"వలస" గోస: తిండి బాగాలేదని గొడవచేస్తే రైలు చార్జీలు చెల్లించమని ప్రభుత్వ బెదిరింపులు!

By Sree sFirst Published May 15, 2020, 1:53 PM IST
Highlights

తిండి బాగాలేదని గనుక క్వారంటైన్ సెంటర్లో గొడవచేస్తే.... రైలు చార్జీ డబ్బులను తిరిగి ప్రభుత్వం చెల్లించదని, దానితోపాటుగా ప్రభుత్వం నుండి అందే ఇతర ఆర్ధిక ప్రయోజనాలను కూడా చెల్లించమని బెదిరిస్తున్నారు జిల్లా కలెక్టర్లు.

కరోనా వైరస్ మహమ్మరి వేళ ఆందోళన చెందిన వలస కూలీలు ఎందరో రోడ్ల మీదికి వచ్చిన సంఘటనలు మనం చూసాం. వారిని ఉంచిన షెల్టర్లలో వసతులు సరిగా లేవు అనే విషయం దగ్గరి నుండి, ఇంటికి వెళ్తామని రోడ్లెక్కడం వరకు ఆందోళనకు లోనై ఉండడంతో వారంతా రోడ్లమీదికి వచ్చారు. 

ప్రభుత్వాలు సాధ్యమైనంతమేర వారి ఆవేదనను అర్థం చేసుకొని వారి సమస్యలను పరిష్కరిస్తున్నాయి. కానీ అందుకు భిన్నంగా బీహార్ ప్రభుత్వం మాత్రం వలస కార్మికులు కనీసం తిండి సరిగా పెట్టండి అని అడిగినందుకు బెదిరింపులకు దిగుతోంది. 

తిండి బాగాలేదని గనుక క్వారంటైన్ సెంటర్లో గొడవచేస్తే.... రైలు చార్జీ డబ్బులను తిరిగి ప్రభుత్వం చెల్లించదని, దానితోపాటుగా ప్రభుత్వం నుండి అందే ఇతర ఆర్ధిక ప్రయోజనాలను కూడా చెల్లించమని బెదిరిస్తున్నారు జిల్లా కలెక్టర్లు. ఈ గుండెల్ని పిండేసే ప్రభుత్వ దాష్టీకం బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. 

ఇలా బెదిరింపులకు దిగింది ఏ సాధారణ ఉద్యోగో అయితే... ఏదో తేలిక చేసాడు అని అనుకోవచ్చు. కానీ ఇలా బెదిరింపులకు పాల్పడుతుంది స్వయంగా ఐఏఎస్ అధికారులు. వారిని ఇలా బెదిరించమని చెప్పింది స్వయానా ఆ అధికారుల బాస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రత్యయర్ అమిత్!

ఆయన అందరు జిల్లా కలెక్టర్లనుద్దేశించి ఒక ఆదేశం జారీ చేసారు. క్వారంటైన్ సెంటర్లలో ఉన్న కూలీలు క్రమశిక్షణ లేకుండా రోడ్ల పైకి వస్తూ ఇబ్బందులు కలిగిస్తున్నారని, వాటిని తక్షణం నివారించడానికి మైకులు పట్టుకొని ఎవరైతే... క్రమశిక్షణతో 14 రోజుల ప్రభుత్య క్వారంటైన్, 7 రోజుల హోమ్ క్వారంటైన్ పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే రైల్వే చార్జీలను వెనక్కి ఇస్తామని ప్రకటించమని ఆదేశించారు. 

ఇతర రాష్ట్రాల నుంచి సొంతరాష్ట్రం బీహార్ వచ్చిన వలస కూలీలందరికి అక్కడి ప్రభుత్వం తప్పనిసరిగా 21 రోజుల క్వారంటైన్ ను పూర్తిచేసుకోవాలని ఆదేశించింది. 14 రోజుల ప్రభుత్వ క్వారంటైన్, ఆ తరువాత 7 రోజుల హోమ్ క్వారంటైన్. 

ఆ ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లలో వారికి పెట్టే తిండి సరిగా లేదని ఈ వలస కూలీలు ఆందోళనకు దిగారు. అక్కడ తిండి సరిగా ఉండేలా ఏర్పాట్లు చేయాల్సింది పోయి... ఇలా బెదిరింపులకు దిగడం ఎంతవరకు సబబు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

click me!