జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపబోమని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అన్నారు. ఈ విషయంలో ఢిల్లీ ప్రజలకు తాను హామీ ఇస్తున్నానని అన్నారు. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ నుంచి పాలన సాగిస్తున్న నేపథ్యంలో సక్సేనా ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వాన్ని జైలు నుంచి నడపబోమని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అన్నారు. జైలులో ఉన్నా.. అక్కడి నుంచే అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మార్చి 21న అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఆయనను ఈడీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా.. ఈ నెల 28వ తేదీ వరకు రిమాండ్ విధించారు. అయితే జైలు నుంచి కేజ్రీవాల్ పరిపాలన సాగిస్తున్నారు. ఢిల్లీలో నీటి సమస్యపై అధికారులకు ఇటీవల అక్కడి నుంచే ఆదేశాలు చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని ఉత్తర్వులు జారీ చేశారు. జైలు నుంచే పాలన సాగించడం పట్ల లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందించారు. ‘‘జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపబోమని నేను ఢిల్లీ ప్రజలకు హామీ ఇస్తున్నాను’’ అని అన్నారు.
అసలు కేజ్రీవాల్ జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపగలరా?
ఒక ముఖ్యమంత్రి జైలు నుంచి తమ కార్యాలయాన్ని సమర్థవంతంగా నడపడం ఆచరణ సాధ్యం కానప్పటికీ, వారు అలా చేయకుండా నిరోధించే చట్టపరమైన అడ్డంకులు లేవు. చట్టప్రకారం ఏ కేసులోనైనా దోషిగా తేలితేనే ముఖ్యమంత్రిపై అనర్హత వేటు లేదా పదవి నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు అరవింద్ కేజ్రీవాల్ కు శిక్ష పడలేదు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 కొన్ని నేరాలకు అనర్హత నిబంధనల వర్తిస్తాయి. కాగా.. ఒక ముఖ్యమంత్రిని రెండు పరిస్థితులలో వారి పదవి నుండి తొలగించవచ్చు: అసెంబ్లీలో మెజారిటీ మద్దతును కోల్పోయినప్పుడు, ఆయన నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణం విజయవంతమైనప్పుడు సీఎం పదవి కోల్పోతారు.
అయితే గతంలో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు సీఎంలు అరెస్టుకు ముందు లేదా తరువాత రాజీనామాలు చేశారు. ఈ ఏడాది జనవరి 31న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడానికి ముందు జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన స్థానంలో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) చంపాయ్ సోరెన్ ను నియమించారు.