ఫిఫా వరల్డ్ కప్ 2022: ఇంగ్లాండ్ బోణీ... హిజాబ్‌కి నిరసనగా జాతీయ గీతం పాడని ఇరాన్ ప్లేయర్లు...

By Chinthakindhi Ramu  |  First Published Nov 22, 2022, 9:50 AM IST

FIFA World cup 2022: ఇరాన్‌పై 6-2 తేడాతో ఘన విజయం అందుకున్న ఇంగ్లాండ్‌... హిజాబ్ వ్యతిరేక ఉద్యమానికి మద్ధతుగా జాతీయ గీతం పాడని ఇరాన్ ప్లేయర్లు... 


ఫిఫా వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు బోణీ కొట్టింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఇరాన్‌పై 6- 2 తేడాతో ఘన విజయం అందుకుంది ఇంగ్లాండ్. ఇరు జట్లు హోరాహోరీగా తలబడినా ఇంగ్లాండ్ జోరు ముందు ఇరాన్ నిలవలేకపోయింది...

ఆట 35వ నిమిషంలో బెల్లింగ్‌హమ్‌ గోల్ చేసి ఇంగ్లాండ్‌కి ఫిఫా వరల్డ్ కప్ 2022 టోర్నీలో తొలి గోల్ అందించాడు. ఆట 43వ నిమిషంలో బుకాయో మరో గోల్ చేశాడు. 46వ నిమిషంలో స్టెర్లింగ్ మరో గోల్ చేయగా... ఆట 62వ నిమిషంలో సకా గోల్ చేశాడు... 

Latest Videos

దీంతో 4-0 తేడాతో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది ఇంగ్లాండ్ జట్టు. అయితే ఆట 65వ నిమిషంలో ఇరాన్ ఆటగాడు మెహిడీ గోల్ చేసి ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని 4- 1 తేడాతో తగ్గించాడు. ఆట 71వ నిమిషంలో రో‌ష్‌ఫర్ట్‌ గోల్ చేసి  ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని 5- 1కి పెంచాడు. 

ఆట 89వ నిమిషంలో జాక్ గోల్ చేయడంతో 6-1 తేడాతో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది ఇంగ్లాండ్. ఆట ఆఖరి నిమిషంలో ఇరాన్ ఆటగాడు తరెమీ గోల్ సాధించి ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని 6-2 తేడాతో తగ్గించగలిగాడు...

ఇంగ్లాండ్ ఫార్వర్డ్ ప్లేయర్ బుకాయో సాకా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు ఇరాక్ ఆటగాళ్లు జాతీయ గీతం ఆలపించకుండా నిరసన వ్యక్తం చేయడం విశేషం..

ఇరాన్‌లో బహిరంగ ప్రదేశాల్లో మహిళల హిజాబ్ ధరించడం తప్పనిసరి. చేతులు, కాళ్లు కాదు కదా కనీసం మహిళల తల వెంట్రుకలు కూడా కనిపించకూడదు. ఓ మహిళను హిజాబ్ సరిగ్గా ధరించని కారణంగా అరెస్ట్ చేసిన పోలీసులు, తనను తీవ్రంగా హింసించి ఆమె మరణానికి కారణమయ్యారు.

ఈ సంఘటనతో ఇరాన్‌లో హిజాబ్‌కి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే హిజాబ్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నవారిపై కేసులు నమోదు చేస్తోంది ఇరాన్ ప్రభుత్వం.

ఇరాన్ ప్రభుత్వం చర్యలకు నిరసనగా, హిజాబ్ వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నవారికి మద్ధతుగా ఫిఫా వరల్డ్ కప్ వేదికపై జాతీయ గీతం పాడకుండా నిరసన తెలిపింది ఇరాన్ ఫుట్‌బాల్ టీమ్. మహిళల వస్త్రధారణ విషయంలో కఠినమైన నిబంధనలు అమలుచేస్తున్న మరో ఇస్లామిక్ దేశం ఖతర్‌లో, హిజాబ్‌కి వ్యతిరేకంగా నిరసన తెలిపారు ఇరాక్ ఫుట్‌బాల్ ప్లేయర్లు.   స్టేడియానికి హాజరైన ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కూడా హిజాబ్‌కి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు.. 

click me!