Rajnath Singh Biography: రాజ్‌నాథ్ సింగ్ .. బీజేపీ అగ్రనేతలలో ఒకరు. ఒక సామాన్య కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తరువాతి కాలం లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా..బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. రాజ్ నాథ్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ జీవితాన్ని తెలుసుకునే చిన్న ప్రయత్నం.
Rajnath Singh Biography: రాజ్ నాథ్ సింగ్.. జూలై 10, 1951న ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాలోని చకియా అనే గ్రామంలో రామ్ బదన్ సింగ్ , గుజరాతీ దేవి దంపతులకు జన్మించాడు. ఆయన చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుకు. అలాగే.. సమాజంలో నలుగురులో కలుపుగొలుగా ఉండటమంటే.. మక్కువ. ఇలా ఆయన 13 సంవత్సరాల వయస్సులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) లో చేరాడు. సంఘ్ సిద్ధాంతాలను పూర్తిగా వంటపట్టించుకున్నారు.
వ్యక్తిగత జీవితం
మరోవైపు.. చదువులో రాణించే రాజ్‌నాథ్ సింగ్ గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి భౌతికశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఇదిలా ఉంటే.. ఆయనకు తన 20 ఏళ్ల ప్రాయంలోనే ( జూన్ 5, 1971) సావిత్రి సింగ్‌తో జరిగింది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన కుమారుడు పంకజ్ సింగ్ నోయిడా నుండి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే (నోయిడా ఎమ్మెల్యే).
రాజకీయ జీవితం
>> ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర హోం శాఖ మంత్రిగా పని చేస్తున్న రాజ్‌నాథ్ సింగ్ తన జీవితాన్ని ఓ ఉపాధ్యాయుడిగా ప్రారంభించారు. కానీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్దాంతాల పట్ల అతిమంగా ఆకర్షితుడయినా ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అలాగే.. క్రమంగా జనతా పార్టీలో చేరారు. ఆ తరువాత మీర్జాపూర్ విభాగానికి కార్యదర్శిగా నియమితులయ్యారు. ఏడాది కాలంలోనే జనసంఘ్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
>> జయప్రకాష్ నారాయణ్ భావాలకు ప్రభావితమైన రాజ్ నాధ్ సింగ్ అనతికాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1977 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మీర్జాపూర్ స్థానం నుంచి జేఎన్‌పీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి అజహర్ ఇమాంను ఓడించారు. ఇలా తొలిసారి యూపీ అసెంబ్లీలో కాలుమోపారు. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పోరాటం చేసి.. జైలు పాలయ్యారు. 1978లో విడుదలైన తర్వాత మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
బీజేపీతో అనుబంధం
>> 1980 లో రాజ్ నాథ్ సింగ్ భారతీయ జనతా పార్టీ ( బిజెపి)లో చేరాడు. ఆ పార్టీ ప్రారంభ సభ్యులలో ఆయన ఒకరు. 1984లో బీజేపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా, 1988లో జాతీయ అధ్యక్షుడిగా కొనసాగారు. ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు కూడా ఎన్నికయ్యారు.
ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ మంత్రి
>> 1991లో ఉత్తరప్రదేశ్‌లోని మొదటి బీజేపీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఆయన రెండు సంవత్సరాల పాటు పనిచేశారు. 1992 నాటి కాపీయింగ్ నిరోధక చట్టాన్ని ప్రవేశపెట్టాడు. తద్వారా కాపీ చేయడం నాన్ బెయిలబుల్ నేరంగా మారింది. అయితే ములాయం సింగ్ యాదవ్ అధికారంలోకి వచ్చాక ఈ చట్టం రద్దు చేయబడింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి
>> 1994లో రాజనాథ్ సింగ్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. సలహా కమిటీ, హౌస్ కమిటీ, మానవ వనరుల అభివృద్ధి కమిటీలో పాలుపంచుకున్నారు. 1997లో ఆయన మరోసారి ఉత్తరప్రదేశ్‌లో BJP రాష్ట్ర అధ్యక్షుడిగా, 1999లో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఆయన నియమితులయ్యారు.ఈ తరుణంలోనే ఆయన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కలల ప్రాజెక్ట్ అయిన NHDPని ప్రారంభించాడు.
యూపీ ముఖ్యమంత్రిగా..
>> ఉత్తరప్రదేశ్ లో 2000లో పలు రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో సుదీర్ఘమైన, మచ్చలేని రాజకీయ జీవితం గల రాజ్ నాథ్ సింగ్ కు బీజేపీ అధిష్టానం యూపీ ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టింది. తన పదవీ కాలంలో ఆయన ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ నిర్మాణాన్ని హేతుబద్ధీకరించడం, రాష్ట్రంలో శాంతిభద్రతలను స్థిరీకరించడం, ఢిల్లీ నుండి నోయిడాను కలిపే DND ఫ్లైవేని ప్రారంభించడంపై దృష్టి సారించాడు.
>> 2002లో రాష్ట్ర రాజకీయాల్లో ఆ సమయంలో బీజేపీకి మైనారిటీ హోదా ఉండడంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబడింది. మాయావతి మూడవసారి రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి అయ్యారు.
కేంద్ర వ్యవసాయ మంత్రి
>> 2003లో వాజ్‌పేయి నేతృత్వంలోని NDA ప్రభుత్వంలో వ్యవసాయం, ఆహార శుద్ధి శాఖ మంత్రిగా నియమితులయ్యారు. తన పదవీ కాలంలో ఆయన ఎన్నో సంస్కరణలు చేశారు. ఈ క్రమంలోనే కిసాన్ కాల్ సెంటర్, ఫార్మ్ ఇన్‌కమ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌తో సహా కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించాడు. వ్యవసాయ రుణాలపై వడ్డీ రేట్లను కూడా తగ్గించాడు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు
>> 2005లో రాజ్ నాథ్ సింగ్ బిజెపి జాతీయ అధ్యక్షుడయ్యాడు. హిందూత్వ సిద్ధాంతాలపై పార్టీని బలోపేతం చేయడానికి అవిశ్రాంతంగా పనిచేశాడు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఎలాంటి రాజీ పడబోమని కూడా ఆయన ప్రకటించారు. వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలను కూడా ఆయన ప్రస్తావించారు. స్థానిక భాషలకు విపరీతమైన ప్రాధాన్యతల కారణంగా భారతదేశంలో ఆంగ్ల భాష పాత్రను ఆయన విమర్శించారు.
>> జిన్నాను పొగిడి, భారత మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను అగౌరవపరిచిన జస్వంత్ సింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో NDA ఓడిపోవడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. అదే ఏడాది ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
>> 24 జనవరి 2013న, అవినీతి ఆరోపణలపై నితిన్ గడ్కరీ రాజీనామా చేయడంతో, రాజ్‌నాథ్ సింగ్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు. ఆయన 2014 సార్వత్రిక ఎన్నికలకు ప్రచారం చేసాడు . పార్టీ నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నప్పటికీ నరేంద్ర మోడీని బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించాడు.
కేంద్ర హోం మంత్రి
>> 2014 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఘనవిజయం సాధించిన తర్వాత, రాజ్‌నాథ్ సింగ్ హోంమంత్రి పదవిని చేపట్టేందుకు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 26 మే 2014న కేంద్ర మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు.
>> 9 ఏప్రిల్ 2017న, ఆయన బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌తో కలిసి భారత్ కే వీర్ వెబ్ పోర్టల్ , అప్లికేషన్‌ను ప్రారంభించాడు. ఇది అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, GOI ద్వారా నిధుల సేకరణ కార్యక్రమం.
>> 21 మే 2018న, ఆయన బస్తారియా బెటాలియన్‌ను నియమించాడు. 21 మే 2018న ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో CRPF యొక్క 241 బస్తారియా బెటాలియన్ పాసింగ్ అవుట్ పరేడ్‌కు హాజరయ్యారు.
కేంద్ర రక్షణ మంత్రి
>> 31 మే 2019న రాజ్ నాథ్ సింగ్ కేంద్ర రక్షణ మంత్రిగా నియమితులయ్యారు. రక్షణ మంత్రి అయిన తర్వాత ప్రధానంగా దేశ రక్షణ బడ్జెట్‌ను పెంచడం, ఇతర దేశాల నుండి ఆయుధాల దిగుమతులను తగ్గించడం , భారతదేశాన్ని ఆయుధాల పరిశ్రమతో ఆయుధాల ఎగుమతిదారుగా మార్చడంపై దృష్టి సారించాడు.
>> భారత వైమానిక దళాన్ని బలోపేతం చేసేందుకు 2016లో అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ రాఫెల్ ఒప్పందంపై సంతకం చేశారు. ఆయన భారత రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో ఈ యుద్ధ విమానాలు భారత అమ్ముల పొదిలో చేరాయి.
>> మే 2020లో భారత్- చైనా మధ్య సరిహద్దు ప్రతిష్టంభన ఏర్పడిన క్రమంలో శత్రుదేశ అధికారులతో ఆయననే స్వయంగా సమావేశమయ్యారు. ఈ తరుణంలో లడఖ్ రేంజ్‌ను కూడా సందర్శించారు. ఇట్టి పరిస్థితిని చర్చించడానికి సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్, సిఎన్ఎస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ , సిఓఎఎస్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణేతో కూడా సమావేశాలు నిర్వహించారు.