సానియా మీర్జాకి మరో గాయం... యూఎస్ ఓపెన్ నుంచి అవుట్! రిటైర్మెంట్‌పై నిర్ణయం కూడా...

By Chinthakindhi Ramu  |  First Published Aug 23, 2022, 12:56 PM IST

గాయంతో యూఎస్ ఓపెన్ 2022 నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన సానియా మీర్జా... రిటైర్మెంట్ విషయంలో ఆలోచనలు మారినట్టు... 


భారత టెన్నిస్ స్టార్, సీనియర్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా మాలిక్ మరో గాయపడింది. కెరీర్ ఆరంభం నుంచి ఎన్నో గాయాలతో పోరాడుతూ 19 ఏళ్లుగా ఆటలో కొనసాగుతూ వస్తున్న సానియా... తాజాగా మరోసారి గాయపడి యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకుంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన గాయం గురించి అప్‌డేట్ ఇచ్చింది సానియా మీర్జా.  ‘హాయ్, నేను ఓ అప్‌డేట్ ఇస్తున్నా. ఇప్పుడే నాకు ఈ విషయం తెలిసింది. రెండు వారాల క్రితం కెనడాలో ఆడుతున్నప్పుడు నా మోచేతికి గాయమైంది. దాని తీవ్రత ఎంటనేది నిన్న స్కానింగ్ రిపోర్టులు వచ్చేదాకా నాకు అర్థం కాలేదు. 

ఈ గాయం కారణంగా నా మోచేతి కండరాలు కాస్త చితికిపోయాయి. కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పారు. దీంతో తప్పక యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నా. ఈ టైమ్‌లో ఇలా చెప్పడం కరెక్ట్ కాదు... కానీ ఈ గాయం వల్ల నా రిటైర్మెంట్ ఆలోచనలను కూడా కొద్దిగా మార్చుకోవాలని అనుకుంటున్నా... ఏ విషయం త్వరలోనే చెబుతా... లవ్, సానియా...’ అంటూ రాసుకొచ్చింది సానియా మీర్జా...

Latest Videos

undefined

ఇప్పటికే రిటైర్మెంట్‌పై నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జరిగే సీజన్‌ తర్వాత టెన్నిస్ నుంచి వీడ్కోలు తీసుకోబోతున్నట్టు తెలిపింది సానియా మీర్జా.. యూఎస్ ఓపెన్‌లో సానియా మీర్జాకి మంచి రికార్డు ఉంది. 2015 సీజన్‌లో డబుల్స్‌లో యూఎస్‌ ఓపెన్ విజేతగా నిలిచిన సానియా మీర్జా, 2014 ఎడిషన్‌లో మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ టైటిల్ నెగ్గింది...
గర్భం కారణంగా 2020 సీజన్ యూఎస్ ఓపెన్‌లో ఆడని సానియా మీర్జా, ప్రసవం తర్వాత 20221 ఎడిషన్‌లో పాల్గొంది. అయితే డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో తొలి రౌండ్‌లోనే ఓడిన సానియా మీర్జా... ఈ సీజన్‌తో కెరీర్‌కి స్వస్తి పలకాలని ఆశించింది...

రిటైర్మెంట్ విషయంలో ఆలోచన మార్చుకోవాలని చూస్తున్నట్టు చెప్పిన సానియా మీర్జా, గాయం కారణంగా త్వరగానే తప్పుకుంటుందా? లేక గాయం నుంచి కోలుకున్న తర్వాత వచ్చే సీజన్‌లోనూ ఆడి తప్పుకుంటుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆమె అభిమానులు.. 


ఒలింపిక్స్ మెడల్ కల నెరవేర్చుకోవాలనే ఆశలతో టోక్యోలో అడుగుపెట్టిన సానియా, రెండో రౌండ్‌లోనే ఇంటి దారి పట్టింది. అయితే ఆ తర్వాత చార్లెస్‌స్టన్ ఓపెన్ 2022 టోర్నీలో ఆడిన సానియా మీర్జా, చెక్ రిపబ్లిక్ ప్లేయర్ లూసీ హ్రాడెస్కాతో కలిసి ఫైనల్ చేరి, రన్నరప్‌గా నిలిచింది...


2003లో ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి అడుగుపెట్టిన సానియా మీర్జా, తన 19 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో సంచలన విజయాలు అందుకుంది. సింగిల్స్‌లో అత్యధికంగా 27వ ర్యాంకుకి చేరుకున్న సానియా మీర్జా, డబుల్స్‌లో 2015లో వరల్డ్ నెం.1 ర్యాంకును పొందింది...
 

click me!