AP Elections 2024: అసెంబ్లీ ఎన్నికల వేళ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడికి రాష్ట్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. అసలేం జరిగింది? రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎందుకు నోటీసులు జారీ చేసింది.
AP Elections 2024: అసెంబ్లీ ఎన్నికల వేళ టీడీపీ నేతలు అచ్చెన్నాయడు, అయ్యన్నపాత్రుడికి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్ పై ఇరువురు నేతలు ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా తప్పుడు ఆరోపణలు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో కోడ్ ఉల్లంఘనపై వివరణ కోరుతూ అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడికి సీఈఓ ముఖేష్‌కుమార్ మీనా నోటీసులు ఇచ్చారు.
కాగా, టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మార్చి 31న ఎమ్మిగనూరు సభలో చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారనీ, అందుకు తగు వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని చంద్రబాబుకి ఈసీ నోటీసులు ఇచ్చింది. 48 గంటల్లోగా అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలని ఈసీ పేర్కొంది.
ఇంతకీ ఎన్నికల నియమావళి అంటే..? ఏ నియామాలను పాటించకపోతే ఎందుకు నోటీసులిస్తుంది?
ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఓటర్లకు ఎన్నికల సంఘం నియమాలు, నిబంధనలను రూపొందిస్తుంది.
ఈ క్రింది నియమావళిని రాజకీయ పార్టీలు, నేతలు తప్పకుండా పాటించాలి.
- కులాలు , వర్గాల మధ్య విభేదాలు లేదా ద్వేషాలను ప్రోత్సహించే కార్యకలాపాలలో పాల్గొనవద్దు.
- ప్రభుత్వ విధానాలు, చర్యలను విమర్శించడం, ఏ పార్టీ, నాయకుడు లేదా కార్యకర్త వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యానించవద్దు.
- ఏ కులం లేదా వర్గాల మనోభావాలను దెబ్బతీయడం..
- దేవాలయం, మసీదు లేదా మరే ఇతర ప్రార్థనా స్థలాల్లో ఎన్నికల ప్రచారం చేయరాదు.
- ఓటర్లకు లంచం ఇవ్వడం, వారిని బెదిరించడం వంటి అనైతిక చర్యలకు పాల్పడరాదు.
- పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ప్రచారం చేయడం నేరపూరిత చర్యగా పరిగణించబడుతుంది.
- ఓటింగ్‌కు 48 గంటల ముందు ఎన్నికల ప్రచారం, బహిరంగ సభలపై నిషేధం అమల్లోకి వస్తుంది.
- ఒక రాజకీయ పార్టీ లేదా ఏ అభ్యర్థి ఇంటి ముందు నిరసనలు, ధర్నాలు చేయరాదు.
- అనుమతులు లేకుండా ఏ వ్యక్తి భూమి, భవనం, ప్రాంగణం, గోడలు మొదలైన వాటిపై జెండాలు, బ్యానర్లు వేలాడదీయడం, పోస్టర్లు అతికించడం, నినాదాలు రాయడం వంటివి చేయరాదు.
- రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ మద్దతుదారులు ఇతర పార్టీల సమావేశాలు లేదా ఊరేగింపులలో అడ్డంకులు సృష్టించకుండా, వాటికి అంతరాయం కలిగించడానికి ప్రయత్నించకుండా చూసుకోవాలి.
- ఇతర పార్టీల సమావేశాలు జరుగుతున్న ప్రాంతాల దగ్గర ఏ పార్టీ కూడా ఊరేగింపు చేపట్టకూడదు. ఒక పార్టీ వేసిన పోస్టర్లను మరో పార్టీ కార్యకర్తలు తొలగించకూడదు.
సమావేశం/ర్యాలీ సమయంలో ..
- అన్ని ర్యాలీలు జరిగే సమయం, ప్రదేశం గురించి పోలీసు అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి.
- రాజకీయ పార్టీలు, నేతలు తాము సభ నిర్వహించే స్థలంలో ఇప్పటికే ఎలాంటి ఆంక్షలు లేవని ముందుగానే నిర్ధారించుకోవాలి.
- మీటింగ్‌లో లౌడ్‌స్పీకర్ వినియోగానికి కూడా ముందస్తుగా అనుమతి తీసుకోవాలి.
- అనుకోని సంఘటనలు జరగకుండా సభ నిర్వాహకులు పోలీసుల సహాయం తీసుకోవాలి.