కేంద్ర ప్రభుత్వం ఇవాళ మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. మధ్యంతర బడ్జెట్ కు , పూర్తిస్థాయి బడ్జెట్ కు మధ్య తేడా గురించి ఓసారి తెలుసుకుందాం.
న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు ప్రభుత్వాలు మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెడతారు. ఈ బడ్జెట్ ను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లేదా మధ్యంతర బడ్జెట్ అని పిలుస్తారు. ఎన్నికల తర్వాత ఏర్పడిన కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం సాంప్రదాయం.
కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఈ సాంప్రదాయాలను పాటిస్తాయి.ప్రభుత్వాలు పనిచేయడానికి అవసరమైన నిధులు ఖర్చు చేయడానికి చట్ట సభల అనుమతి తీసుకోవడానికి మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెడతారు.
also read:union budget 2024: బడ్జెట్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
ప్రతి ఏటా ఏప్రిల్ నుండి మరో ఏడాది మార్చి వరకు ఆర్ధిక సంవత్సరంగా పిలుస్తారు. ఈ పూర్తి ఆర్ధిక సంవత్సరానికి కేటాయింపులను పూర్తి స్థాయి బడ్జెట్ అంటారు. అయితే ఎన్నికలకు ముందు ప్రభుత్వాలు మధ్యంతర బడ్జెట్ ను మాత్రమే ప్రవేశ పెడతాయి.
గత ఏడాది ఆమోదం పొందిన బడ్జెట్ ఈ ఏడాది మార్చి 31తో ముగియనుంది. దీంతో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు నుండి నాలుగు మాసాల కాలానికి అవసరమైన ఖర్చుల కోసం అనుమతి కోసం మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెడతారు. కన్సాలిడేటేడ్ ఫండ్ నుండి నిధులను ఉపయోగించుకుంటారు. ఈ నిధులను ప్రభుత్వాల రోజువారీ ఖర్చుల కోసం వినియోగిస్తారు. మధ్యంతర బడ్జెట్ లో కొత్త పథకాలు ఎక్కువగా ప్రభుత్వాలు ప్రకటించకపోవచ్చు. ప్రధానంగా ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కొత్త పథకాలు, సంక్షేమ పథకాల వంటి అంశాలపై కేటాయింపులు చేసే అవకాశం ఉంటుంది.
కేంద్ర ఆర్ధికశాఖమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. నిర్మలా సీతారామన్ వరుసగా ఆరోసారి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.ఎన్నికలకు ముందు కేంద్రం బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నందున ఎన్నికల వరాలు ఏమైనా కురిపిస్తారా అనే విషయమై మధ్యతరగతి ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.