పరిమితి ఎత్తేస్తే.. మనోళ్లకే గ్రీన్ కార్డులెక్కువ.. సాధ్యమేనా?!

By sivanagaprasad kodatiFirst Published Jan 3, 2019, 12:51 PM IST
Highlights

ఇటీవలి కాలంలో అమెరికాకు వచ్చే విదేశీ నిపుణులకు గ్రీన్ కార్డులను జారీ చేసే విషయమై దేశాల వారీ వాటా, కోటా పరిమితి ఎత్తివేయాలన్న డిమాండ్ క్రమంగా పెరుగుతోంది

అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్‌కార్డులకు దరఖాస్తు చేసుకునే వారిలో భారతీయలే ఎక్కువ మంది ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. గ్రీన్‌కార్డుల కోసం దేశాల వారీ కోటా ప్రకారం భారతీయులు ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.

అందుకే ఈ కోటాను ఎత్తివేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దేశాల కోటా నిబంధనను తొలగించడం వల్ల భారత్‌, చైనా దేశాల వారికే ఎక్కువ గ్రీన్‌కార్డులు వస్తాయని, అంతేగాక.. అమెరికా పౌరసత్వం పొందేవారిలోనూ ఈ దేశాలకు ఆధిపత్యం ఉంటుందని తాజా నివేదిక తెలిపింది.

గురువారం నుంచి ప్రారంభం కానున్న అమెరికా కాంగ్రెస్‌ సమావేశాల్లో గ్రీన్‌కార్డుల జారీల్లో దేశాల కోటాను ఎత్తివేసేలా చట్టాన్ని తేవాలని చాలా మంది ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కాంగ్రేషనల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌(సీఆర్‌ఎస్‌) ఇటీవల దేశాల కోటా, శాశ్వత ఉపాధి తదితర అంశాలపై నివేదిక తయారుచేసింది. ఈ కోటాను ఎత్తివేయడం వల్ల అమెరికా మార్కెట్లో ప్రస్తుతం దేశాల మధ్య ఉన్న వివక్ష తొలగిపోతుందని, దీని వల్ల భారత్‌, చైనా లాంటి దేశాలకు ఆధిపత్యం చెలాయించే అవకాశం వస్తుందని సీఆర్‌ఎస్‌ తన నివేదికలో పేర్కొంది. 

అమెరికా పౌరసత్వం, వలస సేవల సంస్థ (యుస్‌సీఐఎస్‌) తాజా గణాంకాల ప్రకారం గతేడాది ఏప్రిల్‌ నాటికి 3,95,025 మంది విదేశీయులు ఒక విభాగంలో గ్రీన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు.

వీరిలో 3,06,601 మంది ఇండియన్లు.. వారిలో అత్యధికులు ఐటీ నిపుణులే ఉన్నారు. గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్న విదేశీయుల్లో భారతీయులు 78 శాతం మంది ఉంటారు. భారత్‌ తర్వాత 67,031 మందితో చైనా రెండో స్థానంలో ఉంది.

ప్రస్తుతం దేశాల కోటా వల్ల చాలా మంది భారతీయులు గ్రీన్‌కార్డులు పొందాలంటే దాదాపు తొమ్మిదిన్నర ఏళ్లు ఎదురుచూడాల్సి వస్తోంది. కోటాను ఎత్తివేస్తే గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూసే భారతీయుల సంఖ్య భారీగా తగ్గుతుందని సీఆర్‌ఎస్‌ తెలిపింది.

దీని వల్ల పెండింగ్‌ దరఖాస్తులు కూడా తగ్గుతాయని పేర్కొంది. ఈ సమయం ప్రతియేటా గ్రీన్ కార్డు కోసం వచ్చే దరఖాస్తుల సంఖ్యను బట్టి కూడా పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. ఇక ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ (ఐఎన్ఏ) ప్రకారం ప్రతియేటా ఐదు విభాగాల ఉద్యోగాల ఆధారిత చట్టబద్ధమైన శాశ్వత పౌరసత్వం (ఎల్పీఆర్) కింద 1.40 లక్షల వీసాలను జారీ చేయడానికి అనుమతి ఉంది.

2017లో సుమారు 11 లక్షల మందిని (12 శాతం) ఎల్పీఆర్ కింద అనుమతించారు. 2018 మధ్య నాటికి అదనంగా తొమ్మిది లక్షల వీసాలు జారీ అయ్యాయి. వాటిలో అత్యధికంగా భారత్, చైనా, ఫిలిప్పీన్స్ దేశాలే పొందాయని ఆ నివేదిక పేర్కొన్నది. 

click me!