పారాలింపిక్స్ విజేతలకు రూ.10 కోట్ల భారీ నజరానా... ఇద్దరు షూటర్లకి హర్యానా ప్రభుత్వం కానుక...

By Chinthakindhi RamuFirst Published Sep 4, 2021, 3:40 PM IST
Highlights

స్వర్ణం గెలిచిన మనీష్ నర్వాల్‌కి రూ.6 కోట్లు, సింగ్‌రాజ్‌కి రూ.4 కోట్ల నగదు రివార్డును ప్రకటించిన హర్యానా ముఖ్యమంత్రి... 

టోక్యో పారాలింపిక్స్ 2020లో భారత పతకాల సంఖ్య 15కి చేరింది. శనివారం భారత మెన్స్ షూటర్లు మనీష్ నర్వాల్, సింగ్‌రాజ్ ఆదాన రెండు పతకాలను సాధించిన విషయం తెలిసిందే. 50 మీటర్ల షూటింగ్ మిక్స్‌డ్ పిస్టల్ ఈవెంట్‌లో పోటీపడిన భారత షూటర్లు మనీష్ నర్వాల్ స్వర్ణం సాధించగా... సింగ్‌రాజ్ ఆదాన రజతం సాధించాడు...

10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌ ఈవెంట్‌లో కాంస్యం సాధించిన సింగ్‌రాజ్‌కి ఇది ఈ పారాలింపిక్స్‌లో రెండో పతకం కావడం విశేషం. ఇప్పటికే మహిళా షూటర్ ఆవనీ లేఖరా ఓ స్వర్ణం, ఓ కాంస్యం సాధించి.. సింగ్‌రాజ్‌కి ముందు ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించిన భారత అథ్లెట్‌గా నిలిచింది...

19 ఏళ్ల వయసులో స్వర్ణం గెలిచిన భారత షూటర్ మనీష్ నర్వాల్, వుమెన్స్ సింగిల్స్‌లో అవనీ లేఖరా తర్వాత ఈ ఫీట్ సాధించిన టీనేజర్‌గా నిలిచాడు.. హర్యానాకి  చెందిన ఈ ఇద్దరికీ భారీ నజరానా ప్రకటించాడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్.

స్వర్ణం గెలిచిన మనీష్ నర్వాల్‌కి రూ.6 కోట్లు, సింగ్‌రాజ్‌కి రూ.4 కోట్ల నగదు రివార్డును ప్రకటించిన హర్యానా ముఖ్యమంత్రి... వారికి ప్రభుత్వ ఉద్యోగాలను కూడా ఆఫర్ చేశాడు...

పారాలింపిక్స్‌ 2020లో జావెలిన్ త్రో మూడు వరల్డ్ రికార్డులతో స్వర్ణం సాధించిన సుమిత్ అంటిల్‌కు రూ.6 కోట్లు, డిస్కస్ త్రోలో రజతం సాధించిన యోగేష్ కతునియాకు రూ.4 కోట్ల నగదు బహుమతి ప్రకటించారు హర్యానా సీఎం.

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాకి రూ.6 కోట్ల నగదు పారితోషికం ఇచ్చిన హర్యానా ప్రభుత్వం, బాక్సర్ భజరంగ్ పూనియాకి రూ.2 కోట్ల 50 లక్షల పారితోషికం ఇచ్చింది.

click me!