ఫిఫా వరల్డ్ కప్ 2022లో ఖురాన్ క్లాసులు... భారత వివాదాస్పద ప్రవర్త జాకీర్‌కి పిలుపు...

By Chinthakindhi Ramu  |  First Published Nov 20, 2022, 4:14 PM IST

ఖతర్ చేరుకున్న భారత వివాదాస్పద మత ప్రవర్త జాకీర్ నాయిక్... ఫిఫా ఫ్యాన్స్‌కి ఇస్లాం మతం గురించి, ఖురాన్ గొప్పదనం గురించి భోదించనున్న జాకీర్... 


ఆటకు మతానికి సంబంధం లేదు. సామాజికంగా ఉండే కుల, మత, వర్ణ విభేదాలను తొలగించే మహత్తర సాధనమే ఆట.. అందులోనూ ఫుట్‌బాల్ ఆటకు ఉండే క్రేజ్, ఆ గేమ్‌లో ఉండే ఎమోషన్స్... మతం కంటే ఎక్కువే. అయితే మొట్టమొదటి వరల్డ్ కప్‌కి ఆతిథ్యం ఇచ్చే ఛాన్స్ కొట్టేసిన ఖతర్ మాత్రం ఫిఫాలో మత ప్రచారం చేయాలనే ఆలోచన చేస్తోంది...

ఇస్లామిక్ దేశమైన ఖతర్‌లో మహిళల వస్త్రధారణపై ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. తొడలు కనిపించే పొట్టి గౌనులు వేసుకోవడమే కాదు, భుజాలు కనిపించేలా స్లివ్‌లెస్ డ్రెస్సులు వేసుకున్నా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. తమ దేశం మహిళలకే కాకుండా ఖతర్‌లో పర్యటించే వారికి కూడా ఈ ఆంక్షలు ఉంటాయి...

Latest Videos

ఖతర్‌లో జరిగే ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభ వేడుకల్లో ఖురాన్ పఠనం జరగనుంది. వరల్డ్ కప్ కోసం ప్రత్యేకంగా నిర్మించిన స్టేడియాలను ప్రారంభించే సమయంలో కూడా ఖురాన్‌ని పఠనం నిర్వహించారు నిర్వహాకులు. అక్టోబర్ 22, 2021లో ప్రారంభించిన అల్ తుమమా స్టేడియం ప్రారంభోత్సవ సమయంలో దాదాపు 100 మంది చిన్నారులతో ఖురాన్ పఠనం నిర్వహించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది..

ఫిఫా వరల్డ్ కప్ 2022 మ్యాచులు చూసేందుకు ఖతర్‌కి వచ్చే ప్రేక్షకులకు ఖురాన్ పఠనం, ఇస్లాం మత గొప్పదనం గురించి చెప్పేందుకు భారత వివాదాస్పద మత ప్రవర్త జాకీర్ నాయిక్‌ని ఆహ్వానించినట్టు సమాచారం. మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న జాకీర్ నాయిక్, 2016లో భారత దేశం వదిలి మలేషియా పారిపోయాడు...

అన్యమతాలపై విష ప్రచారం చేసే జాకీర్ నాయక్, నాయిక్స్ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ పేరులో ఓ సంస్థను కూడా స్థాపించాడు. ఈ సంస్థ, అన్యమతాలపై విష ప్రచారం చేస్తూ, ఇస్లాం మతస్థుల్లో హిందూ మతంపై ద్వేషాన్ని పెంచేలా రెచ్చగొడుతోందని తేలింది. దీంతో నాయిక్స్ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది...

ఖతర్ ప్రభుత్వ ఆహ్వానంతో మలేషియా నుంచి దోహా చేరుకున్న జాకీర్ నాయిక్, ఫిఫా వరల్డ్ కప్ జరిగేంత వరకూ అక్కడే ఉండి ఇస్లాం మత గొప్పదనం గురించి, ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కి తెలియచేస్తాడు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది ఖతర్ యాజమాన్యం...

‘వరల్డ్ కప్ కోసం భోదకుడు షేక్ జాకీర్ నాయిక్, ఖతర్‌కి వచ్చాడు. టోర్నమెంట్ సాగినంతకాలం అతను మత ప్రచార బోధనలు చేయబోతున్నాడు...’ అంటూ ఖతర్‌లోని ఖతారీ స్టేట్ స్పోర్ట్స్ ఛానెల్ ప్రెసెంటర్ ఫైసల్ అల్‌హజ్రీ ట్వీట్ చేశాడు. ఫిఫా వరల్డ్ కప్‌కి హాజరయ్యే ప్రేక్షకుల్లో మెజారిటీ శాతం మంది క్రైస్తవ మతస్థులు ఎక్కువ ఉండే ఈశాన్య దేశాల ప్రజలే. దీంతో ఖతర్‌లో వీళ్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందోనని ఫిఫా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

click me!