పండుగల సంబురంతోపాటు ఎన్నికల జోష్ వచ్చి పడటంతో స్మార్ట్ ఫోన్ల కంపెనీల సేల్స్ ఊపందుకున్నాయి. ఇంటర్నేషనల్ డేటా సెంటర్ (ఐడీసీ) సర్వే ప్రకారం సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్లు 4.26 కోట్లు అమ్ముడు పోయాయి.
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఒకవైపు పండుగల సీజన్, మరోవైపు పలు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికల హడావుడి నేపథ్యంలో దేశీయ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఫోన్లను కొనే వారి సంఖ్య పెరుగుతున్నది. ఈ ఏడాది జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో గతంలో ఎన్నడూ లేని విధంగా విక్రయాలు (షిప్‌మెంట్స్) జరిగాయి.
సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 9.1 శాతం మేర పెరిగి 4.26 కోట్లకు చేరుకున్నాయని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) పేర్కొంది. ఫీచర్ ఫోన్ల అమ్మకాలు గత ఏడాది ఇదేకాలంతో పోల్చితే 2.1 శాతం మేర వృద్ధి చెంది 4.31 కోట్లకు చేరుకున్నాయి. దేశీయంగా ఇప్పటిదాకా స్మార్ట్‌ఫోన్లకన్నా ఫీచర్ ఫోన్ల అమ్మకాలే అధికంగా జరుగుతున్నాయి.
కానీ ఇప్పుడు ఈ రెండింటి అమ్మకాలు దాదాపు సమాన స్థాయికి చేరుకున్నాయి. ఫీచర్ ఫోన్లు వాడే వారు కూడా ఎంట్రీలెవల్‌లో ఉండే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటువంటి వారే లక్ష్యంగా పలు మొబైల్ ఫోన్ల కంపెనీలు తక్కువ ధరలోనే స్మార్ట్‌ఫోన్లను అందిస్తున్నాయి. దీనికి తోడు ఇంటర్నెట్ కూడా అందుబాటు ధరల్లోనే లభిస్తోంది.
మరోవైపు స్మార్ట్‌ఫోన్ల కంపెనీలు వివిధ ధరల శ్రేణిలో వందల కొద్దీ కొత్త మోడళ్లను విడుదల చేస్తుండటం, ఆకర్షణీయ ఆఫర్లు వంటివి అమ్మకాలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు స్మార్ట్‌ఫోన్ల కంపెనీలు 250కి పైగా కొత్త మోడల్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేశాయి.
గత ఏడాది ఇదే కాలంలో 200 ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మొబైల్ ఫోన్ల కోసం పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఆర్డర్లు కూడా పెరిగాయి. చత్తీస్ గఢ్ ప్రభుత్వం మహిళలకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేసేందుకు 50 లక్షల ఫోన్లను సమకూర్చుకుంటోంది.
ఐడీసీ అంచనా ప్రకారం చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల కంపెనీ దేశీయ మార్కెట్లో హల్‌చల్ చేస్తోంది. సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో షామీ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు 1.17 కోట్ల యూనిట్లుగా ఉన్నాయి. ఈ కంపెనీ మార్కెట్ వాటా 27.3 శాతం. తర్వాతి స్థానాల్లో వరుసగా శామ్‌సంగ్ (96 లక్షల ఫోన్లు - 22.6 శాతం వాటా), వివో (45 లక్షల ఫోన్లు - 10.5 శాతం వాటా), మైక్రోమాక్స్ (29 లక్షల ఫోన్లు - 6.9 శాతం వాటా), ఒప్పో (29 లక్షల ఫోన్లు - 6.7 శాతం) నిలిచాయి.
సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో ఆన్‌లైన్‌లో ఫోన్ల విక్రయాల వాటా 40 శాతానికి చేరుకుంది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఇది 30 శాతంగా నమోదైంది. యువతీయువకులు, ఉద్యోగులు, చిన్న పట్టణాల్లోని వారి ఈ-కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా ఫోన్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
దేశీయ మొబైల్ ఫోన్ల మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ల వాటా క్రమంగా పెరుగుతోంది. 2016 సెప్టెంబర్ నెలలో మొత్తం మొబైల్ ఫోన్ల మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ల వాటా 43 శాతం ఉండేది. గతేడాది ఇది 48 శాతానికి, ఈ ఏడాది 50 శాతానికి పెరిగింది. స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరగడంలో షామీ, వన్‌ప్లస్, వివో వంటి కంపెనీల పాత్ర కీలకంగా ఉన్నట్టు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.
ఈ కంపెనీలు అందుబాటు ధరల్లోనే అత్యాధునిక ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. ఫలితంగా ఎక్కువ మంది కస్టమర్లు వీటి పట్ల ఆకర్షితులవుతున్నారు. చైనాకు చెందిన షామీ తదితర కంపెనీలు దేశీయ మార్కెట్లో తొలుత ఆన్‌లైన్ ద్వారానే తమ మొబైల్ ఫోన్ల అమ్మకాలు సాగించాయి. కస్టమర్ల నుంచి ఆదరణ పెరగడంతో ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా అమ్మకాలను పెంచుకోవడానికి రంగంలోకి దిగాయి.
ప్రచారం కోసం ఈ కంపెనీలు భారీగా ఖర్చు చేస్తున్నాయి. బాలీవుడ్ నటులను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుంటూ హోర్డింగ్‌లు, టీవీ, పత్రికా ప్రకటనల ద్వారా కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే ఇండియన్ ప్రీమియం లీగ్ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కుల కోసం వివో రూ.2,200 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. భారత క్రికెట్ టీమ్ జెర్సీ హక్కుల కోసం ఒప్పో రూ.1,100 కోట్లు కేటాయించినట్టు తెలుస్తోంది.
ఈ-కామర్స్ కంపెనీలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, పేటీఎం వంటి ఈ కంపెనీల మధ్య పోరు తీవ్రం అవుతోంది. ఈ కంపెనీలు తమ అమ్మకాలను భారీ స్థాయిలో పెంచుకునేందుకు సర్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఆన్‌లైన్‌లో మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతున్నందు వల్ల ఈ కంపెనీలు విభిన్న రకాల ఫోన్లపై భారీ స్థాయిలో డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, ఈఎంఐ వంటి సదుపాయాలను అందిస్తున్నాయి. ఫలితంగా ఫోన్ల అమ్మకాలు జోరందుకుంటున్నాయి.