మొన్న కేరళలో, నేడు విజయవాడలో : కొండ చరియలు ఎందుకిలా విరిగిపడుతున్నాయి? కారణాలేంటి?

By Arun Kumar PFirst Published Aug 31, 2024, 8:51 PM IST
Highlights

కొండ చరియలు విరిగిపడి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగిందనే వార్తలు ఇటీవల కాలంలో తరచూ వినిపిస్తున్నాయి. తాజాగా విజయవాడలో ఇలాగే కొండచరియలు విరిగిపడి ప్రాణనష్టం జరిగింది. అసలు ఇలాంటి ప్రకృతి వైపరిత్యాలకు కారణమేంటో తెలుసా?

మొన్న వయనాడ్, నిన్న ఉత్తరాఖండ్, నేడు విజయవాడ...  ప్రాంతాలు వేరే కానీ ప్రమాదం మాత్రం ఒక్కటే.. కొండ చరియలు విరిగిపడటం. ఈ ప్రాంతాల్లోనే కాదు ప్రతి వర్షాకాలం ఏదో ఒకచోట కొండచరియలు విరిగిపడి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగినట్లు తరచూ వింటుంటాం. దీంతో కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కు మంటూ జీవించే పరిస్థితి ఏర్పడింది. తాజాగా విజయవాడలో కురుస్తున్న భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడటంతో ప్రాణాపాయం సంభవించింది. ఇటీవల కాలంలో కొండచరియలు విరిగపడుతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఈ ఘటనలు భారత ప్రజలను మరీముఖ్యంగా కొండప్రాంతాల ప్రజలను కలవరపెడుతున్నాయి. 

అసలు కొండ చరియలు ఎందుకు విరిగిపడతాయి..? వందలు, వేల సంవత్సరాలుగా ప్రజలు కొండ ప్రాంతాల్లో జీవిస్తున్నారు... మరి ఎప్పుడూలేనిది ఇప్పుడీ ప్రకృతి వైపరీత్యం సంబవించడానికి కారణమేంటి..? ఇది సహజ ప్రమాదమా... మన చర్యల వల్ల జరుగుతున్న ప్రమాదమా? వర్షాకాలంలోనే ఈ ఈ ప్రమాదం ఎందుకు జరుగుతుంది? తదితర వివరాలు తెలుసుకుందాం.   

Latest Videos

కొండ చరియలు విరిగిపడటం అంటే ఏమిటి ?

అడవులు, కొండలు, గుట్టలు, సముద్రాలు, నదులు... ఇవన్నీ ప్రకృతి మానవుడికి ప్రసాదించిన గొప్ప ఆస్తులు. కానీ మనిషి తన స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేసుకుంటూ వెళుతున్నాడు. దీంతో మనిషిని కాపాడాల్సిన ప్రకృతి ప్రాణాలు తీస్తోంది. ప్రక‌ృతి విపత్తులు పెను ప్రమాదాలను సృష్టిస్తున్నాయి. ఇలాంటి ప్రకృతి విపత్తుల్లో ఇటీవల తరచూ వినిపిస్తున్నది కొండచరియలు విరిగిపడటం. మొన్న వయనాడ్ లో మారణహోమం సృష్టించిన కొండచరియలు ఇప్పుడు విజయవాడలో కొందరి ప్రాణాలను బలితీసుకుంది.  

కొండలపై వుండే రాళ్లు, మట్టిపెళ్లలు... హిమాలయా వంటి శీతల ప్రదేశాల్లో కొండలపైని మంచు కిందకు జారిపడటమే కొండ చరియలు విరిగిపడటం. ఇది వర్షాకాలంలో ఎక్కువగా సంభవిస్తుంది. వివిధ కారణాలతో కొండపైని రాళ్లు, మట్టి వదులుగా మారి వర్షం పడగానే ఆ వరదనీటితో కలిసి ఒక్కసారిగా కిందకు జారిపడతాయి. ఒక్కోసారి ఈ మట్టి, వరదనీరు కలిసి ఆ ప్రాంతంలోని నివాస  ప్రాంతాలను తుడిచిపెట్టేస్తాయి... దీంతో తీవ్ర ప్రాణనష్టం, ఆస్తినష్టం జరుగుతుంది. 

కొండప్రాంతాలు ఎక్కువగా వుండే హిమాలయాలు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం వంటి రాష్ట్రాల్లో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఇటీవల కాలంలో మానవ చర్యల కారణంగా అక్కడా ఇక్కడని లేదు... కొండ ప్రాంతాలున్న ప్రతిచోట ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇలా వయనాడు, విజయవాడలో ప్రమాదాలు కూడా కొండచరియలు విరిగిపడి ప్రాణాపాయం సంభవించింది. 

కొండచరియలు విరిగిపడటానికి కారణం : 

కొండ చరియలు విరిగిపడటానికి ప్రకృతి మార్పులే కారణం. అయితే ఇందులో కొన్ని సహజంగా జరిగితే చాలావరకు మానవ చర్యల వల్ల జరుగుతాయి.  

సహజ కారణాలు : కొండప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో అక్కడ మట్టి కిందకు కొట్టుకుపోతుంది. దీంతో కొండ వాలుప్రాంతాల్లోని మిగతా మట్టి వదులుగా మారిపోతుంది. ఇలా చాలాకాలం ఈ ప్రక్రియ జరిగి ఒక్కసారిగా మట్టి, రాళ్లు కిందరు జారిపడతాయి. 

కొన్ని సందర్భాల్లో కొండవాలు ప్రాంతాల్లో రాళ్లు చాలా వదులుగా అమరివుంటాయి. దీంతో వర్షం పడగానే ఆ వరదనీటి దాటికి ఈ రాళ్లు కొండపైనుండి కింద పడతాయి. భూకంపం వల్ల కూడా కొండ చరియలు విరిగి పడతాయి. మరికొన్ని ప్రకృతి సహజ చర్యల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. 

మానవ కారణాలు : 

మనిషి తన జీవితాన్ని మరింత సుఖమయం చేసుకునేందుకు ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. అందులో ప్రధానంగా చెట్లను నరికివేసి ఆవాసాలను ఏర్పాటుచేసుకుంటున్నారు. అలాగే గనులు, క్వారీల పేరిట నేలను ఇష్టం వచ్చినట్లు తవ్వేస్తున్నారు. ఇలా కొండ ప్రాంతాల్లో చెట్లను నరికివేయడంతో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. అలాగే నేలలో లోతుగా తవ్వకాలు జరపడం కూడా ఇందుకు కారణమవుతోంది. 

కొండచరియలు విరిగిపడటంవల్ల జరుగుతున్న నష్టాలు :

కొండ చరియలు విరిగిపడటం మూలంగా  ఇటీవల కాలంలో చాలా ప్రాణనష్టం జరుగుతోంది. కొండప్రాంతాల్లోని నివాసాలను ఒక్కసారిగా బురదమట్టి పడటంతో మనుషులు, ఇతర జంతుజాలం అందులో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. భారీగా ఆస్తినష్టం కూడా జరుగుతుంది. 

ఇక ఈ కొండచరియలు విరిగిపడి పంటలు కూడా నాశనం అవుతున్నాయి. ముఖ్యంగా కొండప్రాంతాల్లో సాగుచేసే కాఫీ  తోటలకు అధిక నష్టం జరుగుతుంది. ఇతర పంటలకు కూడా నష్టం జరిగి రైతులు ఆర్థికంగా దెబ్బతింటున్నారు. 

ఘాట్ రోడ్లలో తరచూ కొండచరియలు విరిగిపడి రవాణా స్తంబిస్తూ వుంటుంది. దీంతో రాకపోకలు నిలిచిపోయి తీవ్ర నష్టం జరుగుతుంది. బండరాళ్లు పడటంవల్ల రోడ్డు కూడా దెబ్బతింటుంది. 
 
కొన్నిసార్లు కొండచరియలు విరిగిపడి నీటి ప్రవాహాలకు అడ్డుతుంటాయి. దీంతో ఒక్కసారిగా నీరు దారిమళ్లి మానవ ఆవాసాలు, పంటపొలాలపై విరుచుకుపడుతుంటుంది. దీనివల్ల కూడా ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంటుంది. 

 నివారణ చర్యలు : 

ప్రకృతిని నాశనం చేయకుండా వుంటే చాలు... అనేక ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ముఖ్యంగా కొండప్రాంతాల్లో చెట్లను నరకకుండా వుండాలి. అలాగే కొత్తగా చెట్లను పెంచాలి. దీనివల్ల కొండ చరియలు విరిగిపడే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.  

కొండప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్మాణాలకు ఆ ప్రాంతం అనువుగా వుంటుందో లేదో తెలుసుకోవాలి. సమగ్రంగా పరిశీలించిన తర్వాతే నిర్మాణాలు చేపట్టాలి. 

కొండలు, గుట్టలపైన సహజ నీటి ప్రవాహాలకు ఆటంకం కలిగించే చర్యలు చేపట్టరాదు. నీటి ప్రవాహాలను ఆటంకం కలిగిస్తే అవి ప్రమాదాలకు దారి తీయవచ్చు. 

click me!