వాతావరణ మార్పులు యువత మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆస్ట్రేలియాలో యువతలో ఆత్మహత్య ఆలోచనలకు, వేడి వాతావరణానికి మధ్య సంబంధం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. COP29 సమావేశంలో ఈ ప్రభావంపై చర్చ జరిగింది.
వాతావరణ మార్పులు దారుణమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పర్యావరణం, జీవుల మనుగడను ప్రభావితం చేస్తున్న క్లైమేట్ చేంజెస్.. మనుషుల మనసులో చెడు బీజాలు వేస్తోందట. ముఖ్యంగా యువతలో ఆత్మహత్య ఆలోచనలకు ఆజ్యం పోస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచ వాతావరణ మార్పులపై చర్చించడానికి అజర్బైజాన్‌లోని సీఓపీ 29లో ప్రపంచ నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వాతావరణ మార్పులకి సంబంధించి తాజా అధ్యయనాలపై చర్చ జరిగింది. ప్రధానంగా యువత మానసిక ఆరోగ్యంపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని పరిష్కరించాల్సిన తక్షణ అవసరాన్ని ఈ సమావేశం ఎత్తిచూపింది.
undefined
సిడ్నిలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ సైకియాట్రిస్టులు నిర్వహించిన అధ్యయనంలో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెల్లడయ్యాయి. ఆస్ట్రేలియాలోని యువతలో ఆత్మహత్య ఆలోచనలకు, వేడి వాతావరణానికి మధ్య సంబంధం ఉందని వెల్లడైంది.
వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా యువత మానసిక ఆరోగ్యం క్షీణిస్తోందని తేలింది. భూగోళం భవిష్యత్తు గురించి చాలా మంది యువకులు ఆందోళన చెందుతుండగా... వాతావరణ మార్పుల ప్రభావాలు ఇప్పటికే వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని పరిశోధనలో తెలిసింది.
ఈ అధ్యయనం న్యూ సౌత్ వేల్స్‌లో 12-24 సంవత్సరాల వయస్సు గల యువతీయువకుల ఆత్మహత్య ఆలోచనలు, ప్రవర్తనలను తెలుసుకునేందుకు అత్యవసర విభాగం సందర్శనలపై దృష్టి సారించింది. 2012 నుంచి 2019 వరకు నవంబర్ నుంచి మార్చి వరకు ఉండే వేడి నెలలకి సంబంధించిన డేటా పరిశీలించగా.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఈ అత్యవసర సందర్శనల మధ్య బలమైన సంబంధాన్ని చూపించింది.
రోజువారీ సగటు ఉష్ణోగ్రతలో ప్రతి 1°C పెరుగుదలకు ఆత్మహత్య ఆలోచనల్లో 1.3 శాతం పెరుగుదల ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఉదాహరణకు, సగటు ఉష్ణోగ్రత 21.9 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న రోజులతో పోలిస్తే 30 డిగ్రీల సెంటీగ్రేడ్ సగటు ఉష్ణోగ్రత ఉన్న రోజులలో ఎమర్జెన్సీ విభాగం సందర్శనలు 11 శాతం ఎక్కువగా ఉన్నాయి. విపరీతమైన ఉష్ణోగ్రతలు కాకుండా తేలికపాటి వేడి ఉన్న రోజుల్లో కూడా ఆత్మహత్య ఆలోచనల ప్రమాదం పెరిగింది. ఆసక్తికరంగా, వడగాలులు (మూడు లేదా అంతకంటే ఎక్కువ వరుస వేడి రోజులు) ఒక రోజు కంటే ఎక్కువ ప్రమాదాన్ని పెంచలేదని అధ్యయనంలో తేలింది. వేడి రోజు యువకుల మానసిక ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుందని ఇది సూచిస్తుంది.
ఆస్ట్రేలియాలోని వెనుకబడిన ప్రాంతాల్లోని యువకులు వేడి వాతావరణంలో మానసిక ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని అధ్యయనం వెల్లడించింది. సామాజిక ఆర్థిక ప్రతికూలత మాత్రమే ఆత్మహత్య ఆలోచనలను పెంచడం లేదట, దానికి వేడి వాతావరణం తోడవడంతో ప్రభావం ఎక్కువగా ఉంటోందట.
ఈ నేపథ్యంలో యువత మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు వాతావరణ మార్పులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కాప్ 29లో నిపుణులు పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియా లాంటి దేశాలు శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తే, వాతావరణ మార్పుల వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించడంతో పాటు యువత ఆత్మహత్య రేటును తగ్గించవచ్చని పేర్కొన్నారు.
అద్దె ఇళ్లలో మెరుగైన శీతలీకరణ వ్యవస్థలు ఉండేలా చూడటం, బహిరంగ ప్రదేశాల్లో మరింత నీడ ఉండే ప్రాంతాలను సృష్టించడం లాంటి చర్యలను ప్రభుత్వాలు తీసుకోవాలని సూచించారు. అలాగే, పిల్లలు, యువకులకు అందుబాటులో మెరుగైన మానసిక ఆరోగ్య సేవల అవసరాన్ని లేవనెత్తారు.