2024 కేంద్ర బడ్జెట్‌పై విమర్శల నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. జీవిత, వైద్య బీమా ప్రీమియంపై జీఎస్టీ ఉపసంహరించాలంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. బీమా సర్వీసులపై 18 శాతం జీఎస్టీ భారంగా మారిందని గడ్కరీ పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్ - 2024పై పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. జీవిత, వైద్య బీమా పథకాల ప్రీమియంలపై విధించిన జీఎస్టీని ఉపసంహరించుకోవాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ఇన్స్యూరెన్స్ సర్వీసులపై 18 శాతం వస్తు సేవల పన్ను విధించడం భారంగా మారిందని తెలిపారు.
నాగ్ పూర్ డివిజనల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ విజ్ఞాపన మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు గడ్కరీ లేఖలో పేర్కొన్నారు. యూనియన్ లేవనెత్తిన ప్రధాన సమస్య 'లైఫ్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం'పై జీఎస్టీ ఉపసంహరణకు సంబంధించింది. లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీ ఉంది. జీవిత బీమా ప్రీమియంపై జీఎస్టీ విధించడం జీవితంలోని అనిశ్చిత పరిస్థితులపై పన్ను విధించడమే' అని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి లేఖలో పేర్కొన్నారు.
undefined
‘కుటుంబానికి కొంత రక్షణ కల్పించేందుకు బీమా కవరేజ్ తీసుకొనే వ్యక్తిపై భారం పడకుండా ఉండాలంటే బీమా ప్రీమియంలపై పన్ను విధించకూడదని యూనియన్ భావిస్తోంది. అదేవిధంగా, వైద్య బీమా ప్రీమియంపై 18% జీఎస్టీ విధించడం అంటే సామాజికంగా అవసరమైన ఈ విభాగం వ్యాపార వృద్ధికి నిరోధకం.’ అని గడ్కరీ లేఖలో రాశారు.
కాగా, నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వం గత వారం సమర్పించిన మొదటి బడ్జెట్‌పై అనేక వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి గడ్కరీ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఎన్డీయేకి కీలక మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ పాలిస్తున్న రాష్ట్రాల పట్ల మాత్రమే కేంద్రం ఉదారంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వేతన జీవులపై అధిక పన్నులు విధించారని సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రతిపక్షాల విమర్శలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొట్టిపారేశారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు నిధులు మంజూరు చేసిందని తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రం పేరు ప్రస్తావించనంత మాత్రాన ఆ రాష్ట్రానికి నిధులు కేటాయించలేదని భావించకూడదన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం ‘వికసిత్ భారత్’ దీర్ఘకాలిక లక్ష్యం మేరకు బడ్జెట్ ప్రాధాన్యతలు ఇచ్చామని భారతీయ జనతా పార్టీ తెలిపింది.