కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ని వెంటాడుతున్న కరోనా... ఐసోలేషన్‌లో భారత మహిళా హాకీ ప్లేయర్...

By Chinthakindhi Ramu  |  First Published Jul 30, 2022, 3:47 PM IST

భారత మహిళా హాకీ ప్లేయర్ నవ్‌జోత్ కౌర్‌కి కరోనా పాజిటివ్... ఐసోలేషన్‌‌కి తరలింపు... తొలి మ్యాచ్‌లో ఘనాని చిత్తు చేసిన భారత మహిళా హాకీ టీమ్... 


బర్మింగ్‌హమ్‌లో జరుగుతున్న 22వ కామన్వెల్త్ గేమ్స్ కోసం వెళ్లిన భారత బృందాన్ని కరోనా భూతం వెంటాడుతోంది. ఇప్పటికే ఇంగ్లాండ్ పర్యటనకు ముందు భారత మహిళా క్రికెట్ టీమ్‌లో ఇద్దరు ప్లేయర్లు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే... బ్యాటర్, తెలుగు అమ్మాయి సబ్బినేని మేఘనతో పాటు ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్‌ కరోనా పాజిటివ్‌గా తేలడంతో భారత్‌లోనే ఉండిపోయారు.

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో పూజా వస్త్రాకర్ లేని లోటు స్పష్టంగా కనిపించిందని, డెత్ ఓవర్లలో ఆమె బౌలింగ్‌ని మిస్ అయ్యామని టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కామెంట్ చేసింది... 

Latest Videos

undefined

తాజాగా భారత మహిళా హాకీ టీమ్‌ని కూడా కరోనా భయం వెంటాడుతోంది. భారత మహిళా హాకీ ప్లేయర్ నవ్‌జోత్ కౌర్‌ని నిర్వహించిన పరీక్షల్లో స్పష్టమైన ఫలితాలు రాకపోవడంతో ప్రస్తుతం ఆమెను ఐసోలేషన్‌లో ఉంచారు నిర్వాహకులు...  నవ్‌జోత్ కౌర్‌కి మొదటి పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. రెండో పరీక్షలో నెగిటివ్ వచ్చినా రిజల్ట్‌లో స్పష్టత లేకపోవడంతో ఆమెను ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా సూచించారు అధికారులు...

మరో రెండు రోజుల్లో నవ్‌జోత్‌ కౌర్‌కి మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఒకవేళ ఆమె నెగిటివ్‌గా తేలకపోతే కామన్వెల్త్ విలేజ్ నుంచి స్వదేశానికి పయనం కావాల్సి ఉంటుంది. ఆసియా గేమ్స్‌లో రజత పతకం గెలిచిన జట్టులో సభ్యురాలిగా ఉంది 27 ఏళ్ల నవ్‌జోత్ కౌర్..

కామన్వెల్త్ గేమ్స్ కోసం దాదాపు 200 మంది అథ్లెట్లు, మరో 100 మందికి పైగా సహాయక సిబ్బంది ప్రస్తుతం బర్మింగ్‌హమ్‌లోని స్పోర్ట్స్ విలేజ్‌లో ఉంటున్నారు. ఈ వేడుకలకు ముందే ఈ గేమ్స్ విలేజ్2లో నిత్యం డజన్ల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నట్టు నిర్వహాకులు తెలియచేశారు... 

దీంతో కామన్వెల్త్ గేమ్స్ కోసం బర్మింగ్‌హమ్ చేరుకున్న భారత అథ్లెట్లు, విలేజ్ దాటి బయటికి వెళ్లకూడదని, జనాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా ఉండకూడదని, సాధ్యమైనంతవరకూ ఇండోర్‌లకే పరిమితం కావాలని సూచించింది భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ)... 

టోక్యో ఒలింపిక్స్ 2022 సీజన్‌లో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలో దిగిన భారత మహిళా జట్టు, అద్భుత పోరాటాన్ని చూపి హాకీ ఫ్యాన్స్ మనసులు గెలుచుకుంది. అద్భుత ఆటతీరుతో సెమీ ఫైనల్ చేరిన భారత హాకీ జట్టు, కాంస్య పతక పోరులో పోరాడి ఓడి నాలుగో స్థానానికి పరిమితమైంది... 

ఘనాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత మహిళా హాకీ జట్టు 5-0 తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. అలాగే ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ టీమ్ 3 వికెట్ల తేడాతో పోరాడి ఓడింది. గెలిచేసినట్టే అనుకున్న పొజిషన్ నుంచి డెత్ ఓవర్లలో ధారాళంగా పరుగులిచ్చి ఓటమిని కొనితెచ్చుకుంది. 

155 పరుగుల లక్ష్యఛేదనతో బరిలో దిగిన ఆస్ట్రేలియా జట్టు... రేణుకా సింగ్ 4/18 అద్భుత స్పెల్ కారణంగా 34 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఒకనాకదశలో 110/7 స్కోరుకి చేరుకుని ఓడిపోవడం ఖాయమనుకున్న ఆస్ట్రేలియా... ఆఖరి ఐదు ఓవర్లలో అద్భుతంగా రాణించి తొలి విజయాన్ని అందుకుంది... 

click me!