చీటింగ్: ఆన్‌లైన్‌ రివ్యూలతో అమెజాన్‌ కస్టమర్లకు బురిడీ...

By Sandra Ashok Kumar  |  First Published Dec 25, 2019, 2:48 PM IST

ఆన్ లైన్ రివ్యూలు ఇప్పుడొక వ్యసనం. అవి చూశాక వివిధ కంపెనీలు, బ్రాండ్ వస్తువులపై అంచనాకు వచ్చేయొచ్చు. కానీ యూరప్ దేశాల్లో ఫేక్ రివ్యూలు రాయించుకుని డబ్బు చెల్లిస్తున్నట్లు డెయిలీ మెయిల్ ఓ వార్తాకథనం ప్రచురించింది. 


లండన్‌: సాధారణంగా ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువు కొనాలనుకున్నా, ముందు దాని రివ్యూలు చూడటం సహజం. రివ్యూల బట్టి ఏ వస్తువు, ఏ బ్రాండ్‌ కొనాలో వద్దో ఓ నిర్ణయానికి వస్తాం. దీంతో తమ ఉత్పత్తుల విక్రయాలను పెంచుకునేందుకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లోని కొంతమంది విక్రేతలు తప్పుడు మార్గాలను అనుసరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 

ఇప్పటికే దీనిపై అమెజాన్‌ దృష్టిపెట్టినా.. ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. నకిలీ రివ్యూల కోసం సదరు విక్రేతలు 15 యూరోల(అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 1200) చొప్పున చెల్లిస్తున్నట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘డెయిలీ మెయిల్‌’ దర్యాప్తు కథనంలో పేర్కొంది. 

Latest Videos

also read  శామ్సంగ్ నుండి కొత్త 4జి స్మార్ట్ వాచ్...లేటెస్ట్ ఫీచర్స్ తో...

రివ్యూ విశ్లేషణల ఆధారంగా వస్తువుల కొనుగోళ్లు పెరుగుతుండటంతో కొందరు విక్రయదారులు ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఇందుకోసం కొన్ని సంస్థలు పరిశీలకులను కూడా ఏర్పాటు చేసుకున్నాయి. ఈ పరిశీలకులు అమెజాన్‌లో ఆయా సంస్థల వస్తువులను కొని వాటికి 4 స్టార్‌, 5 స్టార్‌ రేటింగ్‌లు ఇస్తున్నారు. 

ఇలా చేస్తున్నందుకు విక్రేత సంస్థలు సదరు పరిశీలకులకు ఆ వస్తువు కొనుగోలుకు అయిన ధరను తిరిగి ఇవ్వడంతోపాటు చిన్న మొత్తంలో ఫీజు చెల్లిస్తున్నట్లు ‘డెయిల్‌ మెయిల్‌’ తన కథనంలో వెల్లడించింది. ఈ పరిశీలకులు కొనుగోలు చేసి రివ్యూలు ఇస్తుండటంతో అమెజాన్‌ కూడా వాటిని వెరిఫైడ్‌ పర్చేజెస్‌ కేటగిరీలో చూపిస్తోంది.

also read ఎయిర్‌‌‌‌టెల్‌ కొత్త ఆఫర్...కాల్ ఛార్జీలు లేకుండా ఏ నెట్‌‌వర్క్‌కైనా కాల్స్...

జర్మనీకి చెందిన ఓ కంపెనీకి ఒక్క యునైటెడ్ కింగ్‌డమ్‌లోనే 3000 మంది పరిశీలకులు ఉన్నట్లు డెయిలీ మెయిల్‌ తమ కథనంలో పేర్కొంది. యూరప్‌ వ్యాప్తంగా వీరి సంఖ్య 60వేల వరకు ఉండొచ్చని తెలిపింది.అయితే తాజా కథనంపై ‘అమెజాన్‌’ స్పందించింది. రివ్యూలపై వినియోగదారులకు ఉన్న విశ్వసనీయతను కాపాడేందుకు తమ సంస్థ కట్టుబడి ఉందని తెలిపింది. ఇందుకోసం గతేడాది 300 మిలియన్‌ పౌండ్లు వెచ్చించినట్లు పేర్కొంది. 

కస్టమర్లతో సమీక్షలు రాయించుకునేందుకు సదరు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఒక వస్తువును పరీక్ష నిమిత్తం కొనుగోలు చేయడంతోపాటు ప్రతి ఫేక్ రివ్యూకు బదులుగా 10 యూరోలు చెల్లిస్తున్నాయి. దీని ప్రకారం 500 రివ్యూలకు ఐదువేల యూరోలు చెల్లించారు. యూకే కాంపిటీషన్ మార్కెట్స్ అథారిటీ స్పందిస్తూ ఫేక్ రివ్యూలో చట్ట విరుద్ధం, అటువంటి వాటిపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఏటా ఆన్ రివ్యూలతో 23 బిలియన్ల యూరోల మేరకు చేతులు మారుతున్నట్లు అంచనా వేసింది. 
 

click me!