అరుణాచలం గిరి ప్రదక్షిణ మహత్మ్యం

By telugu news teamFirst Published Mar 18, 2021, 3:05 PM IST
Highlights

తిరువణ్ణామలై పవిత్ర క్షేత్రపు అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రత్యేకత ఏమిటనగ పగలైన, రేయైన, సంధ్యైన, ఎండైన, వానైన ఎల్లప్పుడూ ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

అరుణాచలం లేదా "అన్నామలై" తమిళనాడు రాష్ట్రములో ఉంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక. అరుణాచలము అనగా అరుణ - ఎర్రని, అచలము - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యము. అ-రుణ అంటే పాపములను పరిహరించునది అని అర్ధము. తమిళంలో " తిరువణ్ణామలై " అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రము. స్మరణ మాత్రము చేతనే ముక్తినొసగే క్షేత్రము. ఇక్కడికి చేరుకోవడానికి..  చెన్నై నుంచి 185 కి.మి. దూరంలో ఉంది. చెన్నై నుంచి బస్సు, ట్రైన్ సౌకర్యం ఉంది. చెన్నై లోని కోయంబేడు ( సి.యమ్.బి.టి ) బస్సు స్టాండ్ నుంచి అరుణాచలం చేరుటకు 4 లేదా 5 గంటల సమయం పడుతుంది.

తిరువణ్ణామలై పవిత్ర క్షేత్రపు అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రత్యేకత ఏమిటనగ పగలైన, రేయైన, సంధ్యైన, ఎండైన, వానైన ఎల్లప్పుడూ ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు. గంధర్వులు, దేవతలు, మహర్షులు మరియు శివలోకము, విష్ణులోకము వంటి అన్య లోక వాసులుకూడా తిరుఅణ్ణామలైకి విచ్చేసి భూలోక నియతికి తగినట్లు మానవ రూపము ధరించో లేక ఈగ, చీమ, చిలుక, రంగు రంగుల పక్షి, పాము, పశువు, కుక్క వంటి రూపమును దాల్చి సర్వేశ్వరుని ప్రదక్షిణము గావించి మ్రొక్కుతూ ఉండుట వలన గిరి ప్రదక్షిణము చేయువారు ‘మనము ఒంటరిగ వెళుచుంటిమే’ యని చింతయో, భయమో పడునవసరం లేదు.

‘కలియుగములో ధర్మము తగ్గిపోయి అధర్మముతో నిండిపోయి ఉంటుంది. అందువలన ప్రపంచపు జీవరాసులు అనేక రకములైన కష్టాలను అనుభవిస్తూ వేదనలకు గురౌతారు’ అనేదాన్ని తమ దూర దృష్టితో తెలుసుకొన్న యోగులు, మహర్షులు ఆయా యుగాలలో తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణము చేసి కలియుగమునందలి జీవ రాసుల కష్టాలను తుడిచి వేయుటకు కావలసిన నివారణోపాయములను ప్రసాదించుట కొరకు తత్సంబంధిత ప్రాంతములలో కూర్చుని కొండ దిశగా చూస్తూ తపమొనర్చుచుండిరి. 

ఆ విధముగ వారు మహోన్నతమైన తపస్సు చేసిన స్థలములే వారీ దివ్య పుణ్య దర్శనముగా ప్రసిద్ధి చెందినది. ఈ విధంగా ప్రసిధ్ధ పుణ్య దర్శనములుగా పేరు గాంచిన పలు ప్రదేశములు అచ్చోటనే గిరి ప్రదక్షిణము చేసి అక్కడి నుండే తిరుఅణ్ణామలై దిశగా చూచుచూ మ్రొక్కుకొను వారికి వారి సర్వ దుఖాలకునూ తగు నివారణమును ప్రసాదిస్తున్నాయి. 

మహర్షులే కాకుండా దివ్య పుణ్య మూర్తులు కూడా ఈ విధంగా గిరి ప్రదక్షిణము చేసి సర్వేశ్వరుడైన తిరుఅణ్ణామలై స్వామిని దర్శించి మరియు పూజలొనర్చిన అనేక ప్రదేశములుకూడా ప్రసిద్ద దైవ దర్శనములుగా విరాజిల్లి అంతులేని ఫలాలను అందజేస్తున్నాయి. దర్శనము అనగ గిరి ప్రదక్షిణము చేయునపుడు గిరి ప్రదక్షిణ మార్గములో ఒక ప్రత్యేక స్థలమునుంచి కొండ శిఖరాన్ని దర్శించుటయగును. తిరుఅణ్ణామలై గిరి ప్రదక్షిణ మార్గములో వేల సంఖ్యలో ఎందుకు కోట్ల సంఖ్యలో దర్శనములు ఉన్నాయి. 

అదెలా అంటే గిరి ప్రదక్షిణము చేయునపుడు వేసే ప్రతి ఒక్క అడుగుకీ కూడా కొండ శిఖరాన్ని దర్శించుట ఉత్తమమైనది. దీని కోసమే గిరి ప్రదక్షిణము ఒక నిండుమాసాల గర్భిణి స్త్రీ నడిచి వెళ్ళినట్లుగ చేయవలెనని పెద్దలు అంటారు. ఆ విధంగ ఒక్కొక్క అడుగుకీ ఒక్కొక్క దర్శనము కలదు. ఆ రకంగా దర్శనము ఒకటే అయినప్పటికీ కూడ పగలు, రేయి, రోజు, వారము, నక్షత్రము, శుభ సమయం, తిథి వంటి వేర్వేరు నియమాలకు తగినట్లుగా వేర్వేరు ప్రతిఫలాలను వివిధ రకాలుగా ఇవ్వగలదు. 

ఒక నిర్దిష్ట స్థలము నుండి మనకు లభించే దర్శనము కూడ ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. మనం నిశ్చలంగ ఒకే చోట నిలిచి ఉండినను గోళములు, నక్షత్రములు, చంద్ర, సూర్యులు వారి స్థితిగతులను మార్చుకుంటూనే ఉన్నందున ఒకే చోట నిల్చి ఉండి పొందే దర్శన ఫలితములు కూడ మారుతూ ఉంటున్నాయి. ఒకే ఒక అంబిక ఉన్నపటికీ నవరాత్రుల యొక్క తొమ్మిది రోజులలోనూ వివిధ నామ రూపాలను ధరించి ఆశీర్వదించునట్లు, ఒకే ఒక్క దర్శనము వారము, నక్షత్రము, రోజు, యోగము, కరణము, హోరై వంటి కాలమానాలకు తగినట్లు ఎన్నో పేర్లతో ఉంటున్నది. 

అందుకే ‘ఒకే చోట లభించు దర్శనమునకు వేర్వేరు పేరులా’ అనే సందిగ్ధం వద్దు. ఇప్పటికి అర్థమౌతున్నదా తిరుఅణ్ణామలై స్వామివారి మహాత్యము. ఇది మాత్రమేనా.. తనను దర్శించువారి మనో పరిపక్వత, దేవుని పట్ల ఉన్న భక్తి యొక్క ఉచ్ఛ స్థాయుకి తగినట్లు తన రూపాన్ని మార్చి దర్శనమునిచ్చే ప్రత్యేకత కూడా ఉన్నది. 

నవ వ్యాకరణ పండితులైన శ్రీ ఆంజనేయ స్వామివారు గిరి ప్రదక్షిణము చేయు తిరుఅణ్ణామలై యొక్క రూపము, చుట్టుకొలత వేరు కానీ, మనము గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు అదే తిరుఅణ్ణామలైయొక్క రూపము, చుట్టుకొలత వేరు. మన పూర్వీకులైన వసు, రుద్ర, ఆదిత్య పిత్రులు తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణం చేసినచో వారు మానవ శరీరమును దాల్చి ఈ భూలోకములో జీవించినపుడు ఏ విధంగ దర్శనమిచ్చినదో.. అదే విధంగా తిరుఅణ్ణామలై కనిపించుచున్నది. 

ఈ విధముగ తిరుఅణ్ణామలై యొక్క గొప్పతనాన్ని, మహిమలను వివరించుకుంటూనే వెళ్ళొచ్చు. అంతులేని మహా సాగరం లాగ అది విస్తరించినది  అందు వలనే ఎన్నో కోట్ల యుగాలుగా శ్రీ నందీశ్వర స్వామివారు తిరుఅణ్ణామలై గిరి ప్రదక్షిణ మహిమను నిరంతరాయముగా చెప్పుకొస్తే, శ్రీ అగస్త్య మహర్షి తాళ పత్ర గ్రంథములను ఇంకా కూడా లిఖిస్తూనే ఉన్నారు అంటే తిరుఅణ్ణామలై యొక్క మహిమ ఎంత గొప్పదో.

అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రము. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ, దాని చుట్టూ అరుణమనే పురము నిర్మింపబడినదనీ పురాణములు తెలుపుతున్నాయి. అక్కడ జరుగవలసిన పూజావిధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచలమహాత్మ్యం తెలుపుతున్నది. ఈ కొండ శివుడని పురాణములు తెల్పుచుండటము చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయము కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యమీయబడుతున్నది. ఇది జ్యోతిర్లింగమని చెప్పుకొనబడుతున్నది. ఇది తేజోలింగము గనుక అగ్ని క్షేత్రమంటారు.

ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపం కావటంవలన దీనిని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణము అని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదేపదే ఉద్ఘోషించి ఉన్నారు, పాదచారులై శివస్మరణగావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యమూ, అన్నివేళలా ఎంతోమంది గిరిప్రదక్షిణం చేస్తూ ఉంటారు. 

గిరిపైన గల మహౌషధీ ప్రభావం వల్ల శరీరమునకు, శివస్మరణవల్ల మనస్సుకూ, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్ధత చేకూరుతుందని భక్తుల నమ్మకం. గిరిప్రదక్షణం చాలా వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గిరిప్రదక్షణం చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేసారు. ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రి పూట లేదా తెల్లవారుజామున చేస్తారు. రమణాశ్రమానికి 2 కి.మీ. దూరం వెళ్ళిన తరువాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది . అక్కడ నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది.

గిరి ప్రదక్షణం చేసేటప్పుడు తిస్కోవాల్సిన జాగ్రత్తలు:-

* గిరిప్రదక్షణం చెప్పులు లేకుండా చేయాలి.

* బరువు ఎక్కువగా ఉన్నవాటిని మీ కూడా తీసుకువెళ్ళకండి ( సంచులు అలాంటివి )

* గిరిప్రదక్షణం 14 కి.మి దూరం ఉంటుంది.

* ఉదయం పూట గిరి ప్రదక్షణం చేయడం చాలా కష్టం. 9 లోపు ముగించడం మంచిది .

* గిరి ప్రదక్షణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు.

* మీరు చిల్లర తీసుకువెళ్ళడం మరిచిపొవద్దు.

* భక్తులు గిరి ప్రదక్షణం ప్రతిరోజూ చేస్తారు .


 

click me!