జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుల్లో ఒకరిగా ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు (మైనర్) కోర్టులో డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు.
జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుల్లో ఒకరిగా ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు (మైనర్) కోర్టులో డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటనతో తనకు సంబంధం లేదని.. తాను ఏ తప్పు చేయలేదని పేర్కొంటూ పోస్కో కేసుల ప్రత్యేక కోర్టులో డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఈ కేసులో అభియోగాలు మోపబడిన ఇతర మైనర్లు కూడా.. తమను మేజర్లుగా విచారించాలని పేర్కొన్న జువైనల్ జస్టిస్ బోర్డ్ నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీలు దాఖలు చేశారు.
వివరాలు.. ఈ ఏడాది మే నెలలో అమ్నిషియా పబ్ నుంచి బాలికను ఇంటి వద్ద దింపుతామని తీసుకెళ్లిన కారులో తీసుకెళ్లిన నిందితులు అత్యాచారానికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు కాగా.. ఇందులో ఐదుగురు మైనర్లు, ఒక మేజర్ (సాదుద్దీన్) ఉన్నారు. ఈ ఘటనలో అరెస్ట్ అయిన నిందితులు బెయిల్‌పై విడుదలై ప్రస్తుతం బయటే ఉన్నారు.
ఇక, ఈ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు జూలైలో చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే ఈ కేసులో అభియోగాలు మోపిన నలుగురు మైనర్లను మేజర్లుగా పరిగణించి విచారిస్తామని జువైనల్ జస్టిస్ బోర్డు (జేజేబీ) ఈ ఏడాది సెప్టెంబర్‌లో తీర్పునిచ్చింది. అయితే ఎమ్మెల్యే కుమారుడిని మాత్రం జువైనల్‌గా విచారిస్తామని పేర్కొంది.
అయితే ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న నిందితులు సోమవారం కోర్టుకు హాజరైనట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. నిందితులుగా ఉన్న సాదుద్దీన్ మాలిక్, ఎమ్మెల్యే కొడుకుతో సహా మరో ఐదుగురు మైనర్లు పోలీసులు దాఖలు చేసిన అభియోగాలకు ప్రతిస్పందనగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ ఘటనతో తనకు సంబంధం లేదని.. తాను నిర్దోషి అని ఎమ్మెల్యే కొడుకు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు తమను మేజర్లుగా పరిగణించి విచారించాలన్న జువైనల్ బోర్డు నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీలు దాఖలు చేశారు. తమను మైనర్లుగానే గుర్తించాలని కోరారు. ఇందుకు సంబంధించిన విచారణను న్యాయస్థానం నవంబర్ రెండో వారానికి వాయిదా వేసినట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి.