దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది, మొత్తం ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలకు ఈసిఐ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ను పరిశీలిస్తే ఓ ఆసక్తికర విషయం బయటపడింది.
న్యూడిల్లీ : దేశవ్యాప్తంగా ఎన్నికల జాతరకు రంగం సిద్దమయ్యింది. లోక్ సభ నియోజకవర్గాలతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కూడా భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణ అసాధ్యం కాబట్టి ఏడు విడతల్లో ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఈసిఐ ప్రకటించింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాల్లో ఒకే ఫేజ్ లో ఎన్నికలు జరిగితే కొన్నిరాష్ట్రాల్లో మాత్రం ఏడు ఫేజుల్లోనూ ఎన్నికలు జరగనున్నారు. అంటే దాదాపు రెండు నెలల పాటు ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇలా సుధీర్ఘకాలం లోక్ సభ ఎన్నికలు జరిగే ఆ రాష్ట్రాలేవో చూద్దాం.
దేశంలో అత్యధిక అసెంబ్లీ, లోక్ సభ స్థానాలున్న రాష్ట్ర ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఏప్రిల్ 29న లోక్ సభ ఎన్నికల సందడి ప్రారంభమై జూన్ 01 వరకు కొనసాగనుండి. అంటే ఏడింటికి ఏడు దశల్లో ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయన్న మాట. మొత్తం 80 ఎంపీ స్థానాలున్న యూపీలో ఏప్రిల్ 19న 08, ఏప్రిల్ 26న 08, మే 07న 10, మే 13న 13, మే 20న 14, మే 25న 14, జూన్ 01న 13 స్థానాలకు పోలింగ్ జరగనుంది.
ఇక ఉత్తరప్రదేశ్ మాదిరిగానే పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాల్లోనూ ఇలాగే ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్ లో మొత్తం 42 ఎంపీ స్థానాలుంటే మొదటి ఫేజ్ లో 3, రెడో ఫేజ్ లో 3, మూడో ఫేజ్ లో 4, నాలుగో ఫేజ్ లో 8, ఐదో ఫేజ్ లో 7, ఆరో ఫేజ్ లో 8, ఏడో ఫేజ్ లో 9 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. అలాగే బిహార్ లో 40 లోక్ సభ సీట్లకు ఏడు దశల్లో (4,5,5,5,5,8,8) ఎన్నికలు జరుగుతున్నాయి.
అయితే అత్యధిక రాష్ట్రాల్లో కేవలం ఒకే ఫేజ్ లో ఎన్నికలు ముగియనున్నాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి మొత్తం 32 వుంటే అందులో 22 చోట్ల ఒకే ఫేజ్ లో ఎన్నికలు ముగుస్తున్నారు. ఇక 4 చోట్ల 4 , 2 చోట్ల 3, 3 చోట్ల 4, 2 చోట్ల 5 ఫేజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.