INDIA Bloc: ప్రధాని అభ్యర్థిగా రాహుల్ వద్దు, ఖర్గే ముద్దు!.. విపక్ష కూటమిలో కొత్త స్వరం.. అందుకేనా?

ఇండియా కూటమి సభ్యులు ఈ రోజు ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో సీట్లు సర్దుబాటు వంటి అంశాలతోపాటు ప్రధాని అభ్యర్థి ఎవరనే చర్చ కూడా జరిగింది. విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గేను ఎంచుకోవాలని మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ కోరినట్టు వార్తలు వచ్చాయి. రాహుల్ కంటే మల్లికార్జున్ బెటర్ అనే అభిప్రాయాలు వారి నుంచి వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తున్నది.
 


హైదరాబాద్: ఇండియా కూటమి(Indian National Developmental Inclusive Alliance- INDIA) ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో సమావేశమైంది. పాట్నా, బెంగళూరు, ముంబయి నగరాల్లో సమావేశాల తర్వాత ఇది నాలుగో భేటీ. ఈ సభలో సీట్ల సర్దుబాటుపై, ప్రధాని అభ్యర్థిపై, పార్లమెంటులో విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటుకు సంబంధించి కూడా చర్చ చేసినట్టు తెలిసింది. ఈ సమావేశంలో మరో కీలక పరిణామం కూడా చోటుచేసుకుంది. ఈ సమావేశంలో విపక్ష కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్షుడు, దళిత నేత మల్లికార్జున్ ఖర్గే ఉండాలని టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల సీఎం మమతా బెనర్జీ, ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లు ప్రతిపాదించారు. అయితే.. ఈ ప్రతిపాదనను ఖర్గే సున్నితంగా తిరస్కరించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఇండియా కూటమిపై నిన్నా మొన్నటి వరకు ప్రతికూల వార్తలు వచ్చాయి. ఆ కూటమికి బీటలు వారాయని, సీట్ల సర్దుబాటు కుదరదని, ప్రధాని అభ్యర్థిపై కయ్యం తప్పదనే వదంతలు వచ్చాయి. మమతా బెనర్జీనే ప్రధాని అభ్యర్థిగా పెట్టుకోవాలనీ ఆమె పార్టీ నుంచి డిమాండ్లు వచ్చాయి. కానీ, అనూహ్యంగా నేటి సమావేశంలో ఖర్గే పేరు ముందుకు వచ్చింది. కానీ, ఖర్గే.. గాంధీ కుటుంబ విధేయుడు. గాంధీ కుటుంబ ఆమోదం లేనిదీ ఈ బాధ్యతలు తీసుకునే అవకాశాలు చాలా స్వల్పం. తనకు ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగాలనే ఆశల్లేవని, ముందుగా కూటమి గెలువాలని కోరుకుంటున్నానని ఖర్గే తన అభిప్రాయాన్ని తెలిపినట్టు సమాచారం.

Latest Videos

Also Read : Lok Sabha: దక్షిణాది పై జాతీయ నాయకుల చూపు ?.. వ్యూహం అదేనా?

రాహుల్ గాంధీపై ఇతర విపక్ష నేతల్లో సానుకూలమైన అభిప్రాయాలు లేవని తెలుస్తున్నది. రాహుల్ గాంధీ సారథ్యంలో పోటీ చేస్తే విపక్ష కూటమికి సత్ఫలితాలు రావనే అభిప్రాయాల్లో ఉన్నాయి. 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో బరిలోకి దిగి దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. 

నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ బరిలోకి దిగనుంది. నరేంద్ర మోడీని రాహుల్ గాంధీ సమర్థంగా ఢీకొనడం లేదని, మోడీని సరైన విధంలో ఎదుర్కోలేకపోతున్నాడనే అభిప్రాయాలు ఉన్నాయి. రాహుల్ గాంధీపై కుటుంబ పాలన అని, పప్పు అని, అనేక ఇతర విధాల్లో బీజేపీ ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నది. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ సారథ్యంలో దిగితే ఇలాంటి విమర్శలు తప్పవు. అదే మల్లికార్జున్ ఖర్గే సారథ్యంలో బరిలోకి దిగితే చాలా సానుకూలతలు ఉన్నాయి. దళిత నేత కావడం, కుటుంబ రాజకీయాలకు వారసుడు కాకపోవడం, అపార అనుభవం, అన్ని పార్టీలతో సఖ్యంగా మెలిగే స్వభావం ఆయనకు ఉన్నది. ఈ నేపథ్యం లోనే విపక్ష కూటమిలోని పార్టీలు ఆయనను బలపరుస్తున్నాయి. ఒక వేళ ఖర్గే విపక్ష కూటమికి సారథ్యం వహిస్తే.. 2024 లోక్ సభ ఎన్నికల పోటీ తీరును కచ్చితంగా ప్రభావితం చేస్తుందని మాత్రం చెప్పవచ్చు. తదుపరి సమావేశం వరకు దీనిపై నిర్ణయం ఎటు మొగ్గుతుందో చూడాలి మరి.

click me!