New Criminal Law Bills: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఇటీవల ఆమోదించిన మూడు సవరించిన క్రిమినల్ లా బిల్లులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం (డిసెంబర్ 25) ఆమోదించారు. దీంతో ఇండియన్ జస్టిస్ కోడ్, ఇండియన్ సివిల్ డిఫెన్స్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ బిల్లు చట్టంగా మారేందుకు మార్గం సుగమమైంది.
New Criminal Law Bills: పార్లమెంటు శీతకాల సమావేశాల్లో ఇటీవల ఆమోదించిన మూడు సవరించిన క్రిమినల్ చట్టాల బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆమోదం లభించింది. సోమవారం (డిసెంబర్ 25) ద్రౌపది ముర్ము కొత్త క్రిమినల్ లా బిల్లులను ఆమోదం తెలిపారు. ఈ బిల్లులకు గత వారం పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీంతో ఇండియన్ జ్యుడీషియల్ కోడ్, ఇండియన్ సివిల్ డిఫెన్స్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ బిల్లులు చట్టాలుగా మారాయి.
బ్రిటిష్ వలస పాలన కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ (IPC)ని భారతీయ న్యాయ సంహిత (Bharatiya Nyaya Sanhita), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC)ని భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (Nagarik Suraksha Sanhita), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్యా అధినీయం (Bharatiya Sakshya Adhiniyam) ద్వారా కొత్త చట్టాలను ప్రవేశపెడుతున్నారు. ఈ బిల్లులను పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో డిసెంబర్ 20న లోక్‌సభ, డిసెంబర్ 21న రాజ్యసభ ఆమోదించాయి. పార్లమెంట్‌లో మూడు బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ బిల్లులను రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదం లభించింది.
పార్లమెంట్‌లో మూడు బిల్లులపై జరిగిన చర్చపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ.. శిక్షకు బదులు న్యాయం చేయడంపైనే దృష్టి సారించామని చెప్పారు. మూడు బిల్లుల ముసాయిదా విస్తృతమైన చర్చల తర్వాత తయారు చేయబడిందని, ఆమోదం కోసం సభకు తీసుకురావడానికి ముందు ముసాయిదా బిల్లు యొక్క ప్రతి కామా, ఫుల్‌స్టాప్‌ను తాను అధ్యయనం చేశానని షా చెప్పారు. ఇండియన్ జ్యుడీషియల్ కోడ్‌లోని కొత్త రాజద్రోహ చట్టం వేర్పాటు, సాయుధ తిరుగుబాటు, విధ్వంసక కార్యకలాపాలు, వేర్పాటువాద కార్యకలాపాలు, భారతదేశ సార్వభౌమాధికారం లేదా సమగ్రతను బెదిరించడం వంటి నేరాలు చేర్చాబడ్డాయని తెలిపారు.
ఇవి వలసరాజ్యాల కాలం నాటి క్రిమినల్ చట్టాల నుండి నిష్క్రమణ అని, ఇది శిక్ష, నిరోధం నుండి న్యాయం, సంస్కరణల వైపు దృష్టిని మారుస్తుందని హోం మంత్రి షా ఉద్ఘాటించారు. నేర న్యాయ వ్యవస్థలో పౌరులు కేంద్రంగా ఉంటారని ఆయన నొక్కి చెప్పారు. నేర న్యాయ ప్రక్రియలో పూర్తిగా భారతీయతతో కూడిన కొత్త ప్రారంభం ఉంటుందని ఆయన అన్నారు. ఈ చట్టాలు అమలుతో బ్రిటీష్ వలస పాలన శకం ముగుస్తుందని చెప్పారు.
'వలస వారసత్వపు సంకెళ్లకు విముక్తి'
రాజ్యసభ ఛైర్మన్, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఈ బిల్లులపై మాట్లాడుతూ..“ఈ మూడు బిల్లులు (భారతీయ సాక్ష్య సంహిత 2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023, భారతీయ న్యాయ సంహిత 2023 బిల్లులు) చరిత్ర సృష్టించే బిల్లులు. చట్ట సభల్లో ఏకగ్రీవంగా ఆమోదించబడ్డాయి. దేశ పౌరులకు హాని కలిగించే, విదేశీ పాలకులకు అనుకూలంగా ఉండే మన నేర న్యాయశాస్త్రం యొక్క వలస వారసత్వపు సంకెళ్ళకు విముక్తి లభించింది." అని పేర్కొన్నారు.
సవరణ చట్టాల స్వరూపం ఇలా..
భారతీయ న్యాయ సంహిత (Bharatiya Nyaya Sanhita)లో 358 సెక్షన్లు ఉంటాయి. ఇండియన్ పినల్ కోడ్(IPC)లో ఉండే 511 సెక్షన్ లు ఉండేవి. సవరించిన ఈ చట్టంలో మొత్తం 20 వరకూ అదనంగా నేరాలను చేర్చారు. వాటిలో 33 సెక్షన్లకు జైలు శిక్షను పెంచారు. 83 నేరాలకు భారీ మొత్తంలో జరిమానా విధించే విధంగా మార్చారు. ఆరు నేరాలకు ఇక కమ్యూనిటీ సర్వీస్ పనిష్మెంట్ ఉంది.
భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (Nagarik Suraksha Sanhita)లో 531 సెక్షన్లు ఉంటాయి. క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ (CrPC) లోని 484 సెక్షన్లు ఉండేవి. చట్టాన్ని మొత్తం 177 సెక్షన్లలో మార్పులు చేసి 9 సెక్షన్లు అదనంగా చేర్చారు. 39 సబ్ సెక్షన్లు, 44 నూతన ప్రొవిజన్లు యాడ్ చేశారు. చట్టంలో అవసరం లేని మొత్తం 14 సెక్షన్‌లు తొలగించారు.
భారతీయ సాక్ష్యా అధినియం (Bharatiya Sakshya Adhiniyam) 170 ప్రొవిషన్స్ ఉంటాయి. పాతచట్టం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో 167 ప్రొవిషన్స్ ఉండేవి. మొత్తం 24 సెక్షన్లు సవరించారు. చట్టంలో రెండు కొత్త ప్రొవిషన్స్, ఆరు సబ్ ప్రొవిషన్స్ ప్రవేశపెట్టారు. 6 ప్రొవిషన్స్ ను తొలగించారు.