షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది.
షెడ్యూల్డ్ తెగలు (ST), షెడ్యూల్డ్ కులాల (SC) మధ్య ఉప వర్గీకరణకు సంబంధించి భారత సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఎస్సీలు, ఎస్టీలలో ఉప వర్గీకరణ చేసే అధికారాలు రాష్ట్రానికి ఉన్నాయని స్పష్టం చేసింది. EV చిన్నయ్య vs స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విషయంలో 2004లో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 6:1 మెజారిటీతో ఎస్సీ, ఎస్టీలను రాష్ట్రాల వారీగా ఉప-వర్గీకరణ చేయవచ్చని వెల్లడించింది. ఆయా సమూహాల్లోని మరింత వెనుకబడిన కులాలకు కోటా మంజూరు చేయొచ్చని తెలిపింది.
జస్టిస్ బీఆర్ గవాయ్, విక్రమ్ నాథ్, బేల ఎం త్రివేది, పంకజ్ మిథాల్, మనోజ్ మిశ్రా, సతీష్ చంద్ర శర్మల నేతృత్వంలోని ధర్మాసనం ఆరు వేర్వేరు తీర్పులను వెలువరించింది. సామాజిక సమానత్వ సూత్రాలు షెడ్యూల్డ్ కులాల్లో అత్యంత వెనుకబడిన తరగతులకు ప్రాధాన్యతనిచ్చే హక్కును రాష్ట్రానికి కల్పిస్తాయని పేర్కొంది. పంజాబ్ చట్టంలోని సెక్షన్ 4(5) రాజ్యాంగ చెల్లుబాటును సుప్రీంకోర్టు సమీక్షించింది. ఇది షెడ్యూల్డ్ కులాలు లేదా తెగలలో ఉప-వర్గీకరణలు చేయవచ్చా లేదా వారిని సజాతీయ సమూహాలుగా పరిగణించాలా అనే దానిపై ఆధారపడి ఉంటుంది.
సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోని మరింత ప్రయోజనకరమైన వర్గాల పిల్లలు రిజర్వేషన్‌లను పొందడం కొనసాగించాలా అనే ప్రశ్నను సుప్రీంకోర్టు పరిశీలించింది. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల ఉప వర్గీకరణకు అనుకూలంగా ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ధర్మాసనంలోని మెజారిటీ తీర్పు ప్రకారం, ఉప-వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని సమర్థించింది.
సుప్రీం కోర్టు తీర్పుపై టీడీపీ స్పందన ఇదే...
కాగా, సుప్రీం కోర్టు తీర్పుపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ మంత్రి కేఎస్ జవహర్ స్పందించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు.సుప్రీం కోర్టు తీర్పుతో మాదిగల చిరకాల పోరాటానికి ఫలితం దక్కిందన్నారు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో వర్గీకరణ సాధించటం చరిత్రలో నిలిచిపోతుందని కొనయాడారు. ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు ఎప్పుడూ సానుకూలంగానే వ్యవహరించారని తెలిపారు.
సామాజిక న్యాయం పాటించే పేటెంట్ హక్కు టీడీపీదేనని మరోసారి స్పష్టమైందని కేఎస్ జవహర్ అన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టి జగన్ చలికాచుకున్నారని ఈ సందర్భంగా విమర్శించారు. మాదిగలను కేవలం తన ఓటు బ్యాంకుగానే జగన్ చూశారు తప్ప ఏనాడూ వర్గీకరణపై మాట్లాడలేదని గుర్తుచేశారు. వర్గీకరణ కోసం దశాబ్ధాలుగా ఎదురు చూస్తున్న మాదిగలకు సుప్రీం తీర్పు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. దళితులంతా ఐక్యతతో ముందుకు సాగాలని... దళిత జాతి విద్య, వైద్య, ఉద్యోగాలతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. ఎస్సీలంతా అన్నదమ్ముల్లా కలసి ఉన్నాం... భవిష్యత్తులో కూడా కలిసే ఉంటాం. మాదిగలకు రాజ్యాంగ ఫలాలు అందాలని కేఎస్ జవహర్ పేర్కొన్నారు.