సీఏఏను ఎప్పటికీ వెనక్కి తీసుకోం - అమిత్ షా

By Sairam Indur  |  First Published Mar 14, 2024, 11:44 AM IST

పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అణచివేతకు గురైన మైనారిటీలకు హక్కులు, న్యాయం అందించడమే తమ లక్ష్యమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. సీఏఏను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోబోమని చెప్పారు.


పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎప్పటికీ వెనక్కి తీసుకోబోమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. దేశంలో భారత పౌరసత్వాన్ని నిర్ధారించే సార్వభౌమ హక్కుపై కేంద్రం రాజీపడదని ఆయన స్పష్టం చేశారు. 2019 లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేర్చడానికి ప్రభుత్వం సీఏఏ నిబంధనలను నోటిఫై చేసిన కొద్ది రోజుల తర్వాత అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ చట్టాన్ని రద్దు చేయడం అసాధ్యమని, దీనిపై ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పిస్తుందని ఆయన వార్తా సంస్త ‘ఏఎన్ఐ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తాము అధికారంలోకి రాగానే చట్టాన్ని రద్దు చేస్తామని ప్రతిపక్ష టీడీపీ ముఖ్యంగా కాంగ్రెస్ నేత చెప్పడంపై హోం మంత్రి స్పందిస్తూ.. ‘‘అధికారంలోకి ఎలాగూ రామని ఇండియా కూటమికి కూడా తెలుసు. సీఏఏను బీజేపీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని రద్దు చేయడం అసాధ్యం. దీన్ని రద్దు చేయాలనుకునే వారికి చోటు దక్కనివ్వం. దేశవ్యాప్తంగా దీనిపై అవగాహన కల్పిస్తాం’’ అని అమిత్ షా పేర్కొన్నారు.

Latest Videos

సీఏఏ రాజ్యాంగ విరుద్ధం అనే విమర్శలను తోసిపుచ్చిన హోం మంత్రి, ఈ చట్టం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించదని అన్నారు. ‘‘వారు ఎప్పుడూ ఆర్టికల్ 14 గురించే మాట్లాడతారు. ఆ ఆర్టికల్ లో రెండు క్లాజులు ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోయారు. ఈ చట్టం ఆర్టికల్ 14ను ఉల్లంఘించదు. ఇక్కడ స్పష్టమైన, సహేతుకమైన వర్గీకరణ ఉంది. విభజన కారణంగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో ఉండి మతపరమైన హింసను ఎదుర్కొని భారత్ కు రావాలని నిర్ణయించుకున్న వారి కోసం ఇది ఒక చట్టం’’ అని కేంద్ర మంత్రి అన్నారు.

రాబోయే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీఏఏను నోటిఫై చేశారన్న ప్రతిపక్షాల ఆరోపణపై అమిత్ షా స్పందిస్తూ.. కోవిడ్ కారణంగా చట్టం నోటిఫికేషన్ ఆలస్యమైందని అన్నారు. ‘‘ముందుగా టైమింగ్ గురించి మాట్లాడతాను. రాహుల్ గాంధీ, మమత, కేజ్రీవాల్ సహా ప్రతిపక్షాలన్నీ ఝూత్ కీ రాజ్నీతి (అబద్ధాల రాజకీయం) లో నిమగ్నమవుతున్నాయి కాబట్టి సమయం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. బీజేపీ తన 2019 మేనిఫెస్టోలో సీఏఏను తీసుకువస్తామని, శరణార్థులకు భారత పౌరసత్వం ఇస్తామని స్పష్టం చేసింది. బీజేపీకి స్పష్టమైన ఎజెండా ఉంది. ఆ హామీ ప్రకారం పౌరసత్వ (సవరణ) బిల్లు 2019 లో పార్లమెంటు ఉభయ సభలలో ఆమోదం పొందింది. కోవిడ్ కారణంగా ఆలస్యమైంది. ఎన్నికల్లో పార్టీ విజయం సాధించకముందే బీజేపీ తన ఎజెండాను స్పష్టం చేసింది’’ అని ఆయన తెలిపారు. 

పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అణచివేతకు గురైన మైనారిటీలకు హక్కులు, న్యాయం అందించడమే బీజేపీ ప్రధాన లక్ష్యమని, రాజకీయ లబ్ది ప్రసక్తే లేదని హోంమంత్రి స్పష్టం చేశారు. సర్జికల్ స్ట్రైక్, ఆర్టికల్ 370 రద్దుపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తి రాజకీయ లబ్దితో ముడిపెట్టాయన్నారు. కాబట్టి ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోకూడదా? ఆర్టికల్ 370ని ఉపసంహరించుకుంటామని 1950 నుంచి చెబుతూనే ఉన్నామని అన్నారు. సీఏఏపై తాను కనీసం 41 సార్లు వివిధ వేదికలపై మాట్లాడానని, దేశంలోని మైనారిటీలు భయపడాల్సిన అవసరం లేదని, ఏ పౌరుడి హక్కులను వెనక్కి తీసుకునే నిబంధన ఇందులో లేదని వివరంగా మాట్లాడానని చెప్పారు. 

click me!