యాపిల్‌కు బ్లాక్ మండే?! ఫ్యూచర్ అలార్మింగ్!!

By rajesh yFirst Published Nov 20, 2018, 12:38 PM IST
Highlights


టెక్ దిగ్గజం ‘యాపిల్’కు కష్టాలొచ్చాయి. ఇటీవల తాజాగా విడుదల చేసిన ఐఫోన్లకు డిమాండ్ లేకపోవడంతో వాటి ఉత్పత్తిని నిలిపేయాలని వచ్చిన వార్తలతో సోమవారం షేర్లు నాలుగు శాతం పడిపోయాయి. ప్రారంభంలో ఊహించిన దానికంటే అధిక ధరలు పలుకుతుండటంతో సామర్థ్యం గల వారు కూడా ఐఫోన్ల కొనుగోలుకు ముందుకు రావడం లేదు.

న్యూఢిల్లీ: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ షేర్లు స్టాక మార్కెట్లలో నాలుగు శాతం తగ్గినట్లు వార్తలొచ్చాయి. సమీప భవిష్యత్‌లో యాపిల్ సమస్యల్లో చిక్కుకున్నదా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఐఫోన్ ధరలు అధికంగా ఉండటమే దీనికి కారణమా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కుపర్టినో కేంద్రంగా పని చేస్తున్న సంస్థ అధిక ధరలకు పరిష్కారం చూపగలుగుతుందా? అన్న ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. సోమవారం స్టాక్ మార్కెట్లో యాపిల్ షేర్ 4 శాతం పతనమైతే ఫేస్ బుక్ షేర్ ఆరు శాతం, గూగుల్ ఆల్పాబెట్ షేర్ నాలుగు శాతం పతనమైంది. 

యాపిల్ షేర్ల పతనానికి కారణాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ నెలాఖరులో అంగరంగ వైభవంగా మార్కెట్లోకి ఆవిష్కరించిన ఐ ఫోన్ ఎక్స్ఎస్, ఐ ఫోన్ ఎక్స్ ఎస్ మాక్స్, ఐ ఫోన్ ఎక్స్ఆర్ ఉత్పత్తులను తగ్గించాలని సంస్థ నిర్ణయానికి వచ్చినట్లు వార్త వెలుగు చూసింది. ఊహించినదాని కంటే మార్కెట్లో కొత్త ఫోన్లకు డిమాండ్ తగ్గిపోవడంతో యాపిల్ సంస్థ యాజమాన్యం కలవరానికి గురవుతోంది. 

బిలియన్ డాలర్ల స్టాక్ మార్కును దాటేందుకు కొద్ది దూరంలో ఉన్న యాపిల్ సంస్థ అత్యంత చౌకైన ఐఫోన్ల ఆవిష్కరణతో తన మైలురాయిని అధిగమించగలదని వేసిన అంచనాలు తారుమారయ్యాయి. గత నెల ఆదాయం తేలిపోవడంతో సంస్థ సమస్యల్లో చిక్కుకున్నదని అర్థమైంది. 

యాపిల్ సంస్థ తన ఐ ఫోన్ ఉత్పత్తులను తగ్గించాలని నిర్ణయించిందని వాల్ స్ట్రీట్ జర్నల్ రాసిన వార్తాకథనం స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపింది. నాలుగో త్రైమాసికంలో సంస్థ ఆదాయం కూడా 15 శాతం తగ్గింది. దీనికి తోడు సంస్థ ఉత్పత్తుల పట్ల డిమాండ్ కూడా తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఐ ఫోన్ ఎక్స్ఆర్ మోడల్ ఫోన్ల ఉత్పత్తిని 100 మిలియన్ల నుంచి 70 మిలియన్లకు తగ్గించి వేసినట్లు సమాచారం. ఇక మరో సప్లయర్ లుమెంటం హోల్డింగ్స్ త్రైమాసిక విక్రయాలు 17 శాతం తగ్గించేసింది. 

ఐఫోన్ నూతన ఉత్పత్తుల ధరలు ఊహించిన దానికంటే ఎక్కువ ధరలు పలుకుతున్నాయి. ఉదాహరణకు ఐఫోన్ ఎక్స్ఆర్ ధర అమెరికాలో 749 డాలర్లు ఉంటే, భారతదేశంలో రూ.75 వేలు పలుకుతుంది. ఇక ఐ ఫోన్ ఎక్స్ఎస్ ధర రూ.98,000 (999$), ఐఫోన్ ఎక్స్ఎస్ మాక్స్ ధర రూ.1.09 (1099$) లక్షలు పలుకుతోంది. ప్రారంభంలో ఊహించినదానికంటే ఎక్కువ ధరలు ఉండటంతో ఐఫోన్లు కొనుగోలు చేయాలన్న ఆసక్తి ఉన్న వారు కూడా వెనుకంజ వేస్తున్నారు. 
ఈ నేపథ్యంలో ఇకముందు ఐఫోన్ల విక్రయాలు ఉండబోవని యాపిల్ తేల్చేసింది. భవిష్యత్‌లో సాఫ్ట్ వేర్, సర్వీసులపైనే కేంద్రీకరించనున్నట్లు చెబుతోంది. ఇదిలా ఉంటే యాపిల్ ఐ పాడ్స్, వాచీల విక్రయాల వివరాలను బయటపెట్టలేదు. వచ్చేది పండుగల సీజన్. ఈ క్రమంలో నూతన సిరీస్ ఐఫోన్ల ధరలు అధికంగా ఉండటంతో కొనుగోలు చేయగల సామర్థ్యం గల వినియోగదారులు సైతం వెనుకడుగు వేస్తున్నారు.

click me!