‘డార్లింగ్’ అంటూ పరిచయం లేని మహిళలను సంబోధించడం లైంగిక వేధింపే అవుతుందని కలకత్తా కోర్టు తెలిపింది. ఓ మహిళా కానిస్టేబుల్ ను ఉద్దేశించి ఈ పదం వాడిన వ్యక్తికి నెల రోజుల పాటు జైలు శిక్ష విధించింది.
డార్లింగ్ అనే పదానికి లైంగిక అర్థం ఉందని కలకత్తా హైకోర్టు తెలిపింది. ఆ పదాన్ని ఉపయోగించి పిలవడం కూడా లైంగిక వేధింపే అవుతుందని అభిప్రాయపడింది. జస్టిస్ జే సేన్ గుప్తాతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. డార్లింగ్ అని పిలవడాన్ని సెక్షన్ 354 ఎ (1) (iv) కింద అభ్యంతరకరమైన, లైంగిక రంగు వ్యాఖ్యగా వర్గీకరించింది. కింది కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించిన జనక్ రామ్ అప్పీల్ విచారణ సందర్భంగా ఈ కోర్టు ఈ విధంగా స్పందించింది.
అసలేం జరిగిందంటే ?
2015 అక్టోబర్ 21న అండమాన్ లోని మాయాబందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మహిళా కానిస్టేబుల్ ను ఉద్దేశించి జనక్ రామ్ అనే నిందితుడు ‘డార్లింగ్’ అనే పదాన్ని ఉపయోగించారు. కానిస్టేబుల్ ను పిలుస్తున్నట్టుగా ‘క్యా డార్లింగ్ చలాన్ కర్నే ఆయ్ హై క్యా' (డార్లింగ్ చలాన్ ఇవ్వడానికి వచ్చావా?) అని సంబోధించాడు. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి అండమాన్ నికోబార్ కోర్టును ఆశ్రయించారు.
కోర్టుకు కూడా ఆ వ్యాఖ్యాలను సీరియస్ గా తీసుకుంది. పోలీసు తనిఖీల సందర్భంగా ఈ వ్యాఖ్య చేయడం అభ్యంతరకరమని అభిప్రాయపడింది. ముఖ్యంగా పండుగ సమయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలని కోర్టు గుర్తించింది. ఆ ట్రయల్ కోర్టు నిందితుడికి మూడు నెలల శిక్షను విధించింది. దీనిని సవాల్ చేస్తూ నిందితుడు కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. (అండమాన్ నికోబార్ దీవులు కలకత్తా హైకోర్టు పరిధిలోకి వస్తాయి.) అయితే హైకోర్టు కూడా ట్రయల్ కోర్టు విధించిన శిక్షను సమర్థించింది. కానీ శిక్షను మూడు నెలల నుంచి నెలకు తగ్గించింది.
ఈ తీర్పుపై పశ్చిమ బెంగాల్ మాజీ అడ్వొకేట్ జనరల్ బిమల్ ఛటర్జీ స్పందిస్తూ.. జైలు శిక్షకు బదులుగా ఒక సాధారణ హెచ్చరిక ఉంటే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. మరో సీనియర్ న్యాయవాది సుబ్రతో ముఖర్జీ ‘‘డార్లింగ్’’ అనే పదం అవమానకరమైనదిగా ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు. ఆ పదం డీక్షనరీ నిర్వచనాన్ని వివరించారు. అది అభిమాన పదం అని చెప్పారు. అతడు వాడిన పదంలో దురుద్దేశం లేనందున జరిమానా విధిస్తే సరిపోతుందని సూచించారు.
కానీ కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి రవీంద్రనాథ్ సామంత ఈ తీర్పును సమర్ధించారు. నిందితుడు వాడిన సందర్భంలో ఈ పదం లైంగిక వేధింపే అవుతుందని, శిక్షకు అర్హమైనదనే అని భావించారు. మనస్తత్వవేత్త అమిత్ చక్రవర్తి మాట్లాడుతూ.. "డార్లింగ్" అనే పదం సహజంగా లైంగిక అండర్ టోన్ ను కలిగి ఉందని అన్నారు. కొన్ని సంబంధాలలో మాత్రమే ఉపయోగించాలని తెలిపారు.