కామన్వెల్త్ గేమ్స్ 2022: పట్టు పట్టిన రెజ్లర్లు... ఫైనల్‌కి సాక్షి మాలిక్, భజరంగ్, అన్షు మాలిక్...

By Chinthakindhi Ramu  |  First Published Aug 5, 2022, 8:00 PM IST

ఫైనల్ చేరిన భారత రెజ్లర్లు దీపక్ పూనియా, భజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, అన్షు మాలిక్... క్వార్టర్ ఫైనల్‌లోకి పీవీ సింధు..


కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత రెజ్లర్లు పట్టు బిగించారు. భారీ అంచనాలతో కామన్వెల్త్ గేమ్స్‌లో అడుగుపెట్టిన భజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, అన్షు మాలిక్... అద్భుత విజయాలతో ఫైనల్‌కి దూసుకెళ్లారు. 62 కేజీల మహిళల ఫ్రీ స్టైయిల్ విభాగంలో పోటీపడిన భారత స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్, సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తన ప్రత్యర్థి ఇంగ్లాండ్‌కి చెందిన క్లేజీ బార్న్‌పై 10-0 తేడాతో భారీ విజయం అందుకుని ఫైనల్‌కి చేరుకుంది...

అలాగే 65 కేజీల పురుషుల ఫ్రీ స్టైయిల్ సెమీ ఫైనల్‌లో భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా, మారిషస్‌కి చెందిన జీన్ గలిన్ జోరిస్‌ని ఒకే నిమిషంలో ఫాల్‌ఇన్ చేసి ఫైనల్‌కి అర్హత సాధించాడు. 57 కేజీల మహిళల విభాగంలో పోటీపడిన భారత రెజ్లర్ అన్షు మాలిక్, తన ప్రత్యర్థి శ్రీలంకకి చెందిన నెత్మీ పోరుతోటగేపై సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 10-0 తేడాతో విజయం సాధించి ఫైనల్‌లోకి ప్రవేశించింది...

Latest Videos

undefined

వీరితో పాటు 86 కేజీల ఫ్రీ స్టైయిల్‌లో పోటీపడిన దీపక్ పూనియా కూడా ఫైనల్ చేరాడు. సెరా లియోన్‌కి చెందిన షేకు కసెబమాపై విజయాన్ని అందుకుని సెమీ ఫైనల్‌కి అర్హత సాధించిన దీపక్ పూనియా, సెమీ ఫైనల్‌లో 3-1 తేడాతో విజయ అందుకుని ఫైనల్ చేరాడు. మరో భారత రెజ్లర్ దివ్య కక్‌రన్ మాత్రం నైజీరియా రెజ్లర్‌ బ్లెస్సింగ్ ఒబురుదుదుతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పరాజయం పాలైంది...

125 కేజీల ఫ్రీ స్టైయిల్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత రెజ్లర్ మోహిత్ గ్రేవల్, సిప్రస్‌కి చెందిన అలెక్సిస్ కుస్లిడిస్‌ని ఓడించి సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లాడు. అయితే సెమీ ఫైనల్‌లో 2-12 తేడాతో కెనడా రెజ్లర్‌ చేతుల్లో ఓడిన మోహిత్ గ్రేవల్, కాంస్య పతక పోటీలో నిలిచాడు...

బ్యాడ్మింటన్‌లో రౌండ్‌ 16లో పోటీపడిన పవీ సింధు, ఉగాండాకి చెందిన సుసినా కొబుగాబేపై 21-10, 21-9 తేడాతో సునాయాస విజయం అందుకుని క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. కిడాంబి శ్రీకాంత్, శ్రీలంక ప్లేయర్ డుమిందు అబీవిక్రమపై విజయం అందుకున్నాడు.

టేబుల్ టెన్నిస్‌లో అచంట శరత్ కమల్ ప్రీ క్వార్టర్‌లోకి అడుగుపెట్టగా మానికా బత్రా, సాథియన్ తొలి రౌండ్‌లో విజయాలు అందుకున్నారు. 

click me!