తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

09:46 PM (IST) Aug 19
కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఏడాది పాటు అంటే 2023 ఆగస్ట్ 22 వరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా అజయ్ భల్లా కొనసాగుతారని భారత ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. మరో మూడు రోజుల్లో ఆయన పదవీ కాలం ముగియనుండగా.. కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
09:04 PM (IST) Aug 19
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 40 అంతస్తుల ట్విన్ టవర్స్ కూల్చివేతకు రంగం సిద్ధమైంది. సుప్రీంకోర్ట్ విధించిన డెడ్‌లైన్‌కు సమయం దగ్గరపడుతుండటంతో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ భారీ నిర్మాణాలను కూల్చివేయనున్నారు. ఈ క్రతువుకు ప్రజలు దూరంగా వుండి సహకరించాలని అధికారులు సూచించారు.
08:22 PM (IST) Aug 19
భారతదేశానికి చెందిన ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ స్కార్పియో క్లాసిక్ పేరిట కొత్త మోడల్‌ను ఆవిష్కరించింది. క్లాసిక్ ఎస్ (రూ.11.99 లక్షలు), క్లాసిక్ ఎస్ 11 (రూ.15.49 కోట్లు) పేరిట రెండు వేరియంట్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
07:26 PM (IST) Aug 19
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి.. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసంలో సీబీఐ తనిఖీలు చేపట్టింది. అనంతరం 15 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా తెలంగాణ వాసి కూడా ఉండటం గమనార్హం. 11 పేజీల ఆ ఎఫ్ఐఆర్ కాపీలో నేరపూరిత కుట్ర, ఫాల్సిఫికేషన్‌లు ప్రధాన ఆరోపణలుగా సీబీఐ చేర్చింది.
06:44 PM (IST) Aug 19
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ హెలికాఫ్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. శుక్రవారం రాజధాని పాట్నా నుంచి రాష్ట్రంలోని కరువు పీడిత ప్రాంతాలను సందర్శించేందుకు సీఎం హెలికాఫ్టర్‌లో బయల్దేరారు. అయితే టేకాఫ్ అయిన కాసేపటికే ప్రతికూల వాతావరణం కారణంగా.. ముఖ్యమంత్రి చాపర్ అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు పైలట్లు
06:04 PM (IST) Aug 19
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ రామంతాపూర్ నారాయణ కాలేజీలో విద్యార్ధి ఆత్మహత్యాయత్నం వ్యవహారంపై తెలంగాణ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిలో భాగంగా కాలేజీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. కాలేజ్ ఘటనపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
05:21 PM (IST) Aug 19
కేరళలో వయానాడ్‌లోని రాహుల్ గాంధీ కార్యాలయంలో ఇటీవలే జరిగిన ఘర్షణల్లో మహాత్మా గాంధీ ఫొటో ధ్వంసం అయింది. ఈ ఫొటోను ప్రత్యర్థి వర్గం ఎస్ఎఫ్ఐ (స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) కార్యకర్తలు నాశనం చేశారని అభియోగాలు మోపారు. కానీ, వాస్తవాలు ఇందుకు విరుద్ధంగా ఎదురవుతున్నాయి. మహాత్మా మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీ ఫొటో ధ్వంసం కేసులో రాహుల్ గాంధీ స్టాఫ్ అరెస్టు కావడం చర్చనీయాంశంగా మారింది.
04:43 PM (IST) Aug 19
బ్రిటన్ ప్రధాని అభ్యర్థి రిషి సునక్ ఎన్నికల బిజీ షెడ్యూల్ లోనూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొని భారత సంస్కృతి, పండగలపై అభిమానాన్ని చాటుకున్నారు. లండన్ నగర శివార్లలోనిహరే కృష్ణ ఆలయానికి భార్య అక్షత మూర్తితో కలిసి వెళ్లారు రిషి.
03:30 PM (IST) Aug 19
హైదరాబాద్ దారుణం చోటుచేసుకుంది. రామంతాపూర్ లో ప్రముఖ కార్పోరేట్ విద్యాసంస్థ నారాయణ కాలేజీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రిన్సిపల్ రూంలోనే నిప్పంటించుకున్న యువకుడు మంటలతోనే పరుగెత్తుకు వెళ్లి ప్రిన్సిపల్ ను గట్టిగా పట్టుకున్నాడు. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడగా కాలేజీ సిబ్బంది దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు.
01:41 PM (IST) Aug 19
కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వాకలపూడి షుగర్ ఫ్యాక్టరీలో కన్వేయర్ బెల్ట్ పేలిపోవడంతో ముగ్గురు కార్మికులు అక్కడిక్కడే మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
12:33 PM (IST) Aug 19
సిబిఐ దాడులతో ఆందోళన చెందవద్దని ఆమ్ ఆద్మీ నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. మనల్ని ఇబ్బంది పెట్టాలని కేంద్ర ప్రభుత్వ సంస్ధ సిబిఐకి పైనుండి ఒత్తిడిలు వుండివుంటాయని... వారి పని వారు చేసుకోనిద్దమని అన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ విద్యాశాఖమంత్రిగా సిసోడియాకు గుర్తింపు లభించిన రోజే సిబిఐ దాడులు దారుణమని డిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
11:23 AM (IST) Aug 19
ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద పోటెత్తడంతో గోదావరి నది మహోగ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 50 అడుగులను మించగా తాజాగా కాస్త శాంతించి 49.5 అడుగులకు చేరింది. దీంతో గోదావరి పరిసరప్రాంతాల ప్రజల ఆందోళన తగ్గింది. అయినప్పటి రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
10:39 AM (IST) Aug 19
భారత్ లో గత రెండ్రోజులుగా రోజువారి కరోనా కేసులు పదివేల దిగువకు పడిపోగా తాజాగా కేసుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 15,754 కరోనా కేసులు వెలుగుచూసాయి. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 1, 01,830 కు చేరింది.
09:50 AM (IST) Aug 19
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈ మూడురోజులు (శుక్ర, శని, ఆదివారాలు) పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని ఐఎండి ప్రకటించింది. పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఒడిషా రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. తెలుగురాష్ట్రాలపై ఈ అల్పపీడన ప్రభావం అంతగా వుండబోదని వాతావరణ శాఖ ప్రకటించింది.
09:36 AM (IST) Aug 19
దేశ రాజధాని డిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కీలక నాయకుడి ఇంట్లో సిబిఐ సోదాలు జరుపుతోంది. అలాగే మరో పదిచోట్ల కూడా సిబిఐ సోదాలు కొనసాగుతున్నాయి. గతేడాది చివర్లో తీసుకువచ్చిన ఎక్సైజ్ పాలసీ వివాదాస్పదంగా మారిన నేపధ్యంలో రంగంలోకి దిగిన సిబిఐ ఏకంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంట్లోనే సోదాలు చేపట్టింది. అయితే సిబిఐ దాడులను డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు మనీష్ సిసోడియా స్వాగతించారు.