E-Auction of PM Gifts: ఇటీవలే ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న భవానీ దేవి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. భారత క్రీడా చరిత్రలో తొలిసారి ఫెన్సింగ్ లో ఆడిన ఆమె.. తొలి మ్యాచ్ లో గెలిచి రికార్డు సృష్టించింది.
ఒలింపిక్స్ (olympics)లో భారత్ తరఫున ఫెన్సింగ్ లో పోటీ పడ్డ భవానీ దేవి రికార్డు సృష్టించింది. తమిళనాడుకు చెందిన భవానీ దేవి.. ఫెన్సింగ్ (Fencing) లో 8 సార్లు జాతీయ చాంపియన్ గా నిలిచింది. అంతేగాక ఫెన్సింగ్ లో భారత్ కు ప్రాతినిథ్యం వహించిన తొలి ప్లేయర్. కాగా, ఒలింపిక్స్ లో ఆమె వాడిన కత్తిని త్వరలోనే వేలం వేయనున్నారు. ఈ-వేలం ద్వారా సాగనున్న ఈ ప్రక్రియలో దేశ ప్రజలందరూ పాల్గొనవచ్చు.
టోక్యో నుంచి తిరిగొచ్చాక దేశ ప్రధాని నరేంద్ర మోదీ (prime minister modi) ఒలింపిక్స్ లో పాల్గొన్న క్రీడాకారులందరితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత వారందరినీ తన నివాసానికి పిలిపించుకుని ప్లేయర్లతో ఫోటోలు దిగుతూ, వారితో కలిసి భోజనం చేస్తూ గడిపారు. ఈ సందర్భంగా ఆటగాళ్లంతా తమ తమ క్రీడలలో వచ్చిన పతకాలు, ఆట వస్తువులు ప్రధానికి చూపించారు. ఒలింపిక్స్ అథ్లెట్ విభాగంలో తొలి స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రా (neeraj chopra) కూడా తన జావెలిన్ ను ప్రధానికి చూపించి మురిసిపోయారు. ఈ క్రమంలోనే భవానీ దేవి కూడా ఒలింపిక్స్ లో ఫెన్సింగ్ పోటీలకు తాను వాడిన కత్తిని మోదీకి బహుమతిగా ఇచ్చింది. భవానీ దేవి తో పాటు పలువురు క్రీడాకారులు మోదీకి బహుమతిగా ఇచ్చిన గిఫ్ట్స్, జ్ఞాపికలను వేలం (e-auction) నిర్వహిస్తున్నారు.
undefined
ప్రధాని మోదీ జన్మదినం సెప్టెంబర్ 17 నుంచి మొదలైన ఈ వేలం.. అక్టోబర్ 7 వరకు జరుగనుంది. వేలంలో తాజాగా భవానీ దేవి వాడిన కత్తిని కూడా చేర్చారు. ఈ వస్తువులను దక్కించుకోవాలనే ఆసక్తి ఉన్నవారు pmmementos.gov.in/ లో రిజిష్టరై వేలంలో పాల్గొని వాటిని దక్కించుకోవచ్చునని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.
కాగా, వేలం ద్వారా వచ్చిన సొమ్మును గంగా నది శుద్ధి కోసం ప్రతిపాదించిన ‘నమామి గంగే’ (namami gange) కోసం వాడుతున్నారు. ప్రధానికి వచ్చిన బహుమతులు వేలం వేయడం ఇదే ప్రథమం కాదు. గతంలో కూడా 2019లో మోదీకి వచ్చిన బహుమతులను వేలం వేయగా వచ్చిన రూ. 15.13 కోట్లను నమామి గంగే బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేశారు.