Sports Ministry Approved Chris Walker as Coach: 2022లో భారత జట్టు కామన్వెల్త్ గేమ్స్ తో పాటు ఆసియా క్రీడల్లో సత్తా చాటాలని భావిస్తున్నది. ఈ నేపథ్యంలో స్క్వాష్ జట్టు కు విదేశీ కోచ్ ను ప్రతిపాదించింది.
ఈ ఏడాది భారత జట్టు పాల్గొనబోయే రెండు మేజర్ ఈవెంట్లలో మెరుగైన ఫలితాలను ఆశిస్తున్న భారత స్క్వాష్ జట్టు.. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నది. రెండు సార్లు ప్రపంప ఓపెన్ స్క్వాష్ ఛాంపియన్షిప్ విజేత, ఇంగ్లాండ్ కు చెందిన క్రిస్ వాకర్ ను కోచ్ గా ఎంపిక చేసుకుంది. ఈ ప్రతిపాదనను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్ర క్రీడా, యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖకు పంపగా.. తాజాగా ఆ శాఖ కూడా ఇందుకు ఆమోదం తెలిపింది. విదేశీ కోచ్ ఎంపికపై తొలుత పలువురు సీనియర్లు, క్రీడాకారులు పెదవి విరిచినా ఈ ఏడాది భారత జట్టు రెండు మేజర్ టోర్నీలలో పాల్గొనాల్సి ఉంది. 2022 జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు కామన్వెల్త్ గేమ్స్ జరుగాల్సి ఉండగా.. సెప్టెంబర్ 10 నుంచి 25 దాకా ఆసియా గేమ్స్ జరుగనున్నాయి.
కామన్వెల్త్, ఆసియా గేమ్స్ నేపథ్యంలో భారత స్క్వాష్ జట్టు విదేశీ కోచ్ ప్రతిపాదనను కేంద్ర క్రీడాశాఖ ఆమోదించింది. ఇంగ్లాండ్ కు చెందిన క్రిస్ వాకర్ గతంలో రెండు సార్లు ప్రపంచ స్క్వాష్ ఛాంపియన్షిప్ గెలిచాడు. ఇంగ్లాండ్ కు కెప్టెన్ గా వ్యవహరించిన వాకర్.. 1997లో ప్రారంభించిన వరల్డ్ డబుల్స్ స్క్వాష్ ఛాంపియన్షిప్ ను మార్క్ కెయిన్స్ తో పాటు గెలుచుకున్నాడు.
undefined
పతకాల పంట...
అంతేగాక.. 1993, 1996 వరల్డ్ ఓపెన్ స్క్వాష్ ఛాంపియన్షిప్ లలో ఇంగ్లాండ్ జట్టు తరఫున పాల్గొని కాంస్య పతకాలు సాధించాడు. ఇక 1995, 1997లలో నిర్వహించిన వరల్డ్ టీమ్ ఛాంపియన్స్ లో రజత పతకాలు సాధించాడు. 1998, 2002 లలో కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొని కాంస్యాలు నెగ్గాడు. స్క్వాష్ లోనే కాదు.. వాకర్ కు సైక్లింగ్ క్రీడలో కూడా ప్రావీణ్యముంది. 1998 లో కౌలాలాంపూర్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో అతడు పాల్గొనడం గమనార్హం. అమెరికాకు వెళ్లిన తర్వాత అతడు అక్కడి జాతీయ జట్టుకు కోచ్ గా పనిచేయడం విశేషం.
భారత్ తో పనిచేయడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా: వాకర్
ఇదిలాఉండగా భారత స్క్వాష్ జట్టుకు కోచ్ గా ఎంపికైన వాకర్.. 16 వారాల పాటు టీమిండియాకు కోచ్ గా ఉండనున్నాడు. కామన్వెల్త్,ఆసియా గేమ్స్ ను దృష్టిలో పెట్టుకుని అతడిని నియమించారు. ఇదే విషయమై వాకర్ మాట్లాడుతూ... ‘వరల్డ్ డబుల్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలకు గాను భారత జట్టుతో కలిసి పనిచేయడం చాలా ఉత్సాహంగా ఉంది. నేను ఫెడరేషన్ తో సన్నిహితంగా పనిచేస్తాను. రాబోయే రెండు మేజర్ ఈవెంట్లలో భారత ఆటగాళ్లు తమ అత్యుత్తమ ఆట ఆడేందుకు నావంతు ప్రయత్నం చేస్తాను...’ అని చెప్పుకొచ్చాడు. ఏప్రిల్ లో అతడు భారత జట్టుతో కలిసే అవకాశాలున్నాయి.
ఇటీవలే కౌలాలాంపూర్ లో ముగిసిన ఆసియా టీమ్ ఛాంపియన్షిప్స్ లో భారత పురుషుల స్క్వాష్ జట్టు ఆటగాళ్లు సౌరవ్ ఘోషల్, రమిత్ ఠాండన్, మహేశ్ మంగోకర్ రన్నరప్ గా నిలిచారు. ఇక మహిళల జట్టులోని జోషువా చిన్నప్ప, సునైన కురువిల్ల, ఊర్వశి జోషి లు సెమీస్ కు చేరారు. అయితే వచ్చే రెండు మెగా ఈవెంట్లలో మాత్రం భారత్.. పతకాల వేటే లక్ష్యంగా సాగుతున్నది. బర్మింగ్హోమ్ వేదికగా జరిగే కామన్వెల్త్ గేమ్స్, చైనాలోని హంగ్జూ వేదికగా నిర్వహించనున్న ఆసియా గేమ్స్ లో సత్తా చాటాలని భావిస్తున్నది.