ఈ శతాబ్ది విషాదంగా మారిన వలస కార్మికుల యాత్ర!

By telugu team  |  First Published May 17, 2020, 9:05 AM IST

పాతికేళ్ల క్రితం ‘ప్రపంచీకరణ’ అంటూ ఆర్ధిక సంస్కరణల నిచ్చెన మెట్ల మీదుగా  ప్రపంచ దేశాల్లో భారీగా ప్రయోజనం పొందిన వారు ఎందరో ఉన్నారు. కానీ ఇన్నాళ్ల తర్వాత కూడా అసంఘటిత రంగంలో ఉన్న వలస కార్మికుల విషయంలో ‘పాన్ ఇండియా’ (PAN: presence across the nation) ‘స్టేటస్’ తో కనీస జీవన భద్రత ప్రమాణాలను కల్పించలేక పోయాం. 


-జాన్ సన్ చోరగుడి

అనుకోని విపత్తు కనుక వస్తే, జీవన భద్రత లేని వలస కార్మికులు అంశం మన వద్ద ప్రభుత్వ యంత్రాంగం చేతులు ఎత్తేసే స్థాయిలో ఉంటుందని ‘కోవిడ్’ 19 వల్ల అర్ధమయింది. కేంద్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూ ప్రకటించిన వారం లోపే, బయటకు రాకుండా ‘మేనేజ్’ చేయలేని స్థాయి వార్తాంశగా ఇది సెంట్రల్ ఇండియా నుంచి బయటకు వచ్చింది. అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న ప్రవాస కార్మికుల ముఖ చిత్రం, ఇన్నాళ్ళూ ప్రజలకు రంగుల కలల్ని చూపిస్తున్న ప్రభుత్వాలను ముద్దాయిలను చేసింది. మే నెల మొదటి వారం నాటికి సమస్య తీవ్రత పెరిగిన తర్వాత ఇప్పుడు వీరి సంఖ్య 42 మిలియన్లు అంటున్నారు. అది కూడా ఖచ్చితమైన లెక్క కాదు. 

Latest Videos

 

 

2008 పిబ్రవరిలో బీహార్, ఉత్తర ప్రదేశ్ వలస కార్మికుల మీద మరాఠా కార్మికులు దాడి చేసి, వారిని మహారాష్ట్ర  నుంచి బయటకు తరిమివేసినప్పుడు, సెంట్రల్ ఇండియా నుంచి ఇటువంటి సమస్య మొదటి సారి జాతీయ వార్త అయింది. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి పని కోసం వెళ్ళిన/వచ్చిన మన దేశీయులకు మనం చేయవలసిన కనీస భద్రత ఎటువంటిది? అనే విషయంలో మనకు ఒక స్పష్టత లేదు. ఇప్పుడు ‘కోవిడ్ -19’ మనకు కొత్త అనుభవం కనుక, దాన్ని ఎదుర్కోవడంలో వలస కార్మికులు విషయంలో మన తత్తరబాటు స్పష్టంగా కనిపిస్తున్నది. మానవ హక్కుల కమీషన్ ముప్పై ఏళ్లుగా పనిచేస్తున్న ఈ దేశంలో అమానుషంగా యు.పి. లోని బరేలీలో వీధుల్లో మార్చి 30 న ‘కరోనా’ భయంతో వలస కార్మికుల మీద సోడియం హైపోక్లోరైట్ జల్లుతూ, ‘కళ్ళు తెరవొద్దు ప్రమాదం’ అంటూ అధికార్లు చెప్పినట్టు లక్నో నుంచి వార్తలు అప్పటికి మన నిస్సహాయతకు పరాకాష్ట.  

 

 

అయితే మే నెల వచ్చే నాటికి మహారాష్ట్రలో రైలు క్రింద పడి చనిపోయిన వారు, ఉత్తరప్రదేశ్ లో ట్రక్కు బోల్తా పడి చనిపోయిన వారు, రహదారుల మీద అలసట మరణాలు, రోడ్ల మీద కాన్పులు, పసిపిల్లలు తల్లుల చేతిల్లో ప్రాణాలు కోల్పోవడం, సైకిళ్ళ మీద వేల కిలోమీటర్ల ప్రయాణాలు ఇవన్నీ చూసాక, ‘కళ్ళు తెరవొద్దు ప్రమాదం’ అంటూ మీద ‘సోడియం హైపోక్లోరైట్’  స్ప్రే చేయడం సన్మానం చేయడం వంటిది అని సరిపెట్టుకోవాల్సి వస్తున్నది! 

 

 

నేపధ్యంలోకి చూస్తే - ఆర్ధిక సంస్కరణల రెండవ దశలో పెద్ద ఎత్తున ఉపాధికి ఆస్కారం కలిగించిన నిర్మాణ, సేవల రంగాలు సెమీ స్కిల్డ్, స్కిల్డ్ యువతను స్వంత ప్రాంతాలను విడిచి ఉపాధి కోసం దేశంలో ఎక్కడికైనా వెళ్ళే ప్రోత్సాహాన్ని ఇచ్చింది. రూపాయి నాణెం ‘పబ్లిక్ పోన్ బాక్సు’ లో వేసి దేశంలో ఎక్కడికైనా మాట్లాడే వసతి 2001 నాటికి వచ్చింది. దాంతో పని స్థలం నుంచి కుటుంబంతో దూరం తగ్గింది. ఆ తర్వాత ఏ.టి.ఎం. కార్డుతో ఇంటికి డబ్బు పంపడం తేలిక అయ్యాక, ఈ వలసల వేగం పెరిగింది. 

 

 

ఇప్పుడంటే, ఈ ‘కరోనా వైరస్’ వచ్చాక, ఇవన్నీ సమీక్షకు గురై ‘అస్సలు వీళ్ళు ఇలా ఇల్లు విడిచి ఎక్కడెక్కడికో వెళ్ళడం ఏమిటి... ఎందుకు?’ అంటున్నారు గానీ; విపత్తు వచ్చిందని - విషయాన్ని సమీక్షించే విధానం మాత్రం అది కాదు. డా. మన్మోహన్ సింగ్ వంటి ప్రధాని కూడా ‘సి.ఐ.ఐ.’ వంటి వేదికల మీద గతంలో ఉద్యోగ అవకాశాలు పెంచండి అంటూ ప్రైవేట్ కార్పోరేట్ కంపెనీలకు పిలుపు ఇచ్చారు. 

 

 

కొనసాగింపుగా యు.పి.ఏ. ప్రభుత్వం 2004 సెప్టెంబర్ లో కొత్తగా నాన్-రెసిడెంట్ ఇండియన్స్ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ప్రారంభించి, తర్వాత దాన్ని ‘ఓవర్సీస్ ఇండియన్ అఫైర్స్’ గా మార్చింది. ఇకముందు ఇటువంటి కసరత్తు ఇప్పుడు రాష్ట్రాలు చేయవలసిన సమయం ఆసన్నమయింది. ఇందుకు ముందుగా ప్రతి రాష్ట్రంలో ఆయా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బయట రాష్ట్రాలకు పనికి వెళుతున్న కార్మికుల ‘డాటా బేస్’ నమోదు విధిగా జరిగేట్టు చూడాలి. ‘అధార్’ నెంబర్ ప్రాతిపదికగా ఇది చాలా తేలిక. 

 

అయితే, ఇందువల్ల అతని కుటుంబానికి రేషన్ తగ్గించడం వంటి షరతులు లేనప్పుడే, స్వచ్చందంగా నమోదుకు పంచాయతీ కార్యాలయం వద్దకు ప్రజలు వెళతారు. ఏ.పి. లో గ్రామ సచివాలయాల్ని ఇందుకు పటిష్టంగా వాడుకోవచ్చు. ఫలితంగా ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ఏ రాష్ట్రంలో ఎక్కడ ఎంతమంది ఏ జిల్లాల వాళ్ళు ఉన్నారు, అనే వివరాలు ప్రభుత్వం వద్ద ఉంటుంది. ఆయా రాష్ట్రాలతో వారి భద్రత విషయంగా ప్రభుత్వం పూచీ పడటం తేలిక అవుతుంది. ఇందువల్ల మున్ముందు వివరాల్లోకి వెళ్ళినప్పుడు, పని స్థలంలో వీరికున్న భద్రత, కార్మిక శాఖ భద్రతా ప్రమాణాల అమలు, వేతనాలు, ఇన్సురెన్స్ వంటి వివరాలు వెలుగులోకి రావొచ్చు కావాలంటే, రాజకీయ పార్టీలు వీరిని ప్రవాస ‘వోటర్లు’గా కూడా చూడవచ్చు! 

తరుచూ తుఫాన్లు సమయంలో గుజరాత్ లో మన జాలర్లు అంటూ, వార్తలు చూస్తూ ఉంటాము. ఇటువంటి సమస్య కనుక లేకపోతే ఎంత మంది ఎక్కడికి వెళుతున్నారు, ఎలా వుంటున్నారు వంటి వివరాల్లోకి మనమూ వెళ్ళం. వలసలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఇందుకోసం ఒక డైరక్టరేట్ వంటి శాశ్విత ఏర్పాట్లు చేయాలి. అసంఘటిత రంగాల్లో శ్రామికులుగా పనిచేయడానికి స్వచ్చందంగా వెళ్ళే వారు ఇటువంటి ‘నెట్ వర్క్’ లో ఉన్నప్పుడు, బయట రాష్ట్రాల్లో వీరి సేవలు తీసుకునే యాజమాన్యాలు బాధ్యతగా వీరి పట్ల ఉంటాయి. 

మొదటి నుంచీ ఇటువంటి ఏర్పాటు మనకు ఉండి ఉంటే, ముందుగా ఎమెల్యేలు వారి గురించి ప్రభుత్వం దృష్టికి తెచ్చేవారు. స్థానికంగా వారి కుటుంబాలు వారి మీద ఒత్తిడి తెచ్చేవారు. ఎం.పి. లు దాన్ని పార్లమెంట్ లో ప్రస్తావిస్తారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ‘జనతా కర్ఫ్యూ’ ప్రకటించి ఉండేది. దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు ఒక్క రంగంలో దొరుకుతున్నప్పుడు, ఎవరి అవసరం మేర వాళ్ళు తమకు మెరుగైన ఉపాధి దొరికే చోటికి వెళతారు. ఒక రాష్ట్రంలో లేని  ఉపాధి మరో రాష్ట్రం చూపుతున్నప్పుడు, కేవలం ‘డేటా బేస్’ తో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య సమన్వయంతో శ్రామికుల కుటుంబాల్లో సంతోషం నింపవచ్చు. 

click me!