హైదరాబాద్ విచ్చేశారు. సార్క్ మాజీ సెక్రటరీ జనరల్ అర్జున్ బహదూర్ తాపా ప్రత్యేక అతిథిగా శుక్రవారం రాత్రి నోవా టెల్ లో జరిగిన ఆతిథ్య సమావేశంలో పాల్గొన్నారు. శ్రీలంక పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఉప మంత్రి బుదికా పథిరాణా, మాసిడోనియా రిపబ్లిక్ పెట్టుబడుల శాఖ మాజీ మంత్రి గ్లిగర్ తస్కోవిచ్, ఒకినవా, అప్ఘనిస్తాన్లలో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ వ్యవస్థాపకుడు జాన్ డిక్సన్ తో పాటు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ హాజరయ్యారు. 20వ తేదీన సాయంత్రం జరిగే ముగింపు సమావేశానికి గవర్నర్ ఇ.ఎస్.ఎల్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. గాంధేయ మార్గంలో సుస్థిర అభివృద్ధి, ఆవిష్కరణలు అనే అంశంపై సదస్సు ప్రధానంగా కేంద్రీకరిస్తుంది. 110 దేశాల నుంచి 500 కు పైగా ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యేందుకు రావడం సంతోషంగా ఉందన్నారు కవిత. 16 దేశాల నుంచి 70 మంది వక్తలు, 40 మంది ప్రత్యేక ఆహ్వానితులు హాజరవుతారని కవిత తెలిపారు.