బ్రాహ్మణులంటే అంత అలుసా?! ట్విట్టర్ సీఈఓపై ఫైర్

By rajesh yFirst Published Nov 20, 2018, 11:08 AM IST
Highlights

ఇటీవల భారత పర్యటనలో పాల్గొన్న ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీతో ఒక సమావేశంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త ఇచ్చిన పోస్టర్ ఆయన ప్రదర్శించడం వివాదాస్పదమైంది. ఆ పోస్టర్‌పై ‘బ్రాహ్మణిక  పితృస్వామ్యం నశించాలి’ అని రాసి ఉండటంతో బ్రాహ్మణులు భగ్గుమన్నారు. ట్విట్టర్ కు ఇంత వివక్షేమిటని నిలదీశారు. కానీ తమకు అటువంటిదేమీ లేదని అందరి వాదనలు వింటామని ట్విట్టర్ వివరణ ఇచ్చింది. 

న్యూఢిల్లీ : ట్విటర్‌ సీఈవో జాక్‌ డోర్సీ ప్రదర్శించిన ఓ పోస్టర్‌ వివాదాస్పదమైంది. బ్రాహ్మణుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. భారత పర్యటనలో భాగంగా ఇటీవల కొంత మంది మహిళా జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. ఓ ఫొటోకు ఫోజిస్తూ ఓ పోస్టర్‌ను ప్రదర్శించడమే దీనికి కారణం. ఈ పోస్టర్‌లో జాక్‌ డోర్సీ ప్రదర్శించిన పోస్టర్‌లో ‘బ్రాహ్మణిక పితృస్వామ్యం నశించాలి’ అని రాసుంది. అంతే బ్రాహ్మణులు మండిపడుతున్నారు. 

జాక్ డోర్సీతో జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలతో జరిగిన సమావేశం ఫొటోను ఆ సమావేశానికి హాజరైన ఓ జర్నలిస్ట్‌ తన ట్విటర్‌ ఖాతాలో ‘మహిళా జర్నలిస్టులు, రచయితలు, సామాజిక కార్యకర్తలతో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో భాగమయ్యాను. భారత్‌లో ట్విటర్‌ అనుభవంపై చర్చించాం. చాలా సంతోషంగా ఉంది. ఈ సంభాషణను వర్ణించడానికి మాటలు రావడం లేదు’  అని క్యాఫ్షన్‌గా పేర్కొన్నారు. 
దీంతో బ్రాహ్మణుల అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కేవలం వామపక్షవాదులతోనే ఎందుకు సమావేశమయ్యారని నిలదీస్తున్నారు. 
ట్విటర్‌ ఒక వర్గానికే కొమ్ము కాస్తుందా? అని బ్రాహ్మణులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘాటు కామెంట్లతో స్పందించిన ట్విటర్‌.. జాక్‌ డోర్సీ కావాలని ఆ పోస్టర్‌ ప్రదర్శించలేదని, ఆ సమావేశానికి వచ్చిన ఓ దళిత కార్యకర్త ఆమె అనుభవాలు పంచుకోవడంతో పాటు ఆ పోస్టర్‌ను ఆఫర్‌ చేయడంతో పట్టుకున్నారని వివరణ ఇచ్చింది. ట్విటర్‌ అందరి వాదనలు వింటుందని స్పష్టం చేసింది. 

అయితే బ్రాహ్మణుల ఆగ్రహం వల్ల భారతదేశంలోని ట్విట్టర్ ఖాతాదారులపై ఎటువంటి ప్రభావం ఉండబోదని సోషల్ మీడియా నిపుణులు పేర్కొంటున్నారు. ఈ మైక్రోబ్లాగింగ్ వేదికపై వందల మంది ప్రముఖులు వ్యాఖ్యలు చేస్తుంటారు. కానీ ఈ వివాదాస్పద పోస్టర్ ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ పట్టుకుని ఉండటంపై పలువురు షాక్‌కు గురైనట్లు పేర్కొన్నారు. దీనికి ట్విట్టర్ సీఈఓ బాధ్యత వహించాల్సిందేనని పేర్కొన్నారు. 

‘ఎంత సిగ్గుచేటు. ఒక సామాజిక వర్గంపై బురదచల్లే ద్వేషపూరిత పోస్టర్ ను ఎలా పట్టుకుంటారు@జాక్.. మీరు ట్వట్టర్ సీఈఓ ఎలా అయ్యారు? మీరు కూడా ద్వేషంలో భాగమేనా? బ్రాహ్మణ ఫోబియా దారుణమైన అంశం’  అని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్ ట్వీట్ చేశారు. పలువురు ట్విట్టర్ యూజర్లు కూడా తమ మనోభావాలను దెబ్బ తీశారని పేర్కొన్నారు. 

ట్విట్టర్ తనకు క్లీన్ ఇమేజ్ కోసం చేస్తున్న ప్రయత్నాలు, డోర్సీ చర్యతో ప్రతికూలంగా మారుతుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. స్వల్పకాలికంగా ప్రభావం ఉండకపోవచ్చు గానీ, దీర్ఘ కాలంలో ప్రభావితం చేయొచ్చని వోక్స్ వెబ్ వ్యవస్థాపకుడు యాశ్ మిశ్రా పేర్కొన్నారు. సంస్థ గుడ్‌విల్‌పై ఒకింత ప్రభావం పడుతుందని బ్రాండ్ కన్సల్టెంట్ హరీశ్ బిజూర్ పేర్కొన్నారు. 

click me!
Last Updated Nov 20, 2018, 11:08 AM IST
click me!