CWG 2022: మిగిలింది మూడు రోజులే.. మనకొచ్చిన పతకాలెన్ని..? ‘కామన్వెల్త్’లో మన సినిమా హిట్టా.. ఫట్టా..?

By Srinivas MFirst Published Aug 5, 2022, 5:22 PM IST
Highlights

Commonwealth Games 2022: కామన్వెల్త్  క్రీడలలో భాగంగా భారత   క్రీడాకారులు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.  గణాంకాలూ అవే చెబుతున్నాయి. 

140 కోట్ల ప్రజల ఆశలను మోస్తూ బర్మింగ్‌హామ్ విమానమెక్కిన భారత అథ్లెట్లు కామన్వెల్త్ గేమ్స్‌లో  ఆశించిన రీతిలో రాణించడం లేదు. ఇప్పటివరకు నెగ్గిన పతకాల్లో సగం  వెయిట్ లిఫ్టింగ్ లో వచ్చినవే. మిగిలిన ఈవెంట్లలో ఒకటి అరా తప్ప గొప్ప ఫలితాలైతే రావడం లేదు. పదిరోజులు పాటు సాగనున్న ఈ ఈవెంట్ లో ఇప్పటికే వారం రోజులు గడిచిపోయాయి. మరి మనకు వచ్చిన పతకాలెన్ని..?  గతంతో పోలిస్తే మెరుగయ్యామా..? అధ్వాన్నంగా తయారయ్యామా..?  

గడిచిన రెండు కామన్వెల్త్ గేమ్స్ లో భారత జట్టు సాధించిన పతకాలు వరుసగా   66, 64. పతకాల పట్టికలో మన స్థానం  2018లో 3,  2014లో 4. మరి ఇప్పుడు..? వారం రోజులు ముగిసేసరికి భారత జట్టు పతకాల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు మనం సాధించిన పతకాల సంఖ్య 20. ఇందులో సగం వెయిట్ లిఫ్టింగ్ ద్వారా వచ్చినవే. ఒకవేళ అదీ లేకుంటే మనకు వచ్చిన పతకాలు 10 మాత్రమే..!

ఏడు రోజులు ముగిసేటప్పటికీ భారత జట్టు మొత్తంగా 20 పతకాలు సాధించింది. ఇందులో 6 స్వర్ణాలు, 7 రజతాలు, 7 కాంస్యాలు. పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న  ఆస్ట్రేలియాకు వచ్చిన పతకాలు ఇప్పటికే 132. ఇందులో 51 స్వర్ణాలు, 42 రజతాలు, 39 కాంస్యాలు. ఇంగ్లాండ్ కు మొత్తంగా 118 పతకాలు రాగా కెనడా (59), న్యూజిలాండ్ (37), స్కాట్లాండ్ (34), సౌతాఫ్రికా (22) మనకంటే ముందున్నాయి. 

దేశం పరువు.. పతకాల ‘బరువు’ మోస్తున్నది వెయిట్ లిఫ్టర్లే.. 

వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ ఇప్పటిరకు  10 పతకాలు సాధించింది. ఆ జాబితాను చూస్తే.. 

1. మీరాబాయి చాను (స్వర్ణం) 
2. జెరెమి లాల్రినుంగ (స్వర్ణం) 
3. అచింత షెవులి (స్వర్ణం)
4. బింద్యారాణి దేవి (రజతం) 
5. సంకేత్ సర్గర్ (రజతం) 
6. వికాస్ ఠాకూర్ (రజతం)
7. గురురాజ పూజారి (కాంస్యం) 
8. హర్జీందర్  కౌర్ (కాంస్యం)
9. లవ్‌ప్రీత్  సింగ్ (కాంస్యం) 
10. గురుప్రీత్ సింగ్ (కాంస్యం)

వీళ్లు గాక పతకాలు సాధించినవారి జాబితాలో మిగతా క్రీడలను చూస్తే.. లాన్ బౌల్స్(1 స్వర్ణం), టేబుల్ టెన్నిస్ (1 స్వర్ణం), జూడో (రెండు రజతాలు, ఒక కాంస్యం), బ్యాడ్మింటన్ (ఒక రజతం), స్క్వాష్ (ఒక కాంస్యం), అథ్లెటిక్స్ (ఒక రజతం, ఒక కాంస్యం), పారా పవర్ లిఫ్టింగ్ (1 స్వర్ణం) లు ఉన్నాయి. 

బాక్సర్లు, రెజ్లర్ల మీదే ఆశలు: 

కామన్వెల్త్ క్రీడలు ఆగస్టు 8కి ముగుస్తాయి. భారత్ పతకాల సంఖ్య పెరగడానికి మనకు కొన్ని కీలకపోరులు  రాబోయే మూడు రోజుల్లో ఉన్నాయి. అందులో ముఖ్యంగా బాక్సింగ్. ఇప్పటికే ఈ క్రీడలో ఆరు పతకాలు ఖాయమయ్యాయి. రెజ్లర్ల మీద కూడా భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. ఇక హాకీ (పురుషుల, మహిళల)లో కూడా భారత్ ఇప్పటికే సెమీస్ చేరింది.  క్రికెట్ లో కూడా సెమీస్  నెగ్గితే పతకాల సంఖ్య పెరగనుంది. ఈ క్రీడలతో పాటు బ్యాడ్మింటన్ లో కూడా మన షట్లర్ల మీద భారీ ఆశలున్నాయి.  

click me!