దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్: సుప్రీం కమిటీ సభ్యుల నేపథ్యం ఇదే...

By telugu team  |  First Published Dec 13, 2019, 2:01 PM IST

దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణ కమిషన్‌లోని సభ్యులు క్రిమినల్‌ కేసులను పరిష్కరించడంలో అంతుచిక్కని సమస్యలకు సమాధానాలు కనుక్కోవడంలో దిట్టలు. ఈ త్రిసభ్య కమిషన్ కి మాజీ సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తి సిరిపుర్కర్ అధ్యక్షత వహిస్తున్నారు.  మాజీ బొంబాయి హైకోర్టు అడిషనల్ జడ్జిగా రిటైర్ అయిన  జస్టిస్‌ రేఖా ప్రకాశ్‌ సోండుర్‌ బల్డోటా, మాజీ ఐపీఎస్ ఆఫీసర్  డీఆర్‌ కార్తికేయన్‌ సభ్యులుగా ఉన్నారు. 


చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌ ఘటనపై దర్యాప్తు చేయడానికి సుప్రీం కోర్టు ముగ్గురు సభ్యులను నియమిస్తూ తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. జాతీయ మానవహక్కుల కమిషన్, సిట్ దర్యాప్తు చేస్తున్నాయి కాబట్టి సుప్రీమ్ మరో కమిషన్ ని నియమించాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం తరుఫున వాదనలు వినిపిస్తున్న మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి కోరినప్పటికీ, సుప్రీమ్ ఆ వాదనను తోసి పుచ్చుతూ... ఈ త్రిసభ్య కమిషన్ ని ఏర్పాటు చేసింది.  

ఈ కమిషన్‌లోని సభ్యులు క్రిమినల్‌ కేసులను పరిష్కరించడంలో అంతుచిక్కని సమస్యలకు సమాధానాలు కనుక్కోవడంలో దిట్టలు. ఈ త్రిసభ్య కమిషన్ కి మాజీ సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తి సిర్పుర్కర్‌ అధ్యక్షత వహిస్తున్నారు.  మాజీ బొంబాయి హైకోర్టు అడిషనల్ జడ్జిగా రిటైర్ అయిన  జస్టిస్‌ రేఖా ప్రకాశ్‌ సోండుర్‌ బల్డోటా, మాజీ ఐపీఎస్ ఆఫీసర్  డీఆర్‌ కార్తికేయన్‌ సభ్యులుగా ఉన్నారు. 

Latest Videos

వీరి ప్రొఫైల్ గనుక పరిశీలిస్తే వీరినే సుప్రీమ్ కోర్ట్ ఈ ఎన్కౌంటర్ నిగ్గు తేల్చడానికి ఎందుకు నియమించిందో మనకు ఇట్టే అర్థమయిపోతుంది. వీరిలో ఇద్దరు లాయర్ వృత్తిని చేపట్టి... చాలా కలం ఆ వృత్తిలో కొనసాగిన తరువాత జడ్జిలుగా పదోన్నతుల పొందారు. 

వీరు లాయర్లుగా సైతం ఇటువంటి అనేక కేసులను వాదించారు కూడా. ఇక కార్తికేయన్ విషయానికి వస్తే ఈయన ఒక సూపర్ కాప్. ఇటువంటి సంఘటనల నిగ్గు తేల్చడంలో అందే వేసిన చేయి. ఈయన మానవహక్కుల సంఘంలో సైతం తన సేవలను అందించాడు. 

జస్టిస్‌ వికాస్‌ శ్రీధర్‌ సిర్పుర్కర్‌

జస్టిస్‌ వికాస్‌ శ్రీధర్‌ సిర్పుర్కర్‌ గురించి మనకు అర్థం అవ్వాలంటే ఆయన కలకత్తా హై కోర్ట్ న్యాయమూర్తిగా సెర్వలందిస్తున్నప్పడి ఒక సంఘటనను మనం అర్థం చేసుకుంటే...ఈయన ధర్మనియతి మనకు యిట్టె అర్థమయిపోతుంది. 

Also read: దిశపై గ్యాంగ్‌రేప్, హత్య: తేల్చిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్

అని 2005 మే నెలలో కలకత్తా హైకోర్టుకు అనుసంధానంగా ఉన్న జ్యుడీషియల్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్న వారిని అప్పటి హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్‌ వికాస్‌ శ్రీధర్‌ సిర్పుర్కర్‌  ఒక ప్రశ్న అడిగారు. సుప్రీంకోర్టు అనుసరించే ధర్మసూత్రం ఏమితి అని ఆయన ప్రశ్నించారు. అక్కడ ఉన్న సభికులంతా ముక్త కంఠంతో  ‘‘సత్యమేవ జయతే’’ అని చెప్పారు. 

వెంటనే  సిర్పుర్కర్‌ ఆ సమాధానం తప్పని, ‘యతో ధర్మ స్తతో జయః’ అన్నది సుప్రీం అనుసరించే సిద్ధాంతం అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ధర్మ దేవత కళ్ళకు గంతలు ఎందుకు కడ్తారో కూడా అక్కడ ఉన్న వారికి వివరించారు. మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామంలో గాంధారి పాత్రతో సాదోహరణంగా వివరించారు. 

కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభానికి ముందురోజు తన ఆశీస్సులు కోరడానికి వచ్చిన కొడుకు దుర్యోధనుడితో గాంధారి అన్న మాటను ఉటంకిస్తూ ఆమె వైఖరి గురించి చెప్పుకొచ్చారు. ఆమె కనబర్చిన నిష్పక్షపాత వైఖరే న్యాయదేవత కళ్లకు గంతలు కట్టడం వెనుక ఉన్న పరమార్థం అని  సిర్పుర్కర్‌ వివరించారు. 

ఈ నిష్పాక్షిక ధోరణే న్యాయమూర్తులకు, న్యాయవాదులకు మార్గం కావాలని ఆయన వారందరికీ ఉద్బోధ చేసారు. అలా పాఠం చెప్పిన జస్టిస్‌ వికాస్‌ శ్రీధర్‌ (వీఎస్‌) సిర్పుర్కర్‌ నే దిశ హత్యాచారం నిందితుల ఎన్కౌంటర్ పై విచారణకు సుప్రీంకోర్టు నియమించింది. 

ఈ విశ్రాంత న్యాయమూర్తి!1946లో నాగ్‌పూర్‌లోపుట్టారు. 21 ఏళ్ల వయసుకే న్యాయవాద వృత్తిని చేపట్టారు.  ఆయన కుటుంబమంతా న్యాయ విద్య కోవిదులే!  ఈయన పెళ్లి కూడా ఒక సంచలనం. తన ప్రత్యర్థి లాయర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 

Also read: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఎఫ్ఐఆర్: ఆ రోజు ఏం జరిగిందంటే...

కాలేజీలో జూనియర్‌ అయిన, తనకు వ్యతిరేకంగా హైకోర్టులో అనేక కేసులు వాదించిన కుంకుమ్‌ అనే లాయర్నే ఆయన పెళ్లి చేసుకున్నారు. 24 సంవత్సరాల పాటు న్యాయవాద వృత్తిని నిర్వహించిన తరువాత, 1992 లో బాంబే హైకోర్టులో ఆయన జడ్జి గా నియమింపబడ్డారు.

ఆ తరువాత మద్రాస్‌ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆ తరువాత కలకత్తా హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసారు. 

ఆయన పనిచేసిన ప్రతిచోటా కూడా జుడీషియల్‌ అకాడమీలు వంటివి నెలకొల్పి అందరికి న్యాయ శాస్త్రంపై సమగ్ర అవగాహన కల్పించేవారు. ఆయన కోర్టుల్లో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. 2012 జనవరి 12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. దాదాపు నాలుగున్నర యేండ్లు పనిచేసి పదవీ విరమణ చేశారు.
 
ఈయన అనేక ప్రధాన కేసుల్లో తీర్పును వెలువరించారు. 2000వ సంవత్సరం ఢిల్లీ ఎర్రకోట పై ఉగ్రవాదుల దాడి ఘటనలో ప్రధాన నిందితుడైన పాక్‌ జాతీయుడు మొహమ్మద్‌ ఆరిఫ్ అలియాస్ అష్ఫక్ కి ఉరిశిక్ష విధించినది ఈయనే.  

పార్లమెంట్‌పై దాడి కేసు నిందితుడైన అఫ్జల్‌ గురు ఉరిని ‘‘కోర్టులు చేసిన హత్య’’గా జేఎన్‌యూ విద్యార్థులు, మేధావులు విమర్శించడాన్ని ఆయన తీవ్రంగాతప్పుబట్టారు. అఫ్జల్‌ గురు విషయంలో పూర్తిస్థాయి విచారణ జరిగిందని, ఎటువంటి పక్షపాతధోరణి ఇందులో పొడచూపలేదని ఆయన వివరణ ఇచ్చారు. 

ఇంత కఠినంగా వ్యవహరించిన ఈయన ప్రజల స్వాతంత్రాలకు కూడా పెద్దపీట వేశారు. ఆ తీర్పును విమర్శించిన విద్యార్థులను కోర్టు ధిక్కార నేరం కింద కేసులు పెట్టాలన్న డిమాండ్‌ను ఆయన సమర్థించలేదు.

అంతటితో ఆగకుండా... విమర్శ ఎలా ఉన్నా స్వీకరించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. కోర్టు తన విచక్షణాధికారాలను కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడాలన్న నిబంధనకు ఆయన తన కెరీర్ అంతా కట్టుబడి ఉన్నారు. 

కోర్టు ప్రాంగణంలో అప్పటి జేఎన్‌యూ విద్యార్థి నేత కన్నయ్య కుమార్‌పై, జర్నలిస్టులపై జరిగిన దాడి ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఎవరూ కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని దుర్వినియోగం చేయకూడదని ఆయన తేల్చిచెప్పారు.

జస్టిస్‌ రేఖా ప్రకాశ్‌ సోండుర్‌ బల్డోటా

ఇక ఈ కమిషన్ లోని మరో సభ్యురాలు, మాజీ న్యాయమూర్తి  జస్టిస్‌ రేఖా ప్రకాశ్‌ సోండుర్‌ బల్డోటా.  క్రిమినల్‌ కేసులను వాదించడంలో... ఆ తరువాత జుడ్గే అయ్యాక వాటిని పరిష్కరించడంలో జస్టిస్‌ రేఖా ప్రకాశ్‌ సోండుర్‌ బల్డోటాకి మంచి ట్రాక్ రికార్డు ఉంది.  

ఆమె న్యాయవాదిగా పనిచేస్తున్న సమయంలో బాంబే హైకోర్టుకు క్రిమినల్‌ కేసుల్లో అమికస్‌ క్యూరేగా (కోర్టుకి ఫ్రెండ్ గా) వ్యవహరించేవారు. ఈమెకి ఈ ఎన్కౌంటర్ జరిగినప్పుడు సైబరాబాద్ కమీషనర్ గా ఉన్న సజ్జనార్ కు మధ్య ఒక సారూప్యత ఉంది. ఇద్దరిది కూడా కర్ణాటక రాష్ట్రం ధార్వాడ్ జిల్లాకేంద్రం హుబ్బళియే కావడం విశేషం. 

జస్టిస్‌ రేఖా ప్రకాశ్‌ సోండుర్‌ బల్డోటా 1955 మార్చి 10న కర్నాటకలోని హుబ్బళిలో జన్మించారు. ముంబై యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కెమిస్ట్రీ, మైక్రో బయాలజీలో) డిగ్రీ పొందారు.  అనంతరం ముంబై లా కాలేజీ నుంచి లా పట్టా పొందారు. 

1980 నుంచి బాంబే హైకోర్టులో న్యాయవాదిగా నమోదు చేసుకొని న్యాయవాద వృత్తిని మొదలుపెట్టారు. 2008లో బాంబే హైకోర్టు అడిషనల్ జడ్జిగా పదోన్నతి పొందారు. 1998లో ఆమె  బల్డోటా మెమోరియల్ ట్రస్ట్ ని ఏర్పాటు చేసి అనేక మంది జూనియర్ లాయర్లకు సహాయ సహకారాలను అందిస్తున్నారు.  నేరన్యాయవ్యవస్థ పనితీరుపై పూర్తి అవగాహన ఉన్న ఆమె అనేక సలహా సంఘాల్లో, కోర్టు ఆడ్వయిజరి కమిటీల్లోనూ పనిచేశారు.

డీఆర్‌ కార్తికేయన్‌

ఇక ఇద్దరు న్యాయమూర్తులతోపాటు మూడవ వ్యక్తిగా ఈ కమిషన్ లో ఉన్న వ్యక్తి ఒక పోలీస్ ఆఫీసర్. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యపై ఏర్పాటైన సిట్‌ కు ఈయన నేతృత్వం వహించారు. ఆ కేసుతో ఆయన పేరు జాతీయ స్థాయిలో మార్మోగిపోయింది.  

ఆయనే దేవరాయపురం రామస్వామి కార్తికేయన్‌. పోలీస్‌ వృత్తికె ఆయన వన్నె తెచ్చారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఐపీఎ్‌సకు ఎంపికయ్యారు కార్తికేయన్.  

1964 బ్యాచ్‌ కు చెందిన కర్ణాటక కేడర్‌ ఆఫీసర్ గా తన ప్రయాణాన్ని ఆరంభించారు. ఈయన హైదరాబాద్ లో కూడా పనిచేసారు. సీఆర్‌పీఎఫ్‌ సదరన్ రేంజ్ఐజీగా కొన్నాళ్లపాటు హైదరాబాద్‌లో విధులు నిర్వర్తించారు. నేరం ఎలా జరిగింది వెనకున్న కారణాల కూపీ లాగడంతో ఈయన దిట్ట. కేసు పూర్వాపరాలను పరిశీలించి దానిని గంటల వ్యవధిలోనే ముగించిన ట్రాక్ రికార్డు ఈయన సొంతం. 
 
రాజీవ్‌ హత్యకేసులో 26మందిని దోషులుగా తేల్చిన బృందానికి సారథ్యం వహించిన వెంటనే ఆయన సేవలను గుర్తిస్తూ సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్‌ గా పదోన్నతి లభించింది. 1996లో ఫుల్ టైం డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టినపుడు ఆయన డీల్ చేసిన తొలి కేసు కూడా అప్పట్లో రాజకీయంగా అత్యంత కీలకమైన కేసు కావడం విశేషం. అప్పట్లో పెనుదుమారం సృష్టించిన ఈ జైన్‌ హవాలా కేసును ఆయన అత్యంత చాకచక్యంగా పరిష్కరించారు. 

ఈయన జాతీయ మానవ హక్కుల సంఘం డైరెక్టర్‌గానూ సేవలందించారు. ఆ సమయంలో అనేక అమానవీయ ఘటనలలో పోలీసులు వ్యవహరించిన తీరును కూడా ఈయన ఎండగట్టారు.

ఇంటర్ పోల్ ఆహ్వానం మేరకు ఈయన రాజీవ్ గాంధీ హత్య కేసును ఎలా పరిష్కరించారో ప్రపంచ పోలీసు అధికారులకు దృశ్యరూపకంగా వివరించారు. అప్పట్లో ఈ విచారణను ఒక మోడల్ ఇన్వెస్టిగేషన్ గా కొనియాడారు.  సివిల్‌ సర్వీసెస్ లో అత్యుత్తమ సేవలు అందించినందుకుగాను 2010లో ఆయనను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

click me!