CWG 2022: కామన్వెల్త్‌లో మనం ఘనులమే.. ఒలింపిక్స్‌లో నిరాశపడ్డా ఇక్కడ తగ్గేదేలే..

By Srinivas M  |  First Published Jul 26, 2022, 12:47 PM IST

Commonwealth Games 2022: మరో రెండ్రోజుల్లో ప్రారంభం కాబోయే కామన్వెల్త్ క్రీడలు-2022 కోసం భారత ఆటగాళ్లు ఇప్పటికే  బర్మింగ్‌హోమ్‌ చేరుకున్నారు. మరి ఈ క్రీడల్లో భారత్ పరిస్థితి ఏంటి..?


దేశమంతా ‘కామన్వెల్త్’ ఫీవర్ పట్టుకున్నది. ప్రపంచ వేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్న కామన్వెల్త్  గేమ్స్ లో భారత్‌కు ఘన చరిత్రే ఉంది. ఈ క్రీడలు ప్రారంభమైనప్పుడు భారత్ కూడా బ్రిటన్ పాలన కిందే ఉంది. అయితే తొలి క్రీడల్లో మాత్రం మనం భాగం కాలేదు. కానీ ఆ తర్వాత నుంచి  క్రమం తప్పకుండా పాల్గొంటూనే ఉంటున్నాం. భారత్ పాల్గొన్న తొలి కామన్వెల్త్ క్రీడలలో మనకు దక్కింది కాంస్యం మాత్రమే. కానీ కొన్నాళ్ల తర్వాత మాత్రం భారత్ కు ఈ క్రీడలలో పతకాల పంట పండుతున్నది. అసలు ఈ క్రీడలలో భారత్ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది..? కామన్వెల్త్‌లో మన కథేంటో ఇక్కడ చూద్దాం.. 

కామన్వెల్త్ క్రీడలు తొలిసారిగా 1930లో కెనడాలోని హామిల్టన్‌లో ప్రారంభమయ్యాయి. అప్పటికీ భారత్.. బ్రిటీష్ పాలన కిందే మగ్గుతున్నది. స్వతంత్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఆ రోజుల్లో భారత్.. తొలి కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొనలేదు. కానీ రెండో కామన్వెల్త్ క్రీడలు (1938 నుంచి) భారత్ ఈ క్రీడలలో పాల్గొంటున్నది. 

Latest Videos

undefined

ఆరంభం అంతంతే.. 

లండన్‌లో జరిగిన రెండవ కామన్వెల్త్ క్రీడలలో భారత్ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పటికీ బ్రిటీష్ ఎంపైర్ గేమ్స్ గానే పిలుస్తున్న ఈ క్రీడలలో భారత్ తరఫున ఆరుగురు క్రీడాకారులు బరిలోకి దిగారు.  పాల్గొన్న తొలి దఫాలోనే భారత జట్టు.. కాంస్యం సాధించింది. రెజ్లర్ రషీద్ అన్వర్..  74 కేజీల ఫ్రీస్టైల్  రెజ్లింగ్ లో  కాంస్యం సాధించాడు. ఆ క్రీడలలో 12వ స్థానంలో నిలిచింది. అయితే ఆ తర్వాత జరిగిన 1938 (సిడ్నీ) గేమ్స్ లో భారత్‌కు ఒక్క పతకం కూడా రాలేదు. 1942, 1946 లో రెండో ప్రపంచ యుద్ధం కారణంగా వీటిని నిర్వహించలేదు.  1950లో అక్లాండ్ (న్యూజిలాండ్) వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడలలో భారత్ పాల్గొనలేదు. ఇక 1954 లో  కెనడాలోని వాన్కౌర్ లో జరిగిన   పోటీల్లో సైతం భారత్ కు శూణ్యహస్తాలే మిగిలాయి. 

స్వతంత్ర భారతంలో తొలి పతకం.. 

1934లో  కాంస్యం తర్వాత భారత్ మరో పతకం కోసం 24 ఏండ్లు వేచి చూడాల్సి వచ్చింది. 1958లో కార్డిఫ్ (వేల్స్) వేదికగా ముగిసిన కామన్వెల్త్ క్రీడలలో భారత్ రెండు స్వర్ణాలు,  ఒక రజంత సాధించింది. భారత్ తరఫున తొలి స్వర్ణం గెలిచిన అథ్లెట్ గా మిల్కాసింగ్ (పురుషుల 440 మీటర్ల పరుగు పందెం) చరిత్ర సృష్టించాడు. స్వతంత్ర భారతవనిలో భాగంగా కామన్వెల్త్ లో తొలి స్వర్ణం సాధించింది మిల్కాసింగ్ కావడం గమనార్హం. ఇక ఆ తర్వాత భారత్ వెనుదిరిగి చూసుకోలేదు. అదే ఏడాది రెజ్లింగ్ లో లీలా రామ్ లో స్వర్ణం నెగ్గాడు. అంతేగాక ఇవే పోటీలలో భారత్ తరఫున అథ్లెట్ స్టెఫానియా డిసౌజా ఆడిన తొలి అథ్లెట్ గా గుర్తింపు పొందింది.

1990 నుంచి ‘స్వర్ణ’ యుగం..

కామన్వెల్త్ లో భారత్ పతకాల పంట గురించి విశ్లేషించాల్సి వస్తే 1990కు ముందు తర్వాత అని విభజించొచ్చు. ఆక్లాండ్ వేదికగా జరిగిన ఆ క్రీడలలో భారత్ ఏకంగా 13 స్వర్ణాలు, 8 రజతాలు, 11 కాంస్యాలతో 32 పతకాలు సాధించింది.  ఓవరాల్ గా అత్యధిక పతకాలు సాధించిన జాబితాలో  ఐదో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 1994లో (24), 1998 (25), 2002 (69), 2006 (50) సాధించింది. 

2010 లో దేశ రాజధానిలోనే.. 

కామన్వెల్త్ క్రీడలను భారత్ తొలిసారి 2010 లో నిర్వహించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో  జరిగిన ఈ క్రీడలలో భారత్ కు పతకాల పంట పండింది. ఈ క్రీడల్లో భారత్ ఏకంగా 38 స్వర్ణాలు, 27 రజతాలు, 36 కాంస్యాలతో ఏకంగా 101 పతకాలు అందుకుంది. తద్వారా అత్యధిక పతకాలు సాధించిన దేశాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు భారత కామన్వెల్త్ చరిత్రలో ఇదే రికార్డు.  ఆ తర్వాత  2014 గ్లాస్గో (స్కాట్లాండ్) లో 64 పతకాలు, 2018 గోల్డ్ కోస్ట్ (ఆసీస్) లో 66 పతకాలు  సాధించింది.

కాంస్యంతో మొదలైన ప్రయాణం.. నాలుగో స్థానానికి చేరిక 

1934 కామన్వెల్త్ క్రీడలలో పాల్గొని కాంస్యం మాత్రమే గెలిచి ఆ తర్వాత రెండున్నర దశాబ్దాలు పతకం సాధించలేని భారత్.. ఇప్పుడు అత్యధిక పతకాలు సాధించిన  దేశాల జాబితాలో నాలుగో స్థానానికి ఎదిగింది. కామన్వెల్త్  క్రీడల్లో అత్యధిక పతకాలు గెలిచిన దేశం  ఆస్ట్రేలియా. 2018లో ముగిసిన గోల్డ్ కోస్ట్ ఒలింపిక్స్ వరకు ఆ దేశం ఏకంగా 2,415 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో 932 స్వర్ణాలు, 774 రజతాలు, 709 కాంస్య పతకాలున్నాయి. ఈ జాబితాలో ఇంగ్లాండ్ (2,144), కెనడా (1,555) తర్వాత భారత్ 503 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది.  భారత్ సాధించి  పతకాలలో 181 స్వర్ణాలు,  173 రజతాలు, 149 కాంస్యాలున్నాయి. 

కామన్వెల్త్‌లో కింగులమే.. 

ఒలింపిక్స్ లో 140 కోట్ల ప్రజల ఆశలు మోస్తూ నిరాశగానే వెనుదిరిగి వస్తున్నా మన క్రీడాకారులు కామన్వెల్త్ లో మాత్రం మన జెండా పాతుతూనే ఉన్నారు. 70కి పైగా దేశాలు పాల్గొంటున్న ఈ క్రీడలలో  పతకాల పట్టికలో టాప్-10 లోకి 1958లో (8వ స్థానం) వచ్చిన భారత్.. 2002  నుంచి టాప్-5లోనే కొనసాగుతుంది.  2010 లో టాప్-2 లో నిలిచింది. 2018 లో మూడో స్థానం మనదే. 

click me!