బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న .. ‘‘జన నాయక్’’గా చెరగని ముద్ర

By Siva Kodati  |  First Published Jan 23, 2024, 10:29 PM IST

బీహార్ మాజీ సీఎం , దివంగత కర్పూరి ఠాకూర్‌కు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. జీవితాంతం పేద ప్రజల పక్షాన నిలిచారు. వారి అభ్యున్నతి, సామాజిక మార్పు కోసం పనిచేశారు. బీహార్‌కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించి ‘‘జన నాయక్’’గా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.


బీహార్ మాజీ సీఎం , దివంగత కర్పూరి ఠాకూర్‌కు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఆయన శతజయంతి సందర్భంగా ఈ ప్రకటన రావడం గమనార్హం. 1924 జనవరి 24న బీహార్‌లోని సమస్తీపూర్ జిల్లాలోని కర్పూరిగ్రామ్‌లో జన్మించిన ఠాకూర్.. జీవితాంతం పేద ప్రజల పక్షాన నిలిచారు. వారి అభ్యున్నతి, సామాజిక మార్పు కోసం పనిచేశారు. బీహార్‌కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించి ‘‘జన నాయక్’’గా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.

విద్యార్ధి దశలోనే భారత స్వాతంత్య్ర సంగ్రామంలో దిగారు. క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని 26 నెలల పాటు జైలు జీవితం గడిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సొంత వూరిలోనే ఉపాధ్యాయుడిగా సేవలందించారు. ఈ క్రమంలో తేజ్‌పూర్ నుంచి సోషలిస్ట్ పార్టీ అభ్యర్ధిగా విజయం సాధించి బీహార్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1960లో పీ అండ్ టీ ఉద్యోగుల పోరాటానికి నాయకత్వం వహించినందుకు ఆయనను ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అనంతరం 1970లలో టెల్కో కార్మికుల డిమాండ్ల సాధన కోసం 28 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. 

Latest Videos

బీహార్‌లో మెట్రిక్యులేషన్‌లో ఆంగ్లాన్ని తప్పనిసరి సబ్జెక్ట్ జాబితా నుంచి తొలగించారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయడంతో పాటు వెనుకబడిన ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలు నిర్మించేందుకు తోడ్పాటును అందించారు. తొలినాళ్లలో గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసిన కర్పూరి ఠాకూర్.. అనంతరం రామ్ మనోహర్ లోహియా సామ్యవాదం, అంబేద్కర్ కుల నిర్మూలనల పట్ల ఆకర్షితులయ్యారు. అంతేకాదు.. లోహియా స్థాపించిన సంయుక్త సోషలిస్ట్ పార్టీకి అధ్యక్షుడిగానూ పనిచేశారు. 

దేశంలోని భూస్వాములు, ప్రభుత్వ ఆధీనంలోని భూముల్ని పేదలకు పంచడం ద్వారా సామాజిక, ఆర్ధిక సమానత్వం సిద్ధిస్తుందని కర్పూరి ఠాకూర్ విశ్వసించారు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్‌కు సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఠాకూర్ తదనంతర కాలంలో జనతా పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. రాజకీయాల్లో బీసీ నేతలను ప్రోత్సహించారు. లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ , రాం విలాస్ పాశ్వాన్ వంటి నేతలకు మార్గదర్శిగా నిలిచారు. 1978లో రిజర్వేషన్ పాలసీని తీసుకురాగా.. దీనినే కర్పూరీ ఠాకూర్ ఫార్ములాగా పిలుస్తారు. దళితులు, బీసీలు, ముస్లిం ఇతర మైనారిటీ వర్గాల కోసం అవిశ్రాంతంగా పనిచేసిన కర్పూరీ ఠాకూర్ 1988 ఫిబ్రవరి 17న తుదిశ్వాస విడిచారు. 

click me!