బెల్జియం హిట్.. జపాన్ ఫట్..!

First Published Jul 3, 2018, 10:34 AM IST
Highlights

3-2 గోల్స్ తేడాతో జపాన్‌పై బెల్జియం గెలుపు

హైదరాబాద్: ఇప్పటికే క్వార్టర్స్ ఫైనల్స్‌లోకి ఎంటరైన టీమ్స్.. బీ కేర్‌ఫుల్, బెల్జియం వచ్చేస్తోంది. ఐదు సార్లు చాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్‌ను మొదటగా ఢీకొట్టనుంది. సోమవారంనాడు జపాన్‌పై ఆడిన మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి అడుగుపెట్టిన నాసెర్ చాడ్లి చివరి సెకండ్లలో చేసిన గోల్ 3-2 గోల్స్ తేడాతో బెల్జియంను గెలిపించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో బెర్త్ సంపాదించి పెట్టింది. ఇడాన్ హజార్డ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. 

క్వార్టర్ ఫైనల్స్‌పై కన్నేసిన ఇరు జట్లు ఆచి తూచి ఆడటంతో ఫస్టాఫ్ చాల వరకు డల్‌గా సాగింది. బెల్జియం కీపర్ తిబౌట్ కోర్టోయిస్ బాల్‌ను తన చేతుల నుంచి కాళ్ళ మధ్యగా జారవిడవడతో జపాన్ గోల్ సాధించిందని అంతా అనుకున్నారు. ఆ కొద్ది సెకండ్లలో ఆ జట్టు సైతం అదే ఆశలు పెట్టుకుంది. కానీ అదే గోల్ కీపర్ లైన్ దాటకుండా బాల్‌ను అడ్డుకోవడంతో అందరూ ఊసురుమన్నారు. అలా గోల్ జపాన్‌ను వచ్చినట్టే వచ్చి ఊరించి వెళ్ళిపోయింది. 

ఇరు జట్లు మిడ్ ఫీల్డ్‌లో సమరాన్ని తలపించేలా ఆడాయి. కానీ బెల్జియం ప్లేయర్లు మునిర్, యనిక్ కొర్రస్కో ముందుకు వెళ్ళాలనే రిస్క్ తీసుకోదలుచుకోలేదు. మంచుకు గడ్డకట్టుకుపోయినట్టుగా ఒకే చోటుకు పరిమితమైపోయారు. దాంతో 3-4-3 ఫార్మాట్‌లో ఉండాల్సిన ప్లేయర్లు పాత చింతకాయ పచ్చడి లాంటి 5-2-3 సిస్టమ్‌కు అంకితమైపోయారు. అదే సమయంలో గోల్ కీపర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో జపాన్‌కు గోల్ దక్కలేదు. 

48వ నిముషంలో గెంగి హరగుచి గోల్ చేసి జపాన్‌కు 1-0 ఆధిక్యతను సంపాదించిపెట్టాడు. దీంతో జపాన్ మంచి ఫామ్‌లోకి వచ్చింది. ముందుకు వెళదామా వద్దా అంటూ ఊగిసలాడుతున్న బెల్జియంపై దూకుడు పెంచింది. బెల్జియం ప్లేయర్ల మనో ధైర్యాన్ని దెబ్బ తీస్తున్నట్టుగా టకాషి ఇన్‌యు 52వ నిముషంలో గోల్ చేశాడు. జపాన్ ఆధిక్యాన్ని 2-0 కు పెంచాడు. గ్యాలరీల్లో ప్రేక్షకులంతా జపాన్‌కు బాసటగా నిలిచారు. బెల్జియం పట్ల సానుభూతి ప్రదర్శించసాగారు. ఆ తర్వాత 61వ నిముషం వద్ద రొమెలు లుకాకు క్లోస్ రేంజ్‌లో గోల్ చేసే చాన్స్ మిస్ చేసుకున్నాడు.
 
అనంతరం ఏదో పునకం వచ్చినట్టుగా బెల్జియం ప్లేయర్ జాన్ వెట్రోన్‌గెన్ తలతో గోల్ చేశాడు. బెల్జియం, జపాన్ మధ్య స్కోరును 1-2 చేశాడు. బెల్జియం ప్లేయర్లలో కొత్త ఉత్సాహం ఉరకలేసింది. అదే ఊపు మీద ప్లేయర్ ఈడెన్ హజార్డ్ డెలవరీని 74వ నిముషం వద్ద సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ ఫెల్లియాని గోల్ చేశాడు. 2-2 తో స్కోర్ సమం చేశాడు. ఆ తర్వాత సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి అడుగుపెట్టిన నాసెర్ చాడ్లి చివరి సెకండ్లలో చేసిన గోల్ 3-2 గోల్స్ తేడాతో బెల్జియంను గెలిపించింది. క్వార్టర్ ఫైనల్స్‌‌కు బెల్జియం చేరుకుంది.

click me!
Last Updated Jul 3, 2018, 10:34 AM IST
click me!