ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు. ప్రాంతీయ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికే అవకాశం లేదు. బలహీనమైన ప్రతిపక్ష పార్టీల వల్ల మళ్లీ కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టే అవకాశం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రెండు సార్లు పూర్తి మెజారిటీతో కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీయే వచ్చే సారి కూడా కేంద్రంలో చక్రం తిప్పనుందా ? కాంగ్రెస్ పార్టీ , ఇతర విపక్ష పార్టీల బలహీనతలే ఆ పార్టీని మూడో సారి గద్దెనెక్కించనున్నాయా ? ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను గమనిస్తే పై రెండు ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్నదేశంలో నెలకొన్ని రాజకీయ పరిణామాల వల్ల మళ్లీ బీజేపీయే కేంద్రంలో అధికారం చేపట్టనుందని అంచనాలు వేస్తున్నారు.
ఇంకా కోలుకోని కాంగ్రెస్..
భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు రోజులు పరిస్థితులు అంతగా బాగాలేవు. వరుసగా కేంద్రంలో అధికారం చేపట్టుకుంటూ వచ్చిన ఆ పార్టీకి ఆయా రాష్ట్రాల్లో కూడా మంచి పట్టు ఉండేది. కానీ 2014 తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 2014లో బీజేపీ అధికారం చేపట్టి ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించారు. ఏ పార్టీ సపోర్ట్ లేకుండా సొంతంగా అధికారం చేపట్టేందుకు కావాల్సిన మెజారిటీ స్థానాలను ఆ పార్టీ సాధించింది. తరువాత మిత్ర పక్షాలను కలుపుకొని ఎన్‌డీఏ ప్రభుత్వంగా ఏర్పాటయ్యింది. అప్పటి నుంచి రాష్ట్రాల్లో కూడా బలపడుతూ వచ్చింది. దానికి వ్యతిరేక దిశలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతూ వచ్చింది. ఇదే ఊపులో రెండో సారి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ మళ్లీ తన పట్టను నిలుపుకోలేకపోయింది. ఇప్పటికీ ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉంది. ఇంకా ఆ పార్టీ తన పూర్వ వైభవాన్ని సంపాదించుకోలేదు.
undefined
యూపీఏ ఎక్కడుంది.. మమతా బెనర్జీ వ్యాఖ్యలు
నిన్న మమత మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. మహరాష్ట్రలోని ముంబాయిలో శరాద్ పవర్‌ను మమతాబెనర్జీ కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో వారు మాట్లాడారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏలో భాగస్వామిగా ఉంటారా అని అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితిని వివరిస్తోంది. ‘యూపీఏ నా ? అదెక్కడుంది ?’ అని ఆమె సమాధానం ఇచ్చారు. అలాంటిదేమైనా ఉంటే కదా అందులో భాగస్వామ్యం అయ్యేది అని ఆమె వ్యాఖ్యానించారు
రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి..
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ స్థానాన్ని పూర్తిగా ఆక్రమించింది. కాంగ్రెస్‌పై వ్యతిరేకతతో ఏర్పడిన ఆమ్ ఆద్మీ పార్టీ రెండు సార్లు అక్కడ అధికారం చేపట్టింది. నిజానికి అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి తప్ప మిగితా ఏ పార్టీలకు అక్కడ స్థానం లేదు. ఇటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ కు అదే పరిస్థితి కనిపిస్తోంది. ఏపీలో అయితే టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ పార్టీలే అధికారం కోసం కొట్లాడుతున్నాయి తప్పా.. కాంగ్రెస్ కనీసం పోటీలో కూడా నిలబడలేకపోతోంది. తెలంగాణలో మళ్లీ ఇప్పుడిప్పుడే బలపడేందుకు అడుగులు వేస్తోంది. తమిళనాడు, కేరళ, కర్నాటక ఇలా ఏ దక్షిణాది రాష్ట్రాల్లో చూసినా కాంగ్రెస్ పరిస్థితి బలంగా లేదు.
కాంగ్రెస్‌కు కమ్యూనిష్టుల మద్దతు కరువు..
కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టు పార్టీలు మద్దతు ఇచ్చేలా కనిపించడం లేదు. కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిష్టు పార్టీలు కూడా కొంత దూరంగానే ఉంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారం చేపట్టడం చాలా కష్టతరమనే చెప్పాలి. అయినా ప్రస్తుతం కమ్యూనిష్టు పార్టీల నుంచి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే సంఖ్య కూడా చాలా తక్కువగానే ఉంటుంది. కేరళా, త్రిపుర మినహా ప్రస్తుతం ఆ పార్టీలకు మిగితా రాష్ట్రాల్లో పెద్దగా పట్టులేదు..
ఇలా అన్ని పార్టీలు కాంగ్రెస్ దూరం పెట్టడం, ప్రాంతీయ పార్టీల మధ్య ఐకమత్యం లేకపోవడం బీజేపీకి కలిసివచ్చే అంశం. ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో బీజేపీకి మంచి పట్టు ఉంది. అక్కడ గెలిచే లోక్ సభ స్థానాలే మళ్లీ బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి పెడుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ మంచి స్థానాలను సాధిస్తే 2024లో కేంద్రంలో బీజేపీ గద్దెనెక్కడం దాదాపుగా ఖాయమనే చెప్పవచ్చు.