Beijing 2022: బీజింగ్ వింటర్ ఒలింపిక్స్.. అమెరికా బాటలోనే ఆస్ట్రేలియా.. చైనాకు వరుస షాకులు

By team teluguFirst Published Dec 8, 2021, 12:59 PM IST
Highlights

Beijing Winter Olympics: చైనాకు వరుస షాక్ లు తగులుతున్నాయి.  వచ్చే ఏడాది బీజింగ్ వేదికగా జరుగబోయే వింటర్ ఒలింపిక్స్  లో దౌత్య బహిష్కరణ చేయాలన్న దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది.

కమ్యూనిస్టుల పాలనలో ఉన్న చైనాకు వరుస షాక్ లు తగులుతున్నాయి. మానవహక్కుల మీద ఆ దేశం వ్యవహరిస్తున్న తీరు  చర్చనీయాంశమవుతున్నది. దీంతో వచ్చే ఏడాది బీజింగ్ లో జరుగబోయే  వింటర్ ఒలింపిక్స్ జరుగుతాయా..? లేదా..? అన్నది సందిగ్ధంగా మారింది. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ కు ‘దౌత్య బహిష్కరణ’ చేయాలని అగ్రరాజ్యం అమెరికా పిలుపునిచ్చిన కొద్ది గంటల్లోనే.. తాజాగా ఆస్ట్రేలియా కూడా అదే బాటలో పయనించింది. బీజింగ్ కు దౌత్య ప్రతినిధులను పంపేది లేదని స్పష్టం చేసింది.  ఈ రెండు దేశాల బాటలోనే మరిన్ని దేశాలు కూడా చైనాకు షాకులివ్వడం ఖాయంగా కనిపిస్తున్నది. 

చైనాలోని జింజియాంగ్ ప్రావిన్సులోని వీఘర్ ముస్లింల విషయంలో చైనా అనుకరిస్తున్న వైఖరి.. కరోనా సమయంలో చైనా వ్యవహారశైలిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. వీఘర్ ముస్లింల విషయంలో మానవ హక్కుల హననం జరిగిందని  ఆరోపిస్తూ.. రాబోయే వింటర్ ఒలింపిక్స్ లో ‘దౌత్య బహిష్కరణ’ చేయాలని అమెరికా తీర్మానించింది. దీనికి ఐక్యరాజ్యసమితిలో 193 దేశాల అనుమతి లభించింది. తాజాగా ఆస్ట్రేలియా కూడా దీనికి మద్దతు పలికింది. 

ఇదే విషయమై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ మాట్లాడుతూ.. ‘ఆస్ట్రేలియా ప్రజల ప్రయోజనాల కోసం మేము గట్టిగా నిలబడి ఉన్నాం. ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు. మేము ఆ గేమ్స్ (వింటర్ ఒలింపిక్స్) కు ప్రతినిధులను పంపకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు..’ అని చెప్పారు. 

Also Read: జాగ్రత్త.. భారీ మూల్యం తప్పదు..!! బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ లో నిషేధంపై అమెరికాను తీవ్రంగా హెచ్చరించిన చైనా

అయితే ఆసీస్ నిర్ణయంపై చైనా విదేశాంగా శాఖ స్పందించింది. చైనా-ఆస్ట్రేలియా సంబంధాలను బలపరుచుకోవాలనే ఒప్పందాన్ని ఈ నిర్ణయం దెబ్బతీసే విధంగా ఉందని వ్యాఖ్యానించింది. దీనిపై పునరాలోచించుకోవాలని సూచించింది. 

ఇప్పటికే అమెరికా నిర్ణయంపై అగ్గిమీద గుగ్గిల్లమవుతున్న చైనాకు ఇది భారీ ఎదురుదెబ్బే. ఈ రెండు దేశాల బాటలోనే మరిన్ని అగ్రరాజ్యాలు నడిస్తే అది జిన్ పింగ్ నేతృత్వంలోని చైనాకు భారీ షాకే. ఇప్పటికే టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్ షువాయి  ఉదంతంతో ప్రపంచవ్యాప్తంగా అబాసుపాలైన చైనాలో రాబోయే రోజుల్లో జరుగబోయే మేజర్ టోర్నీలను అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ వింటర్ ఒలింపిక్స్ కూడా రద్దైతే అది చైనాకు భారీ షాకే. మరి ఈ నేపథ్యంలో చైనా తీసుకోబోయే నిర్ణయం ఏ మేరకు అథ్లెట్లను క్రీడా ప్రపంచాన్ని ఆకట్టుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

ఇదిలాఉండగా.. ఈ విషయమై చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్  లో వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా దౌత్య బహిష్కరణ అనంతరం గ్లోబల్  టైమ్స్ లో.. ‘మీరొస్తే ఎంత.. రాకుంటే ఎంత.. మీరు రాకపోయినా ఇక్కడ బాధపడేవాళ్లవెరూ లేరు. అసలు దాని ప్రభావం వింటర్ ఒలింపిక్స్ మీద ఉండదు.. అసలు మేము యూఎస్ ప్రతినిధులకు  ఆహ్వానాలే పంపలేదు.. మీరు ఎంత తక్కువ వస్తే మా దేశానికి అంతమంచిది..’ అంటూ వస్తున్న కథనాలు క్రీడాకారులను గందరగోళానికి గురి చేస్తున్నాయి.

click me!