దేశీయ ఆహార ఉత్పత్తుల రిటైల్ రంగంలోకి ప్రవేశించాలన్న ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ప్రయత్నాలకు కేంద్రం బ్రేక్ వేసింది. అనుమతుల కోసం చేసుకున్న దరఖాస్తును తిరస్కరించింది. నియంత్రణ విషయంలో సమస్యలు తలెత్తుతాయని స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: ఆహార ఉత్పత్తుల రిటైల్ రంగంలోకి ప్రవేశించడానికి అనుమతులు కోరుతూ చేసిన ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలోని ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇంటర్నల్ ట్రేడ్ విభాగం (డీపీఐఐటీ) తిరస్కరించింది. నియంత్రణ విషయంలో సమస్యలు తలెత్తుతాయని పేర్కొంది.
గతంలోనే ఆహార ఉత్పత్తుల రిటైల్ రంగంలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఫుడ్ బిజినెస్ రంగంలోకి ప్రవేశించేందుకు గతేడాది 'ఫ్లిప్‌కార్ట్ ఫార్మర్‌మార్ట్' పేరిట స్థానిక విభాగాన్ని స్థాపించింది. అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది.
తమ ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించిన నేపథ్యంలో మరోమారు దరఖాస్తు చేసుకుంటామని ఫ్లిప్ కార్ట్ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. సాంకేతికత, కొత్త ఆవిష్కరణల ఆధారంగా నడిచే మార్కెట్లో పారదర్శకత, విలువల సామర్థ్యం పెంచటం ద్వారా దేశీయ రైతులు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి దన్నుగా నిలుస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.
also read బిఎస్‌ఎన్‌ఎల్ కొత్త రూ.2 ప్రీపెయిడ్ రిచార్జ్ ఆఫర్..
తాము చేపట్టే ఫుడ్ బిజినెస్ ద్వారా రైతుల ఆదాయం పెరిగి, భారత వ్యవసాయ రంగంలో మార్పులు చోటు చేసుకుంటాయని ఫ్లిప్ కార్ట్ ప్రతినిధి అన్నారు. భారత్‌లో ఆహార ఉత్పత్తుల రిటైల్ రంగంలో సుమారు 500 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్‌కు 2017లోనే కేంద్రం అనుమతి ఇచ్చింది.
రిలయన్స్ జియో మార్ట్ పేరిట రిలయన్స్ చేపట్టిన రిటైల్ ఈ-కామర్స్ బిజినెస్, సాఫ్ట్ బ్యాంక్ దన్నుతో నడుస్తున్న సాఫ్ట్ బ్యాంక్, అలీ బాబా సారథ్యంలోని బిగ్ బాస్కెట్, అమెజాన్ భారత్ యూనిట్లకు ఫ్లిప్ కార్ట్ ఫుడ్ బిజినెస్ గట్టి సవాల్ ఇవ్వగలదు.