సకుటుంబ సపరివార సమేతంగా.. ఫైనల్స్‌కు..!

First Published Jul 12, 2018, 4:06 PM IST
Highlights

2-1 గోల్స్ తేడాతో ఇంగ్లండ్‌పై క్రొయేషియా విజయం 

 

హైదరాబాద్: ఎక్స్‌ట్రా టైమ్‌లో మరియో మాండ్‌జుకిక్ చేసిన గోల్ 40 లక్షల జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రొయేషియా టీమ్‌ను 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించేలా చేసింది. ఫైనల్స్‌కు పంపించింది. ఈ సారి కప్ మాదే అని ధీమాగా ప్రకటించిన ఇంగ్లండ్ గర్వాతిశయాన్ని భంగపరిచింది. కలలను ఛిద్రం చేసింది. స్వదేశానికి సాగనంపించింది. క్రొయేషియా దేశ చరిత్రలో సరికొత్త పేజీని రాస్తున్నట్టుగా బుధవారం నాటి సెమీ ఫైనల్ మ్యాచ్ ఆ దేశాన్ని ఫైనల్స్‌కు చేర్చింది. ఇవాన్ పెరిసిక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
 
కానీ క్రొయేషియా అంత తేలిగ్గా విజయం సాధించలేదు. అడుగడుగునా ఇంగ్లండ్‌తో హోరాహోరీగా పోరాడాల్సి వచ్చింది. ఫస్టాఫ్ అంతా ఇంగ్లండ్ కలల ప్రపంచాన్ని కళ్ళ ముందు ఉంచింది. ఆట మొదలైన ఐదు నిముషాలకే కెయిరన్ ట్రిప్పెర్ ఫ్రీ కిక్‌తో తొలి గోల్ చేసి ఇంగ్లండ్ టీమ్‌కు 1-0 తేడాతో ఆధిక్యాన్ని అందించాడు. అక్కడ్నుంచి క్రొయేషియా కష్టాలు మొదలయ్యాయి. స్టేడియం అంతా ఇంగ్లండ్‌కు మద్దతు ఇస్తున్న వాతావరణం కనిపించింది. అయినా కానీ క్రొయేషియా ప్లేయర్లు టీమ్ స్పిరిట్‌తో ఆటను రక్తి కట్టించారు. అయినప్పటికీ ఫస్టాఫ్‌లో స్కోరు సమం చేయాలన్న క్రొయేషియా ప్రయత్నాలను ఇంగ్లండ్ అడ్డుకుంది. ఇంగ్లండ్ ఆధిపత్యానికి పట్టం కడుతూ 1-0 తేడాతో ఫస్టాఫ్ ముగిసింది. 

సెకండాఫ్‌లో పెరిసిక్ పుణ్యమాని క్రొయేషియా ఒక గోల్ చేసి, స్కోరును 1-1తో సమం చేసింది. ఇక్కడ్నుంచి ఆట రసకందాయంలో పడింది. అప్పటి దాకా ఇంగ్లండ్‌దే పై చేయి అనుకుంటున్న ప్రేక్షకులకు ఒక్కసారిగా ఆట తలకిందులు అయినట్టు అగుపించింది. ఇరు జట్లలో ఫైనల్స్‌కు చేరుకునేదెవరు అనే ఉత్కంఠ నెలకొంది. మొత్తం టైమ్ అయిపోయినా కానీ ఆట తేలలేదు. పోనీ డ్రా అని డిక్లేర్ చేద్దామంటే ఇది సెమీ ఫైనల్ మ్యాచ్ అయిపోయింది. 

అందుకే ప్లేయర్స్‌కు ఎక్స్‌ట్రా టైమ్ ఇచ్చారు. అలా అందివచ్చిన అవకాశాన్ని క్రొయేషియా సద్వినియోగం చేసుకుంది. మరియో మాండ్‌జుకిక్ చేసిన గోల్ గేమ్‌ను 2-1 తేడాతో ఆట కట్టించింది. క్రొయేషియాను ఫైనల్స్‌కు ఇంగ్లండ్‌ను ఇంటికి సాగనంపింది. కనివినీ ఎరుగని ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి స్టేడియంను మించిన వేదిక మరొకటి లేదనిపించింది క్రొయేషియా ప్లేయర్స్‌కు. అందుకే చిన్నా పెద్దా ఇలా అందరూ కలిసి ఆనందోత్సాహాలతో కెమెరాలకు పోజులిచ్చారు. ఆ తర్వాత ఫ్రాన్స్‌తో ఎటూ ఫైనల్ మ్యాచ్ ఉండనే ఉంది కదా. అప్పటిదాకా ఈ విజయోత్సాహాన్ని ఇలాగే కొనసాగిస్తే క్రొయేషియా ఫుట్ బాల్ హిస్టరీలో మరో చరిత్ర సృష్టించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

click me!