
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ సారథ్యంలోని టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ఆదాయపరంగానూ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలను వెనక్కి నెట్టేసింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో టెలికం సేవలతో రూ.10,900 కోట్లు ఆదాయం గడించింది. తద్వారా టెలికం రంగంలోనే అగ్రగామి సంస్థగా నిలిచింది.
ఇదే కాలానికి ఎయిర్‌టెల్ టెలికం సేవల ఆదాయం రూ.10,701.5 కోట్లు, వొడాఫోన్ ఐడియా రెవెన్యూ రూ.9,808.92 కోట్లుగా నమోదైందని టెలికాం రంగ నియంత్రణ మండలి (ట్రాయ్) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
తీవ్ర పోటీ ఉన్న టెలికం రంగంలో సేవలు ప్రారంభించిన మూడేళ్లలోనే రిలయన్స్ జియో ఆదాయంలో నంబర్ వన్ కంపెనీగా అవతరించడం ఆసక్తికర పరిణామం. 2016 సెప్టెంబర్ నెలలో రిలయన్స్ జియో వాణిజ్య సేవలను ప్రారంభించింది.
ఎయిర్‌టెల్ 1995లో ఏర్పాటైంది. వొడాఫోన్, ఐడియా సెల్యులార్ విలీనం కావడం ద్వారా గత ఏడాది ఆగస్టులో వొడాఫోన్ ఐడియాగా మారింది. జూన్ త్రైమాసికంలో కస్టమర్ల పరంగానూ జియో మొదటి స్థానానికి చేరుకున్నది.
ఈ జూన్ చివరినాటికి జియో కస్టమర్ల సంఖ్య 33.13 కోట్లకు పెరిగింది. అప్పటివరకు అగ్రస్థానంలో కొనసాగిన వొడాఫోన్ ఐడియా యూజర్లు 32 కోట్లకు తగ్గారు. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ ఆదాయం రూ.4,295.96 కోట్లు, ఎంటీఎన్ఎల్ రూ.407.65 కోట్ల ఆదాయం సంపాదించాయి. ఇటీవల జరిగిన సంస్థ వార్షిక సర్వ సాధారణ సమావేశంలో రిలయన్స్ చైర్మన్ కంపెనీ సబ్ స్క్రైబర్ల సంఖ్యకు 34 కోట్ల మందికి చేరుకోవడమే లక్ష్యంగా నిర్దేశించారు.