ఆట గదరా నెయిమార్.. మెక్సికోను మట్టి కరిపించావ్..!

First Published 3, Jul 2018, 10:19 AM IST
Highlights

2-0 తో మెక్సికోపై గెలిచిన బ్రెజిల్

హైదరాబాద్: ఫుట్ బాల్ సూపర్ స్టార్లందరూ రష్యా నుంచి దాదాపుగా నిష్క్రమించినప్పటికీ నేనున్నాంటూ నెయిమార్ సోమవారం మైదానంలో మెరుపులు మెరిపించాడు. మనోడి దూకుడుకు మెక్సికో బిత్తరపోయింది. తొలి గోల్ కొడుతుంటే నేల మీద పడిపోయి నిశ్చేతనంగా చూస్తుండిపోయారు మెక్సికో ప్లేయర్లు. ఆ క్రమంలో బ్రెజిల్ జట్టు 2-0 తేడాతో మెక్సికో జట్టును చిత్తు చిత్తుగా మట్టి కరిపించింది. విజయకేతనం ఎగురవేసింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నెయిమార్ నిలిచాడు.
 
ఆరంభం నుంచి ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డాయి. ఫస్టాఫ్ అంతా బాల్ బ్రెజిల్ కంట్రోల్లో ఉండిపోయింది. 10 సార్లు గోల్ పోస్ట్‌పై అటాక్ చేసింది. మెక్సికో ఐదు సార్లతో సరిపెట్టుకుంది. అయినప్పటికీ ఫస్టాఫ్‌లో ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి.

సెకండాఫ్‌ మొదట్లోనూ ఇదే పరిస్థితి కనిపించినప్పటికీ బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెయిమార్ 51వ నిముషంలో ఆల్ రౌండ్ ప్రతిభతో తొలి గోల్ చేసి జట్టుకు 1-0 ఆధిక్యతను అందించాడు. మళ్ళీ 88వ నిముషం దాకా ఇరు జట్లు మధ్య హోరాహోరీ పోరు సాగింది. మెక్సికో ఆటగాళ్ళ గోల్స్ ప్రయత్నాలను బ్రెజిల్ కీపర్ పలు మార్లు అడ్డుకున్నాడు. ఆ జోరులో ఫర్మినో 88వ నిముషంలో గోల్ చేసి బ్రెజిల్‌కు 2-0 ఆధిక్యతను అందించాడు. మెక్సికో మెగా ప్లేయర్లు కార్లోస్ వెలా, హెర్మండెజ్‌లు కురిపించిన మెరుపులు బ్రెజిల్ దూకుడు ముందు వెలవెలబోయాయి. మెక్సికో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ప్రపంచకప్ టోర్నీల్లో మొత్తం 228 గోల్స్ నమోదు చేసిన బ్రెజిల్ సరికొత్త రికార్డు సృష్టించింది.
 

Last Updated 3, Jul 2018, 10:19 AM IST