బీజేపీకి గడ్డుకాలం... వైసీపీ, బీఆర్ఎస్ సాయం కావాల్సిందేనా?

By Galam Venkata Rao  |  First Published Jul 16, 2024, 6:35 PM IST

ముచ్చటగా మూడోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. అయితే, కొద్దిరోజుల్లోనే మోదీ ప్రభుత్వానికి గడ్డు పరిస్థితులు వచ్చి పడ్డాయి. రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ తగ్గిపోయింది.


ముచ్చటగా మూడోసారి భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ఎన్నికయ్యారు. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో బొటాబొటి సీట్లను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. దీంతో ఎన్‌డీయేలోని పార్టీల సహకారంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మిత్రపక్షాలు బీజేపీని గండం నుంచి గట్టెక్కించినప్పటికీ అనేక సవాళ్ల మధ్య రానున్న ఐదేళ్లు మోదీ ప్రభుత్వం ముందుకు సాగాల్సిన పరిస్థితి నెలకొంది. 

తాజాగా భారతీయ జనతా పార్టీకి రాజ్యసభలో మాత్రం మెజార్టీ తగ్గిపోయింది. నామినేటెడ్‌ ఎంపీలైన రాకేష్‌ సిన్హా, రామ్‌ షకల్‌, సోనాల్‌ మాన్‌సింగ్‌, మహేష్‌ జఠ్మలాని పదవీ కాలం ఇటీవల ముగియడంతో పెద్దల సభలో బీజేపీ బలం 86కు పడిపోయింది. కేంద్ర ప్రభుత్వ సూచనలతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వీరిని నియమించగా.. అనంతరం వీరు రాజ్యసభలో అధికార ఎన్డీయేకి మద్దతుగా నిలిచారు. 

Latest Videos

ఇప్పుడు నలుగురు ఎంపీల పదవీ కాలం ముగియడంతో రాజ్యసభలో బీజేపీ సంఖ్య 86కు చేరగా.. ఎన్డీయే కూటమికి 101 మంది ఎంపీల బలం మాత్రమే ఉంది. మొత్తం 245 సభ్యులు కలిగిన పెద్దల సభలో మెజార్టీ మార్కు 113గా ఉంది. ప్రస్తుతం రాజ్యసభలో 225 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండి కూటమికి 87 మంది సభ్యుల మద్దతు ఉంది. ఇందులో కాంగ్రెస్‌కు 26, తృణమూల్‌ కాంగ్రెస్‌కు 13, ఆమ్‌ ఆద్మీపార్టీ 10, డీఎంకే పార్టీకి 10  మంది సభ్యులు ఉన్నారు. వీరితో పాటు ఎన్డీయే, ఇండియా కూటముల్లో భాగంగా లేని తెలంగాణలోని బీఆర్‌ఎస్‌, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, పలువురు నామినేటేట్‌ ఎంపీలు, స్వతంత్రులు ఉన్నారు.

ఆ మూడు పార్టీలు కీలకం....

ఈ నేపథ్యంలో ఎగువ సభలో బిల్లులను ఆమోదించడానికి మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీయేతర పార్టీలపై ఆధారపడాల్సి వస్తుంది. ఎన్డీయేకి మాజీ మిత్రపక్షాలైన తమిళనాడు అన్నా డీఎంకే, ఏపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కాంగ్రెస్ పార్టీ కీలకంగా మారాయి. కాగా, వైసీపీ వద్ద ఉన్న 11 మంది, అన్నా డీఎంకేకి చెందిన నలుగురు సభ్యుల మద్దతు ఎన్‌డీయేకి అవసరం ఉంది. ఇప్పటి వరకు వైసీపీ, అన్నాడీఎంకే కేంద్రంలో ఎన్‌డీయేకి మద్దతిచ్చాయి. అన్నా డీఎంకే ఇటీవల ఎన్నికలకు ముందు ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకొని వైసీపీని ఓడించింది. ఈ నేపథ్యంలో అన్నా డీఎంకే, వైసీపీ.. ఎన్‌డీయేకి మద్దతు ఇస్తాయా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. బిల్లుల ఆమోదం విషయంలో గట్టెక్కాలంటే రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా 11 మంది రాజ్యసభ సభ్యులున్న వైసీపీ మద్దతు ఎన్‌డీయేకి అవసరం. వచ్చే వారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బిల్లుల ఆమోదానికి వైసీపీ, బీజేడీ, బీఆర్ఎస్ మద్దతు కీలకంగా మారింది.

అయితే, అన్నా డీఎంకే, నవీన్‌ పట్నాయక్‌కు చెందిన బిజు జనతా దళ్‌.. ఎన్‌డీయేకి మద్దతు ఇవ్వకపోతే నామినేటెడ్‌ సభ్యుల ఓట్లపై ఆధారపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాజ్యసభలో 12 మంది నామినేటెడ్‌ సభ్యులున్నారు. వీరికి పార్టీతో పొత్తు లేకపోయినప్పటికీ ప్రభుత్వమే ఎంపిక చేసినందుకు బిల్లుల ఆమోదంలో వారు అధికార పార్టీకి మద్దతు ఇవ్వనున్నారు. వీరితో పాటు బీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎంపీలు, స్వతంత్రులు కూడా కీలకంగా మారారు.

20 సీట్లు ఖాళీ....

ప్రస్తుతం రాజ్యసభలో 20 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 11 మంది ఎన్నికయ్యేవారు కాగా.. ఈ ఏడాది ఈ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో మహారాష్ట్ర, అసోం, బిహార్‌ రాష్ట్రాల్లో రెండేసి, హరియాణా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, త్రిపుర రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని కూటమికి అసోం, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, త్రిపుర నుంచి ఏడు చోట్ల గెలిచే అవకాశం ఉంది. ఇక మహారాష్ట్రలో మరో రెండు దక్కించుకునే ఛాన్స్‌ ఉంది. దీంతో బీజేపీకి అదనంగా తొమ్మిది సీట్లు వచ్చే అవకాశం ఉంది. వీటితోపాటు నామినేటెడ్‌ సభ్యుల ఓట్లు, వైసీపీ ఓట్లు కలిపితే బీజేపీకి మెజారిటీ మార్కును దాటేందుకు కావాల్సినంత బలం ఉండనుంది.

click me!