జూబ్లీహిల్స్ పబ్ రేప్ కేసులో బెయిల్ పై విడుదలైన మైనర్లను మేజర్లుగా పరిగణించాలని పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్డుకు విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ : జూబ్లీహిల్స్లో మైనర్ బాలిక మీద అత్యాచారం కేసులో పోలీసులు నేరాభియోగపత్రం దాఖలు చేశారు. నాంపల్లి కోర్టుతో పాటు జువైనల్ జస్టిస్ బోర్డులో వేర్వేరుగా నేరాభియోగపత్రం దాఖలు చేసిన పోలీసులు 65 మందిని సాక్షులుగా చేర్చారు. 350 పేజీలతో కూడిన నేరాభియోగపత్రంలో మైనర్ బాలిక అత్యాచారం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరిచారు. మైనర్ బాలిక అత్యాచారం కేసులో పోలీసులు శాస్త్రీయమైన ఆధారాలు సేకరించారు, నిందితులకు సంబంధించిన డిఎన్ఎ.. అత్యాచారం జరిగిన కారులో సేకరించిన నమూనాలతో సరిపోలడం ఈ కేసులో కీలక పరిణామం. ఈ కేసులోని కీలక అంశాలన్నీ పొందుపరుస్తూ జూబ్లీహిల్స్ పోలీసులు నేర అభియోగపత్రం దాఖలు చేశారు.
మే 28న జూబ్లీహిల్స్ లోని ఓ పబ్ కు వచ్చిన మైనర్ బాలికను మభ్యపెట్టి సాదుద్దీన్ తో పాటు ఐదుగురు మైనర్లు వాహనంలో బేకరికి తీసుకువెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు. తర్వాత సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఇన్నోవా వాహనంలో సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు వివరించారు. ఆ తర్వాత మైనర్ బాలికను పబ్ వద్ద వదిలి పెట్టగా బాలిక అక్కడి నుంచి తన తండ్రిని పిలిపించుకుని ఇంటికి వెళ్ళింది. బాలిక ముభావంగా ఉండడంతో పాటు.. మెడపై గాయాలు గమనించిన తల్లి ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. మే 31వ తేదీన మైనర్ బాలిక తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
undefined
Amnesia Pub Rape Case : 56 రోజులు.. 65 మంది సాక్షులు, 600 పేజీలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన పోలీసులు
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు జూన్ 1వ తేదీన మైనర్బాలికను భరోసా కేంద్రానికి పంపించారు. ఇక్కడి నుంచి నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు అత్యాచారం జరిగినట్లు పోలీసులకు నివేదిక ఇచ్చారు. మైనర్ బాలిక చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో వీడియోలు తీసి వాటిని సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. బాధితురాలు చెప్పిన వివరాలతో పాటు… సాంకేతికతను ఉపయోగించుకుని పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు.
కేసులో కీలక ఆధారాలు..
ఐదుగురు మైనర్ లతో పాటు సాదుద్దీన్ ను కస్టడీలోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించారు. ఉస్మానియా ఆస్పత్రిలో లైంగిక సామర్థ్య పరీక్షలు చేయించారు. నిందితులు ఉపయోగించిన వాహనంలో క్లూస్ టీం అధికారులు పలు నమూనాలు సేకరించారు. బాధితురాలి దుస్తులను సేకరించిన పోలీసులు.. నిందితుల డీఎన్ఏ నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. బాధితురాలి దుస్తులపై నిందితుల వీర్యం ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదికలో బయటపడింది. నిందితుల డీఎన్ఏ ఇన్నోవా కార్లో నమూనాలతో సరిపోయినట్లు ఫోరెన్సిక్ అధికారులు నివేదిక ఇచ్చారు. పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలతో పాటు.. అత్యాచారం జరిగిన సమయంలో ఫోన్ సిగ్నల్స్ ను సేకరించారు. అత్యాచారం జరిగిన సమయంలో ఆరుగురు నిందితులు ఫోన్ సిగ్నల్స్ జూబ్లీహిల్స్లోని చూపించాయి. అన్నింటినీ జూబ్లీహిల్స్ పోలీసులు నేర అభియోగ పత్రంలో పొందుపరిచారు. ఐదుగురు మైనర్లు బెయిల్ పై ఇటీవల విడుదలయ్యారు. సాదుద్దీన్ పిటిషన్పై హైకోర్టులో పెండింగ్లో ఉంది.
తీవ్రమైన నేరం అని తెలిసినా …
ఐదుగురు మైనర్లకు తాము చేస్తున్నది తీవ్రమైన నేరం అని తెలుసు. అయినా, ఏమాత్రం వెనకడుగు వేయకుండా సామూహిక అత్యాచారం చేసినట్లు పోలీసులు నేర అభియోగ పత్రంలో పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో మైనర్ లను సైతం మేనేజర్లుగా పరిగణిస్తూ వెలువడిన న్యాయస్థానాల తీర్పులను జూబ్లీహిల్స్ పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్డుకి సమర్పించిన నేరాభియోగపత్రంలో పొందుపరిచారు. ఈ కేసులో ఐదుగురు మైనర్ లను మేజర్లుగా పరిగణిస్తూ విచారణ చేయాలని కోరారు.