వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కొనసాగింపే వై.ఎస్ జగన్

By Sreeharsha Gopagani  |  First Published Jul 8, 2020, 10:44 AM IST

డా. వై. ఎస్. రాజశేఖర రెడ్డికి ఎంతో మెరుగైన ముందు కాలానికి అవసరమైన  ‘వెర్షన్’ మనకు జగన్మోహన రెడ్డిలో కనిపిస్తున్నారు. ఏ.పి. ప్రజలు ఐదేళ్ళు ఆయన్ని అధికారానికి దూరంగా ఉంచి, ఆయనతో  ఇంట్లోనే ఐదేళ్ళు ‘రచ్చబండ’ కసరత్తు పూర్తి చేయించినట్టుగా ఉంది.


-జాన్‌సన్ చోరగుడి

డా. వై. ఎస్. రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా గతం నుంచి వర్తమానం లోకి జరుగుతున్న వొక నిరంతర కాలప్రవాహాన్ని సమీక్షించుకోవడానికి 2020 కంటే సరైన ‘టైం సెట్టింగ్’ బహుశా మనకు దొరక్కపోవచ్చు. ఎందుకంటే, మొదటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కొనసాగించిన తనదైన రాజకీయ శైలిని ఇప్పుడు మరింత పదునుగా కొనసాగిస్తూ ఆయన కుమారుడు వై. ఎస్. జగన్మోహన రెడ్డి 2020 నాటికి దక్షణాదిలో వొక శక్తివంతమైన ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడు జనరంజకమైన ముఖ్యమంత్రి కూడా అయ్యారు.

Latest Videos

డా. వై. ఎస్. రాజశేఖర రెడ్డి (వై.ఎస్.ఆర్.) దార్శనికత కోసం మనం ఎక్కడ వెతకాలి? మన దేశంలో కంప్యూటర్స్ లేని కాలంలో దేశప్రధానిగా ఉన్న శ్రీమతి ఇందిరా గాంధీని రెండు దశాబ్దాల తర్వాత 2000 నాటికి ‘ఇందిరమ్మ రాజ్యం’ పేరిట అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో విజయవంతంగా ప్రతిష్టించిన వైనం వద్ద వెతికితే... అక్కడ మనకు దొరుకుతుంది. ఎందుకంటే, దేశంలో ఆర్ధిక సంస్కరణలు మొదలై అప్పటికి వొక దశాబ్ద కాలం దాటిపోయింది. దాని వేగం అప్పటికే పెరిగింది, మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి కనిపించని కాలమది. దేశంలోనే ఆ కాలాన్ని సరిగ్గా ‘మైక్రోస్కోప్’  దృష్టితో  గుర్తించిన వాడు వై.ఎస్.ఆర్. ఆ కాలం కాళ్ళు (1991-2000) ఎక్కడా నేల మీద లేవు, దీన్ని కనుక మనం దొరకపుచ్చుకుని పట్టుకుని క్రిందికి దించితే.... మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ప్రజల వద్దకు చేర్చవచ్చు అనే కాలిక స్పృహతో, దృగ్గోచరమైన అ నాటి ‘సోషల్ కెమిస్ట్రీ’ ని సరిగ్గా అంచనా వేసినవాడు వై.ఎస్.ఆర్. అంతే, ఆయన ‘ఇందిరమ్మ రాజ్యం’ అన్నాడు... అందుకు పాదయాత్రను వొక ‘విజువల్ కమ్యునికేషన్ టూల్’ గా మలుచుకుని జనంలోకి వెళ్లి, తన అంచనా తప్పలేదు అని వరసగా రెండు జనరల్ ఎలక్షన్లలో 2004-2009 నిరూపించాడు.

 

 

చిత్రం ఏమంటే, ఈ మొత్తం తనదైన కసరత్తును, ఆయన పూర్తిగా భిన్నమైన రీతిలో జనంలో ‘ఫోకస్’ చేసేవారు.  బహిరంగ సభల్లో వై.ఎస్.ఆర్. ప్రజలను ఉద్దేశ్యించి బహిరంగ సభల్లో మాట్లాడుతూ.. “నా అక్కలు చెల్లెమ్మల ముఖాల్లో ఎక్కడా కన్నీరు అన్నది కనిపించకూడదు అంటున్నారు మన పార్టీ నాయకురాలు శ్రీమతి సోనియాగాంధీ గారు ” అంటూ... ఇందులో నాదేమీ లేదు, అంతా ఆమె మీకోసం చేయమన్నదే ఆమె తరుపున నేను ఇక్కడ చేస్తున్నాను అనేవారు. నిజానికి గమనిస్తే, ఈ ‘మెలో డ్రామా’ మొత్తం మనకు అప్పట్లోనే అర్ధం అయ్యేది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాన మంత్రి డా. మన్మోహన్ సింగ్ ఇద్దరూ ఏ.పి. వచ్చినప్పుడు వేదికల మీద వారి మాటల్లో మనకు అది దొరికేది!

వై.ఎస్.ఆర్. ను వేదిక మీద పక్కన పెట్టుకుని, ప్రధాన మంత్రి డా. మన్మోహన్ సింగ్ ఉన్నట్టుండి... ‘ ఏ.పి. మోడల్ ‘ అనేవారు. అంతే కాదు, ఆయన ఇక్కడ మాట్లాడుతూ ‘రిఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేస్’ అనేవారు. ఎందుకంటే, పి.వి. జమానాలో తాను ఆర్ధిక మంత్రిగా భారతీయ ఆర్ధిక సంస్కరణల రచన కాలంలో తొలినాళ్ళలో క్షేత్ర స్థాయిలో వాటి అమలులో తాను అప్పుడు ‘మిస్సు’ అయింది ఏమిటో... వై.ఎస్.ఆర్. కారణంగా ‘ప్రాక్టికల్’ గా సింగ్ జీ కి పదేళ్ళ తర్వాత ఇక్కడ అర్ధమయి ఉండాలి. ప్రధాని ఆ మాటలు బహిరంగంగా వేదిక మీద ‘మీడియా’ ముందు అంటున్నప్పుడు సోనియా గాంధీ తనదైన శైలిలో ముఖంలో ఎటువంటి హావభావాలు కనిపించకుండా జాగ్రత్త పడేవారు.

 

 

తాను ముందుగా అధిష్టానానికి మాట ఇచ్చిన ప్రకారం 2009 ఎన్నికల్లో రాష్ట్రంలో మళ్ళీ పార్టీని అధికారంలోకి తేవడమే కాకుండా 33 మంది ఎం.పి. లను రాష్ట్రం నుంచి పార్లమెంట్ కు పంపారు. అలా ఆయన దక్షణాదిన కాంగ్రెస్ పార్టీకి (స్వంత వ్యక్తిత్వం ఉన్న) బలమైన ‘ఎస్సెట్’ గా వై.ఎస్.ఆర్. తయారయ్యారు. అ ఎన్నికలకు ముందు అప్పటికి ‘పి.ఎం. ఇన్ వెయింటింగ్’ కేటగిరీలో ఉన్న రాహుల్ గాంధీని ఆయన రాష్ట్రానికి తీసుకువచ్చి, తన ఇడుపులపాయ ఇంట్లో రాయలసీమ ‘బ్రాండ్ ఐటం’ రాగి సంకటితో ‘లంచ్’ ఇచ్చి... వొక తండ్రి మాదిరిగా దక్షణాదిన ‘మీ కుటుంబానికి నేను అండగా వున్నాను’ అనే భరోసా వై.ఎస్.ఆర్. రాజీవ్ గాంధీ కుటుంబానికి ఇచ్చారు.

 

 

ఇక సి.ఎం. గా వై.ఎస్.ఆర్. ను చూసినప్పుడు, వొక సంఘటన చెప్పాలి. అప్పట్లో పశ్చమ గోదావరి డి.సి.సి. ప్రసిడెంట్ మోషేన్ రాజు వొకానొక పార్టీ సమావేశంలో ఇందిరమ్మ ఇళ్లు కేటాయింపు గురించి, ‘వాళ్ళు మన పార్టీకి వోట్లు వేయలేదు సార్, ఇప్పుడు ఇళ్లు ఎలా ఇస్తాం ...” అన్నప్పుడు సి.ఎం. నవ్వుతూ చెప్పిన జవాబు ఇప్పటికీ ప్రతి రాజకీయ పార్టీ గుర్తుచేసుకోవలసి వుంది! నిజానికి 2009 ఎన్నికల నాటికే వై.ఎస్.ఆర్. తన ప్రభుత్వ పరిపాలనలో - ‘గ్రే ఏరియాస్’ ను గుర్తించారు. అందుకే, ఆయన - ‘పాస్ మార్కులతో గెలిచాము...నిజానికి ఫస్ట్ క్లాస్ రావలిసింది....’ అంటూ ‘రచ్చబండ’ కార్యక్రమానికి బయలుదేరింది. అయితే, 2008 ప్రపంచ ఆర్ధిక మాంద్యం నీలినీడలు దేశ అర్ధికత మీద అప్పటికే పరచుకుంటున్న నిజాన్ని ఇక్కడ విస్మరించలేము.  

 

 

వై.ఎస్.ఆర్. గురించి మాట్లాడుకోవడం అంటే, సరిగ్గా ఇక్కడే మరొక ఆసక్తికరమైన అంశం కనిపిస్తుంది. ఏ.పి.లో రెండవ సారి కాంగ్రెస్ పార్టీ గెలుపు తర్వాత జరిగిన 2009 సెప్టెంబర్ 2 ప్రమాద మరణాని కంటే కొన్ని నెలల ముందు, వై.ఎస్.ఆర్. తన పార్టీ పదవులు అధికార హోదాను పక్కన పెట్టి మరీ వ్యక్తిగత స్థాయిలో తనలోకి తాను మొదలుపెట్టిన రెండవ ‘యాత్ర’ లేదా ‘ఇన్నర్ జర్నీ’ ఆయన పాద యాత్ర కంటే గొప్పది. నిజమే అదొక అంతర్లోక ప్రయాణం... హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో వున్న డా. ఎం.సి.ఆర్. మానవవనరుల అబివృద్ది సంస్థలో జరిగిన వొక సమావేశంలో ఆయన దాన్ని బహిర్గతం చేసారు. “నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో కొన్ని తప్పులు చేశాను....” అని తనకు తానే స్వచ్చందంగా వొప్పుకుంటూ ఆయన తనను తాను ‘క్లెన్స్’ (ప్రక్షాళన) చేసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో బహిరంగంగా అంతకు మించి మాట్లాడడానికి వున్న పరిమితులు ఆయనకు తెలుసు. అయితే, అది ఎంత మందికి అర్ధమయింది అనేది వేరే విషయం. అలా ఆయన తన ‘వోట్ ఆఫ్ థ్యాంక్స్’ తానే చెప్పుకున్నారు.

‘జెనరస్’ జగన్ ఫర్ ‘జెస్ట్ సొసైటీ’

 డా. వై. ఎస్. రాజశేఖర రెడ్డికి ఎంతో మెరుగైన ముందు కాలానికి అవసరమైన  ‘వెర్షన్’ మనకు జగన్మోహన రెడ్డిలో కనిపిస్తున్నారు. ఏ.పి. ప్రజలు ఐదేళ్ళు ఆయన్ని అధికారానికి దూరంగా ఉంచి, ఆయనతో  ఇంట్లోనే ఐదేళ్ళు ‘రచ్చబండ’ కసరత్తు పూర్తి చేయించినట్టుగా ఉంది. ఆయన ముందుగానే ప్రభుత్వ పరిపాలనలో ‘గ్రే ఏరియాస్’ ను గుర్తించి మరీ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. 4 జూన్  2019 న జగన్ ‘ఆశా’ (అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్) జీతాలు 3000 నుంచి 10,000 లకు పెంచినప్పుడు, దాన్ని ఎక్కువమంది ఆలోచనకంటే ఆవేశం ఎక్కువయిన నిర్ణయం అన్నారు. ఏడాది తర్వాత ఆయన వాళ్ళతో ఏమి చేయించడానికి ముందే జీతాలు పెంచారో... మండలానికి వొక అంబులెన్స్ వచ్చాక మనకు స్పష్టమయింది.

 

 

పద్దెనిమిదో శతాబ్ది బ్రిటిష్ తత్వవేత్త జాన్ స్టువర్ట్ మిల్ మొదటిసారి –‘జెస్ట్ సొసైటీ’ అన్నాడు. దాన్ని ఆయన... “Decision makers attended to the common good and all other citizens worked collectively to build communities and programs that would contribute to the good of others”  అంటారు. వొకసారి ప్రజలు ఎన్నుకుని వొక ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ప్రజాస్వామ్యంలో - లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, మూడు వేర్వేరు ఉపాంగాలు

అవి దేని పని అవి చేసుకుపోతూ వుంటాయి. వొక దాని పనిలో మరొకరి జోక్యం లేని స్థితి,

‘గుడ్ గవర్నెస్’ అవుతుంది. పౌరసమాజంలోని ఆలోచనాపరులు సామాన్య జనంలోకి ఇటువంటి ప్రాధమిక పరిపాలన నియమ నిబంధనలు తెలియచేయాలి. సామాన్య ప్రజలకు సహజ న్యాయం కోర్టుల్లో కాదు, ప్రభుత్వాల్లో జరగాలి.  

ఈ ఏడాది జూన్ – జులై మధ్య గత పక్షం రోజుల్లో జరిగిన విషయమిది. ఏ.పి. ప్రభుత్వంలో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి ఉషారాణి విశాఖపట్టణం  విజయనగరం మధ్య ఏ.పి, గ్రేహుండ్స్ పోలీస్ విభాగం కోసం స్థలం ఎంపిక చేయడానికి పర్యటించినట్లు ‘సాక్షి’ పత్రికలో చిన్న పోటో వార్త. విభజన చట్టం ప్రకారం మన రాష్ట్రానికి మనం  వేరుగా దీన్ని నెలకొల్పవలసి ఉంది. మళ్ళీ మొన్న ఆదివారం జులై 5 న రాష్ట్ర డి.జి.పి. శ్రీ గౌతం సవాంగ్ విశాఖ ప్రెస్ మీట్ లో ఈ స్థలం ఎంపిక గురించి దీనికి సంబంధించి మరికొంత సమాచారం ప్రజలకు ఇచ్చారు. ఒక పని మొదలు కావడానికి ప్రభుత్వంలో ఇది జరగవలసిన ఆర్డర్ ఇది. ఈ పని అంతా అయ్యాక, రేపు ఏ భూమి పూజో అంటే... అప్పుడు ఏ హోంశాఖ మంత్రో అక్కడ ‘సైట్లో’ మనకు కనిపిస్తారు. ఎవరి పని వాళ్ళు చేసుకోవడం అంటే ఇది! మన ఆలోచనాపరులు గమనించవలసింది, ఇంతకంటే ఆసక్తి కలిగించే మరొక అంశం ఉంది.

 

 

జూన్ 30 న ఏ.పి. సచివాలయంలో వొక వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. జపాన్ కు చెందిన నాలుగైదు ప్రముఖ ఇంటర్నేషనల్ బ్యాంక్స్, ఆర్ధిక సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. మన రాష్ట్రంలో పది రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టడానికి అవి ముందుకు వచ్చాయి. వాటిలో రామాయపట్నం పోర్టు వంటి అతి ప్రాధాన్య అంశం కూడా వుంది. అయితే, ఈ వీడియో కాన్ఫరెన్స్ లో - పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ గౌతం రెడ్డి , మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ, చీఫ్ సెక్రటరీ శ్రీమతి నీలం సహానీ, మరొక ముగ్గురు నలుగురు సెక్రటరీ స్థాయి అధికారులు హాజరు అయ్యారు. ‘బిజినెస్ లైక్’ అన్నట్టుగా ఇప్పుడు ఏ.పి. లో పరిపాలన జరుగుతున్నది.

 

 

 నిజమే, డా. వై. ఎస్. రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా గతం నుంచి వర్తమానం లోకి జరుగుతున్న వొక నిరంతర కాలప్రవాహాన్ని సమీక్షించుకోవడానికి 2020 కంటే సరైన ‘టైం సెట్టింగ్’ బహుశా మనకు దొరక్కపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన కుమారుడు విభజిత ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి. అది ఆయన తన తండ్రి పేరుతో పెట్టిన తన స్వంత పార్టీ. ఇప్పుడు ఆయన ఎవరి కన్నీళ్లు తుడవాలన్నా తన తండ్రి పేరుతో అ పని మరింత స్వేచ్చగా చేయవచ్చు. ఎటొచ్చీ ప్రజల్ని కొంచెం జాగృతం చేసే ‘మీడియా’  పౌర సమాజం కనుక మనకు ఉంటే, ఇప్పటి ఏ.పి. కి మంచి రోజులు ముందున్నట్టుగా ఆశ అయితే కలుగుతున్నది. ప్రపంచ ప్రముఖ రాజకీయ తత్వవేత్త జాన్ స్టువర్ట్ మిల్ 18 వ శతాబ్దిలో అన్నది 21 లో అయినా ఇక్కడ నిజం అవుతుంది.  

click me!